కరోనా ఎఫెక్ట్‌ : బాలీవుడ్‌ తారలు ఏం చేస్తున్నారంటే | Bollywood actors are self quarantine at Home | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌ : బాలీవుడ్‌ తారలు ఏం చేస్తున్నారంటే

Published Mon, Mar 23 2020 12:45 AM | Last Updated on Mon, Mar 23 2020 5:07 AM

Bollywood actors are self quarantine at Home - Sakshi

రేపటి సీన్‌ పేపర్‌ ఎక్కడ? లొకేషన్‌ ఏమిటి? కాల్షీట్‌ ఎన్నింటికి? ఈ హడావిడిలో ఉండే బాలీవుడ్‌ తారలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు. కరోనాతో కలత పడ్డారు. షూటింగ్‌లకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఇళ్లకే పరిమితమయ్యారు. భారతదేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధి ఒకరి స్పర్శతో మరొకరికి వ్యాపిస్తుందని, నలుగురిలో కలవడం వల్ల మనకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తుండటంతో చాలామంది నటీనటులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నవారు ఊరికే ఉంటారా? ఏదో ఒక వ్యాపకంలో పడతారు. కొందరు బొమ్మలు వేస్తున్నారు. కొందరు పుస్తకాలు చదువుతున్నారు. కొందరు వ్యాయామాలు చేస్తున్నారు. మరికొందరు పిల్లలతో గడుపుతున్నారు. కుటుంబంతో ఉండటం కూడా బాగుంది అని భావిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా
ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బాలీవుడ్‌ తారలు తమ ‘నిర్బంధ వ్యాపకాలను’ అభిమానులతో పంచుకుంటున్నారు. కరిష్మా కపూర్‌ తన ఇంటి బాల్కనీలో చక్కటి ఫోజ్‌లో ఫొటో దిగి పోస్ట్‌ చేసింది. ‘ఈ సమయంలో మీరంతా ఆందోళన చెందుతూ ఉంటారు. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చికాకు పడుతుంటారు. అయితే ఇలా ఉన్నది మీరొక్కరే కాదు. ప్రపంచంలో అందరం ఉన్నాం. అందుకే ధైర్యంగా ఉందాం. ఆశావహంగా ఉందాం’ అని ఆమె రాసింది. ఇక ఆమె సోదరి కరీనా కపూర్‌ తన పాత అల్బమ్స్‌ తిరగేసే పనిలో పడింది. బుజ్జాయిగా ఉన్న ఒక ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘ఎవరో దగ్గరికొస్తుంటే వద్దన్నట్టున్నా కదూ. ఈ కరోనా టైమ్‌కు సరిగ్గా సరిపోయే ఫోటో ఇది’ అని రాసింది. అలాగే ఆమె తన భర్త సైఫ్‌ అలీ ఖాన్‌ ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. ‘ఒక వారం పాటు ‘బుక్‌’ అయ్యాడు’ అని కామెంట్‌ పెట్టింది. క్యాండిల్‌ లైట్ల వెలుతురులో పుస్తకాలు చదువుకుంటున్న సైఫ్‌ ఫొటోను చూసి చాలా మంది ముచ్చటపడుతున్నారు.

బాల్కనీ నుంచి బయటకు
మలైకా అరోరా తన పెంపుడు కుక్కతో కలిసి బాల్కనీలో కూచుని ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది. ‘ఇంట్లో ఉన్నాను. నా కొడుకు అర్హాన్‌ ఈ ఫొటో తీశాడు’ అని రాసుకుంది ఆమె. ఇక టాప్‌స్టార్‌ ఆలియా భట్‌ అయితే తాను చదువుతున్న పుస్తకం ఫొటో పెట్టి ‘స్టే హోమ్‌. ఫినిష్‌ ఏ బుక్‌’ అని రాసింది. ఆలియా భట్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఆమె తండ్రి మహేశ్‌ భట్‌ నుంచి వచ్చింది. మహేష్‌ భట్‌ ఎప్పుడు ఏ పుస్తకం కొన్నా దాని బిల్లు ఆలియా భట్టే చెల్లించాలని ఒక ఒప్పందం వారిద్దరి మధ్య ఉంది. మరోవైపు బొమ్మలు గీసే వాళ్లకు కూడా కొదవ లేదు. ‘అంధాధున్‌’, ‘డ్రీమ్‌గర్ల్‌’, ‘బాలా’ సినిమాలతో మంచి ఊపు మీదున్న ఆయుష్మాన్‌ ఖురానా తోచిన బొమ్మలు వేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ‘ఇంట్లో ఉండి మన టాలెంట్‌ అంతా చూపుదాం. కరోనాను సమర్థంగా ఎదుర్కొందాం’ అని రాశాడతను.

తండ్రీ కూతుళ్ల అల్లరి
కరోనా ఎఫెక్ట్‌ వల్ల ఇంట్లో ఉండిపోయిన అక్షయ్‌ కుమార్‌ తన కూతురు నితారతో కలిసి అల్లరి చేస్తుంటే తాను రాయవలసిన పుస్తకం రాయలేకపోతున్నానని అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా ఒక సరదా ఫొటో పోస్ట్‌ చేసింది. ఫొటోలో ఆమె ల్యాప్‌టాప్‌ కనిపిస్తూ ఉండగా దూరంగా లాన్‌లో అక్షయ్‌ కుమార్‌ తన కుమార్తెతో ఆటలాడుతున్నాడు. దీపికా పడుకోన్‌ మాత్రం ఈ ఊహించని ఖాళీ సమయాన్ని తన దేహ సంరక్షణ కోసం కేటాయిస్తోంది. ‘సెల్ఫ్‌ కేరింగ్‌లో ఉన్నాను’ అంటూ ఆమె ఒక ఫొటో పోస్ట్‌ చేసింది. ‘వార్డ్‌రోబ్‌లను కూడా క్లియర్‌ చేస్తున్నాను’ అని మరో ఫొటో పెట్టింది. ప్రియాంక చోప్రా మాత్రం తన కుక్క జినోతో గడుపుతోంది. ‘ఇంట్లో ఉండటానికి మించిన క్షేమం ఇప్పుడు లేదు. నా కుక్క ‘జినో’తో ముద్దుముచ్చట్లు సాగుతున్నాయి. సంతోషంగా ఉంది’ అని రాసిందామె. జినో జర్మన్‌ షపర్డ్‌ అట. తొలి వివాహ దినోత్సవం సందర్భంగా భర్తకు ఆ కుక్కను కానుకగా ఇచ్చిందట. కత్రినా కైఫ్‌ ఈ ఖాళీ సమయాలలో గిటార్‌ మీటే పనిలో పడితే, యువ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా పుస్తకాల పురుగుగా మారాడు. సల్మాన్‌ ఖాన్‌ బొమ్మలు వేసి వేళ్లకు ఎక్సర్‌సైజ్‌ ఇస్తున్నాడు.

మొత్తం మీద బాలీవుడ్‌ స్టార్‌లందరూ క్రమశిక్షణతో ఉంటూ తాము కరోనాను అంటించుకోకుండా, తమ వల్ల అది పది మందికి అంటకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మనందరం కూడా అత్యవసరం అనుకుంటే తప్ప కొన్నాళ్లు ఇల్లు కదలకుండా ఇంట్లో ఉంటూనే పని చేస్తూ కాస్త సరదా సమయాలను కూడా దొంగిలించుకుందాం.

బుక్‌ రీడింగ్‌ – సిద్దార్థ్‌ మల్హోత్రా


గిటార్‌ ప్లే – కత్రినా కైఫ్‌


పెట్‌తో – ప్రియాంకా చోప్రా


ఎండ వేళ – మలైకా అరోరా


జాన్వీ కపూర్‌


సైఫ్‌ పుస్తక పఠనం


బాల్కనీలో కరిష్మా


దీపికా పదుకోన్‌ ఫేస్‌ మసాజ్‌


పాత ఆల్బమ్‌లో... కరీనా కపూర్‌


కంగనా రనౌత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement