అమితాబ్, ఆమిర్, సచిన్ ఉపాధి కూలీలు!
గోవాలో పక్కదారి పట్టిన ఉపాధి హామీ పథకం జాబితాలో బాలీవుడ్, క్రికెట్ స్టార్స్
పనాజీ: వారంతా బాలీవుడ్ సెలబ్రిటీలు.. క్రికెట్ స్టార్స్.. కానీ వారికి తినడానికి తిండి కూడా లేదట. అందుకే ఉపాధి హామీ పథకంలో కూలీలుగా చేరారట. బాలీవుడ్ సెలబ్రిటీలు కూలీలుగా చేరడమా అని ఆశ్చర్యపోతున్నారా.. గోవాలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఇదే నిజమని చెపుతోంది. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, ఆమిర్‌ఖాన్, కపిల్‌దేవ్, రాహుల్ ద్రావిడ్, సౌరభ్ గంగూలీ, యువరాజ్‌సింగ్ అంతా ఉపాధి కూలీలే అంటోంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరు కూడా ఉండటం గమనార్హం. గోవాలో ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలను స్వచ్ఛంద సంస్థ గోవా పరివర్తన్ మంచ్(జీపీఎం) శనివారం బట్టబయలు చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా గోవా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి ఈ వివరాలు సేకరించిన జీపీఎం.. యూపీఏ ప్రభుత్వం ప్రధాన ప్రచారాస్త్రంగా చెప్పుకుంటున్న ఉపాధిహామీలో నిధులు ఎలా పక్కదారి పడుతున్నాయో వెల్లడించింది. బోగస్ లబ్దిదారుల పేరుతో నిధులు ఎలా కొల్లగొట్టారో లెక్కలతో సహా బయటపెట్టింది.
స్థానిక ఛింబల్ ప్రాంతంలో కూలీల మార్కెట్‌లో సుమారు వెయ్యి మందికిపైగా ఉపాధి హామీ లబ్దిదారులు ఉన్నారు. ఈ జాబితాను ఆర్‌టీఐ చట్టం ద్వారా సేకరించిన జీపీఎం అందులో బాలీవుడ్.. క్రికెట్ సెలబ్రిటీల పేర్లు ఉండటాన్ని గుర్తించింది. రోజుకు రూ. వంద చొప్పున.. 150 రోజులకు సెలబ్రిటీలకు కూలీ చెల్లించారని, అలాగే వీరి భార్యలు, పిల్లల పేర్లపై సైతం చెల్లించినట్టు లెక్కలు చూపారు. అమితాబ్ బచ్చన్ మొత్తం కుటుంబం, సచిన్‌తో పాటు ఆయన భార్య అంజలి, ఇద్దరు పిల్లలు, ద్రవిడ్‌తో పాటు ఆయన భార్య, కుమారుడు, యువరాజ్‌సింగ్, రికీ పాంటింగ్ ఫ్యామిలీలు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. గోవాలో ఉపాధి హామీ అమలులో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి.. అక్రమార్కులపై చర ్యలు తీసుకోవాలని జీపీఎం కన్వీనర్ యతీష్ నాయక్ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై శనివారం జీపీఎం ప్రతినిధి బృందం గోవా గవర్నర్ బీవీ వాంచూను కలసి విచారణకు ఆదేశించాల్సిందిగా కోరింది.