భారత్-చైనాల మధ్య బాలీవుడ్ వారధి
చైనా సైనికులు మన దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నా ఆ దేశ సినీ అభిమానులు మాత్రం భారతీయ చిత్రాలను గుండెలకు హత్తుకుంటున్నారు. ముఖ్యంగా పలు బాలీవుడ్ చిత్రాలు చైనీయుల భాషలోకి అనువాదమవుతూ అక్కడ విశేష ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. బాలీవుడ్ చిత్రాల్లోని శృంగారం, భావోద్వేగాలు, హాస్యం, కట్టూ-బొట్టూ చైనీయులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పలు బాలీవుడ్ పాటలతో చైనీయులు కూనిరాగాలు కూడా తీస్తున్నారు. అంతేనా బాలీవుడ్ పాటలు అక్కడి వేడుకల్లో కూడా హంగామా చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా యువత బాలీవుడ్ సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారని జియాచెన్ ఫాంగ్ అనే సందర్శకురాలు తెలిపింది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ... ‘రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’ సినిమా మా భాషలోకి కూడా అనువాదమైంది.
ఈ సినిమాకు యువత నుంచి మంచి స్పందన వచ్చింది. నేను కూడా ఆ సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. మరోసారి కూడా చూడాలనుకుంటున్నా. మనసు చెప్పిన మాట వినాలని, మనసుకు నచ్చిందే చేయాలని ఆ సినిమాలో తెలిజెప్పిన తీరు అద్భుతంగా అనిపించింది. ఆమిర్‌ఖాన్ చిత్రాలకు చైనాలో మంచి డిమాండ్ ఉంది. జాన్ అబ్రహాం నటించిన ‘ధన్ ధనా ధన్ గోల్’ కూడా ఎంతగానో నచ్చిందని’ చెప్పింది. క్లాకీ ఝోవ్ అనే మరో యువతి మాట్లాడుతూ.. ‘సంజయ్ దత్ నటించిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్’ చిత్రాలు కూడా బాగా ఆడాయి. మున్నాభాయ్ సిరీస్‌లో మూడో చిత్రం కోసం ఎదురుచూస్తున్నా. చాందినీచౌక్ టు చైనా, 3 ఇడియట్స్, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాలు కూడా ఎంతగానో నచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ చిత్రాలతో పోటీపడుతున్నాయ’ని చెప్పింది. మొత్తానికి ఇండియా-చైనాల మధ్య సంబంధాలను బాలీవుడ్ మెరుగుపరుస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమో కళకు అంతటి శక్తి ఉందేమో..! చూద్దాం..!