హిందీలో రోనా అంటే ఏడవడం అని అర్థం. ‘కరోనా’లోనూ ఏడుపు ఉంది. అందుకే అందరినీ ఏడిపిస్తోంది. గృహ నిర్భందం చేస్తోంది. మనిషికీ మనిషికీ దూరం పెంచేస్తోంది. కరోనా పేరుకి తగ్గట్టుగా ఇక ఏడవడమే మిగిలింది అన్నట్లుగా తయారైంది. అన్ని వ్యాపారాలపై కరోనా ప్రభావం పడింది. సినిమా పరిశ్రమపై కూడా భారీ ప్రభావం చూపుతోంది. పది రోజులు షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చినందుకు, సినిమాల విడుదల వాయిదా వేసినందుకు బాలీవుడ్ దాదాపు 800 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నారు. మరి... కరోనా ఎంతమంది జీవితాలను రోడ్లపాలు చేస్తుందో? ఇక ‘రోనా’నే మిగిలింది.
హౌస్‌ఫుల్ కావాల్సిన థియేటర్స్ కరోనా వైరస్ ప్రభావంతో షట్‌డౌన్ అయ్యాయి. షూటింగులు ఆగాయి. నిర్మాతల హృదయాలు బరువెక్కాయి. బాక్సాఫీస్‌పై కరోనా చేసిన దాడికి నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటు రిలీజ్ పరంగా, అటు నిర్మాణం పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ కారణంగా బాలీవుడ్‌కి దాదాపు 800 కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, బీహార్.. ఇలా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను మూసేశారు. దీంతో ఈ నెలలో విడుదల కావాల్సిన ‘సూర్యవన్షి’ వంటి సినిమాలు వాయిదా పడ్డాయి.
అలాగే ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ మోషన్ పిక్చర్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్ వంటి బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు తమ షూటింగ్స్‌ను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో హీరోహీరోయిన్ల కాల్షీట్ల విషయంలోనూ భవిష్యత్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ‘‘ఇప్పటికే విడుదలైన టైగర్‌ష్రాఫ్ ‘భాఘీ 3’ సినిమాకు 25 నుంచి 30 కోట్ల నష్టం వాటిల్లింది. ఇటు ఇర్ఫాన్ ఖాన్ ‘అంగ్రేజీ మీడియం’ సినిమా కూడా కలెక్షన్ల పరంగా తీవ్రంగా నష్టపోయింది. అనుకున్న సమయానికి సినిమాలు విడుదల కాకపోవడం, సినిమా నిర్మాణాలు అగిపోవడం వల్ల హిందీ చిత్రపరిశ్రమకు దాదాపు 800కోట్ల నష్టం కలుగుతుంది’’ అని ఓ ట్రేడ్ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
‘‘కరోనా వైరస్ కారణంగా ఎంత నష్టం ఏర్పడుతుందని ఇప్పుడే లెక్కలేయడం కష్టం. ఎందుకంటే చిత్రీకరణలు ఆగిపోయిన సినిమాల నష్టాన్ని అంచనా వేయడానికి కాస్త సమయం పడుతుంది. ఈ నెలలో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. నష్టపోయిన నిర్మాతలు తమ సినిమాలను రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అలా అయితే కొత్తగా విడుదల కావాల్సిన సినిమాలు, విడుదల ఆలస్యమైన సినిమాలు ఒకేసారి వస్తే అదొక సమస్యగా మారుతుంది’’ అని మరో ట్రేడ్ విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక్క బాలీవుడ్‌లోనే కాదు..కరోనా వైరస్ ప్రభావం కారణంగా టాలీవుడ్, కోలీవుడ్..ఇలా అన్ని ఇండస్ట్రీలకు నష్టం వచ్చేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment