బాలీవుడ్‌లో కరోనా అలజడి ఎక్కువైందనే చెప్పాలి. రోజుకో స్టార్ కరోనా పాజిటివ్ అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే దాదాపు పదిమందికి పైగా బాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడ్డారు. చేతిలో పాజిటివ్ రిజల్ట్ పెట్టుకుని, చికిత్స చేయించుకుని, నెగటివ్ అయిన వెంటనే ఎంతో పాజిటివ్‌గా షూటింగుల్లో పాల్గొంటున్నారు. అంత పాజిటివ్‌గా ఉంటున్నారు కాబట్టి బాలీవుడ్ ‘పాజిటివ్ వుడ్’ అని అక్కడివాళ్లు అంటున్నారు.
గడచిన పదీ పదిహేను రోజుల్లో పలువురు తారలు కరోనా బారిన పడగా.. తాజాగా ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని సోమవారం ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నాను. అన్ని జాగ్రత్తలతో కరోనా చికిత్స తీసుకుంటున్నాను’’ అని ఫాతిమా పేర్కొన్నారు. ఫాతిమాకన్నా ఒక్కరోజు ముందు యంగ్ హీరో విక్రాంత్ మెస్సీ కరోనా బారినపడ్డారు. ‘లవ్ హాస్టల్’ సినిమా షూటింగ్ సమయంలో మెస్సీకి కరోనా వచ్చిందట. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు విక్రాంత్. ‘లవ్ హాస్టల్’ సినిమా షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ పడింది. కొన్ని రోజుల ముందు మరో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ‘భూల్ భులయ్యా 2’ షూటింగ్ సమయంలో కరోనా సోకింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను కూడా నిలిపివేశారు.
కార్తీక్ కరోనా నుంచి కోలుకున్నాక ఇటీవలే షూటింగ్ ఆరంభించినట్లు తెలుస్తోంది. కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు నటుడు పరేష్ రావల్. కానీ ఆయన కూడా కరోనా బారినపడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్న 17 రోజుల తర్వాత తనకు కరోనా పాజిటివ్ అని వెల్లడించారు పరేష్. మాధవన్ కూడా కరోనా కారణంగా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. అయితే తనకు కరోనా అని మాధవన్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడానికి వారం రోజుల ముందు భోపాల్‌లో జరిగిన హిందీ చిత్రం ‘అమ్రికీ పండిట్’ షూటింగ్‌లో పాల్గొన్నారు మాధవన్. ఆయనకు కరోనా వచ్చిన ఒక్కరోజు ముందు ఆమిర్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమాపై ఈ ప్రభావం పడుతుంది. ‘డిస్పాచ్’ సినిమా షూటింగ్ సమయంలో కోవిడ్ బారిన పడ్డారు మనోజ్ బాజ్‌పాయ్. ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ చిత్రదర్శకుడు కనుబెల్ నుంచే మనోజ్‌కు కరోనా సోకిందనే వార్తలు బాలీవుడ్‌లో వినిపించాయి.
ఈ సినిమా సిబ్బందిలో మరికొందరికి కూడా కరోనా రావడంతో షూటింగ్‌ను ఏకంగా రెండు నెలలు వాయిదా వేశారు. అయితే రీసెంట్‌గా జరిగిన కరోనా పరీక్షల్లో మనోజ్‌కు నెగటివ్ వచ్చింది. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబయ్ నుంచి ఢిల్లీ వెళ్లారు యాక్టర్ ఆశిష్ విద్యార్థి. అక్కడికెళ్లాక కొంచెం తేడాగా అనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారాయన. ‘‘ఒక్క కరోనా విషయంలోనే నేను పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నాను. కానీ పాజిటివ్ వచ్చింది’’ అని పేర్కొన్నారు ఆశిష్. ఇక బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె తల్లి నీతూకపూర్ సోషల్ మీడియా వేదికగా కన్ఫార్మ్ చేశారు. బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ ‘గంగూబాయి కతియావాడి’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ వేసింది కరోనాయే. ఈ చిత్రదర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా సోకింది. దీంతో ఈ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న ఆలియా భట్‌తో పాటు చిత్రయూనిట్‌లోని చాలామంది హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. రీసెంట్‌గా భన్సాలీకి కరోనా నెగటివ్ వచ్చిందట. అంతేకాదు ‘గంగూబాయి...’ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశారని సమాచారం. వీరితో పాటు ‘గల్లీభాయ్’ ఫేమ్ సిద్ధార్థ్ చతుర్వేది, హీరోయిన్ తారా సుతారియా, ‘మైదాన్’ చిత్ర దర్శకుడు అమిత్ శర్మ వంటి వారు కూడా రీసెంట్‌గా కరోనా బారిన పడి, హోమ్ ఐసోలేషన్ను ఎక్స్‌పీరియన్స్ చేశారు.
నెల రోజుల గ్యాప్‌లో పదిమంది సెలబ్రిటీలకుపైగా కరోనా సోకడాన్ని బట్టి సెకండ్ వేవ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ సినీపరిశ్రమలోని వారు కూడా స్ట్రాంగ్‌గానే ఉంటున్నారు. తాత్కాలికంగా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి, నెగటివ్ వచ్చిన వెంటనే ఆరంభిస్తున్నారు. సినిమా తారలందరూ కరోనా అనే భయాన్ని పక్కనపెట్టి, పాజిటివ్ మైండ్‌తో షూటింగ్స్‌కి వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment