‘లవ్ సోనియా’లో మృణాల్ ఠాకుర్
ఆడపిల్లల అక్రమ రవాణాపై గతంలో కమలహాసన్ ‘మహానది’ చిత్రాన్ని తీశాడు. మళ్లీ ఇటీవలి కాలంలో బాలీవుడ్, ఇతర భారతీయ సినిమాల దృష్టి ఈ అక్రమ రవాణా మీద పడింది. ఎన్ని చట్టాలు తెచ్చినా, అవరోధాలు సృష్టించినా, జాగ్రత్తలు తీసుకున్నా స్త్రీల రక్తంతో, కన్నీటితో మహోధృతంగా ఆ పాపపంకిల మహానది పరుగులిడుతూనే ఉంది అనడానికి రాబోతున్న ‘లవ్ సోనియా’ సినిమాయే వకాల్తా.
ప్రపంచ వ్యాప్తంగా వ్యభిచారం మీద సంవత్సరానికి జరిగే వ్యాపారం ఎంతో తెలుసా? అక్షరాలా 20 లక్షల కోట్ల రూపాయలు. ఇది కూడా కచ్చితమైన లెక్క కాదు. ఎంత అనేది ఎవరి ఊహకూ అందనిది. అది ఎంతైనా అన్నెం పున్నెం ఎరగని అమాయక స్త్రీల దేహాల మీద, యువతుల ఆక్రందనల మీద, చిన్న పిల్లల ఆర్తనాదాల మీద నిలబెట్టిన ఆర్థిక సామ్రాజ్యం. ఇందులో భారత్ వాటా తక్కువ కాదు.సంవత్సరానికి మన దేశంలో రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ‘వ్యభిచారం’ మీద జరుగుతుందని అంచనా. ఈ మొత్తం కూడా ఇంకా ఎక్కువే ఉండవచ్చు. దేశంలో ముప్పై లక్షల మంది ఆడవాళ్లు కనీసం ఈ రొంపిలో ఉన్నారు. వీరిలో నలభై శాతం మంది మైనర్లు. మొత్తం సంఖ్యలో ఎనభై శాతం మంది అక్రమ రవాణా ద్వారా ఈ కూపంలో దింపబడిన వాళ్లే. ఈ అక్రమ రవాణాకు బలైన వారందరూ ఎక్కడి నుంచి వస్తారు? పేదరికంలో ఉన్నవారి నుంచి, నిర్లక్ష్యానికి గురైన సమూహాల నుంచి, వంచనకు, మోసానికి గురై... వీరి జీవితం ఎంత నరకప్రాయంగా మారుతుందో ఊహించను కూడా ఊహించలేము.స్త్రీల అక్రమ రవాణా మీద తెలుగులో కొన్ని సినిమాలు ‘లైట్’ వేసే ప్రయత్నం చేశాయి. ‘గులాబి’ సినిమా అందులో ముఖ్యమైనది. దాని కంటే చాలా కాలం ముందు ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమా కూడా అమాయక స్త్రీలను ఈ రొంపిలో దించే కథాంశంతోనే వచ్చింది. కమలహాసన్ నటించిన ‘మహానది’ ఏకంగా సెక్స్‌వాటికల వరకూ కెమెరాను తీసుకెళ్లి ఈ కోరల్లో చిక్కుకున్నవారి జీవితాన్ని చూపించి కదిలించింది. ‘గజిని’ సినిమాలో ట్రాఫికింగ్‌ను అడ్డుకొనబోయే అసిన్ ప్రాణాలు విడుస్తుంది. ఇటీవల ‘కృష్ణార్జున యుద్ధం’లో ఇదే లైన్ తీసుకున్నారు కానీ సీరియస్‌గా డీల్ చేయలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో రాబోతున్న ‘లవ్ సోనియా’ సినిమా మాత్రం పూర్తిగా అధ్యయనం చేసి మరీ లోతుగా ఈ అంశం మీద తీసిన సినిమాగా చెప్పవచ్చు.
‘లవ్ సోనియా’ ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథ. వ్యవసాయం చేసే కుటుంబానికి చెందిన ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరిని వ్యవసాయం వల్ల నిరుపేదగా మారిన తండ్రి ఒక ఇంటికి పని మనిషిగా అమ్మేస్తాడు. కాని ఆ అమ్మాయి కేవలం అక్కడ పని మనిషిగా ఉండదు. చేతులు మారి వ్యభిచార కేంద్రానికి చేరుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘విటుల’కు ‘కన్య’లు కావాలి. ఈ ‘కన్య’ల కోసం ఎంత డబ్బైనా చెల్లిస్తారు.ఈ సినిమాలో ఈ సోదరి ‘కన్యత్వానికి’ బాగా రేటు పలుకుతుంది. కానీ మనం స్థాణువయ్యే అంశం ఏమిటంటే మళ్లీ వీరికి చిన్నపాటి ‘ఆపరేషన్’ చేయించి విటులకు ‘కన్యలు సిద్ధం’ అని చెప్తారు. అలా ఈ సోదరి ఒకసారి కన్యత్వం కోల్పోయి ‘తెప్పించుకున్న కన్యత్వం’తో హాంకాంగ్‌కు అమ్మివేయబడుతుంది. అక్కడి నుంచి సరుకులు చేరవేసే కంటైనర్‌లో అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కు చేరుతుంది. ఆడపిల్లల అక్రమ రవాణాకు చైనావారు కనిపెట్టిన పద్ధతి ఇది. సరుకులు చేరవేసే కంటైనర్‌లో గాలి వెలుతురు లేని బిగింపు మధ్య పశువుల కంటే ఘోరంగా వెలుతురు చూడకుండా వీళ్లు రోజుల తరబడి ఓడలో ప్రయాణించి దేశాలు దాటుతారు. మన దేశంలో కూడా ఈ వ్యవస్థ పకడ్బందీగా సాగుతోందని ఈ రంగంలో పని చేస్తున్న ఎన్‌జీవో సంఘాలు చెబుతున్నాయి. ‘కృష్ణార్జునయుద్ధం’లో కూడా ఈ పాయింట్ చూపించారు.
సరే... ఈ సోదరి నరక కూపంలో పడింది. ఇంకో సోదరి ఊరికే ఉండలేకపోతుంది. తన ప్రాణప్రదమైన సోదరి కోసం వెతుకులాట మొదలెడుతుంది. ఆమె పేరు సోనియా. ఎన్నో కష్టనష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొని ఈ సోనియా తన సోదరిని ఎలా చేరుకుంటుందనేది కథ.ఈ సినిమాకు దర్శకత్వం వహించిన తబ్రేజ్ నూరానీ అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడు. అంతేకాదు గత పదేళ్లుగా అక్రమ రవాణా జరుగుతున్న స్త్రీల గురించి పని చేస్తున్న కార్యకర్త. కొందరికి విముక్తి కూడా ప్రసాదించగలిగాడు. నాలుగేళ్ల పాటు అతడు రాసుకున్న కథకు రూపమే ‘లవ్ సోనియా’. ఇందులో దళారీలు, ‘మేడమ్’లు, విటులు... వీళ్ల వికృతత్వం ఏ స్థాయిలో ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాడు తబ్రేజ్. అంతేకాదు ఈ కూపం నుంచి బయటపడిన కొందరు స్త్రీలను కూడా సినిమాలో భాగం చేశాడు. వాళ్లందరూ నటించారు కూడా.రోజూ దినపత్రికలు, టీవీ చానల్స్ ఎన్నో ఉదంతాలను బయటపెట్టి చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి అక్రమ రవాణా విషయంలో. కానీ సినిమా వంటి మాధ్యమం ఇంకా ఎక్కువ ప్రభావాన్ని ఏర్పరచగలదు. ‘లవ్ సోనియా’ కచ్చితంగా మనకు తెలియని చీకటి లోకాన్ని పరిచయం చేసి మనం మరింత జాగ్రత్త పడేలా, చైతన్యంతో ఉండేలా, ప్రభుత్వ వ్యవస్థలు మేలుకొని పని చేసేలా చేయగలదని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment