యల్లాప్రగడ జీవితంతో సింగీతం సినిమా
కాలచక్రం వెనక్కి వెళితే?... ఆ ఊహే బాగుంది కదూ.! ఆ ఊహకు తెరరూపం ఆ మధ్య వచ్చిన చిత్రం ‘24’. ఇప్పుడంటే ఇలాంటి సినిమాలు తీయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మంచి కథ, స్క్రీన్‌ప్లే మీద పట్టు, టెక్నాలజీ మీద దర్శకుడికి అవగాహన ఉంటే చాలు. పాతికేళ్ల క్రితం ఇలాంటి సినిమా చేయడం పెద్ద సాహసం. ఆ దర్శకుడికి గొప్ప విజన్ ఉండాలి. సింగీతం శ్రీనివాసరావు అలాంటి దర్శకుడే.
అందుకే పాతికేళ్ల క్రితమే ‘ఆదిత్య 369’ తీయగలిగారు. మూకీ సినిమా ‘పుష్పక విమానం’ దర్శకుడు కూడా ఈయనే అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘భైరవద్వీపం’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి పలు ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించారు. ఎయిటీ ప్లస్ ఏజ్‌లోనూ సింగీతం ఉత్సాహంగా ఉన్నారు. ఆ మధ్య ‘వెల్‌కమ్ ఒబామా’ చిత్రం చేసిన ఆయన ఇప్పుడు ఓ బయోపిక్ తీయడానికి రెడీ అవుతున్నారు.
భారతీయ వైద్య శాస్త్రజ్ఞులలో అత్యంత పేరు, ప్రతిష్ఠలు సాధించిన కీ॥యల్లాప్రగడ సుబ్బారావు జీవితం ఆధారంగా సింగీతం ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ సినిమా కోసం కథ రెడీ చేస్తున్నాను. బయోకెమిస్ట్రీ (జీవ రసాయన శాస్త్రం) రంగానికి సుబ్బారావుగారు చేసిన సేవలు కొనియాడదగ్గవి. ఆయన జీవితం గురించి అందరికీ తెలియాలి’’ అన్నారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌కు ఎవర్ని తీసుకోవాలో కథ రెడీ అయ్యాకే నిర్ణయించుకుంటానని సింగీతం పేర్కొన్నారు.