సచిన్ తొడకొట్టాడు!
నీ ఇంటికొచ్చా..నీ నట్టింటికొచ్చా..అంటూ సమరసింహారెడ్డిలో తొడగొట్టిన బాలయ్యను ప్రేక్షక జనం ఇప్పటికీ మర్చిపోలేదు. గొడ్డలి చేతబట్టి శత్రువు ఇంటికెళ్లి ఇలాంటి సవాల్ చేయడం ఒక సమరసింహానికే చెల్లింది. ఆ సీన్‌లో బాలయ్య తొడగొట్టడాన్ని దశాబ్ధ కాలంగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత బాబాయ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ సినిమా కోసం తొడకొట్టాడు.
అయితే తెలుగు సినిమాల్లో తొడకొట్టడం అనేది ష్యాషన్. మొన్నామధ్య దూకుడు సినిమాలో మహేష్ కూడా తొడకొట్టాడు. కానీ ఇప్పుడు అదే కామెడీ చేస్తూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా తొడకొట్టడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. శనివారం ముంబైలో ఆరంభమైన ప్రొ కబడ్డీ లీగ్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ ఈ సరదా సన్నివేశానికి కారకుడయ్యాడు. అభిషేక్ బచ్చన్ జూనియర్స్ టీం తన ప్రత్యర్థితో తలపడే మ్యాచ్ ముందు సచిన్, అమీర్‌ఖాన్ కబడ్డీ గ్రౌండ్‌లోని వచ్చి తొడలు కొట్టి మరీ కామెడీలు చేశారు.అయితే అప్పుడు మెరిసిన ఫోటో ఒకటి ఇప్పుడు ట్విట్టర్లలో జోరుగా షికార్లు చేస్తోంది. సచిన్ బాలయ్యకు పోటీగా తొడకొడుతున్నాడే, ఆదిని మించిపోయాడే అన్నంత రేంజులో ఈ తొడకొట్టుడు సన్నివే శం పాపులర్ అయిపోయింది.
ముంబైలో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ జంట, అందాల తార ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు, వీరితో పాటు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ అందరూ కలసి కబడ్డీ మ్యాచ్ను వీక్షించారు.