
ఆ ఇంజక్షన్లకి నేను దూరం!
థర్టీ ప్లస్ తర్వాత ఎవరైనా సరే లావైపోతారు. అప్పటివరకూ మెరిసే చర్మం ఆ తర్వాత తన వైభవాన్ని మెల్ల మెల్లగా కోల్పోతూ ఉంటుంది. ముఖ్యంగా వద్దు వద్దన్నా లేడీస్‌కి ఒళ్లొచ్చేస్తుందంటుంటారు.
అలాగే, చర్మం, జుత్తు కూడా పాడవుతాయని అంటుంటారు.
కానీ, కేర్ తీసుకుంటే థర్టీస్‌లోనే కాదు ఫార్టీస్, ఫిఫ్టీస్.. ఏ వయసులో అయినా స్లిమ్‌గా, అందంగా ఉండొచ్చంటున్నారు కరీనా కపూర్. ఆమె చెప్పిన కొన్ని టిప్స్...
* ఇలా చేస్తే బాగుంటుంది అని నేనెవరికీ సలహాలివ్వను. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు. అందుకే సలహాలివ్వడానికి బదులు నేనేం చేస్తానో చెబుతాను. వీలు కుదిరితే వాటిని ఫాలో కావొచ్చు.
* నేను యోగా చేస్తాను. వారంలో కనీసం ఐదు రోజులైనా యెగా చేయకపోతే నాకదోలా ఉంటుంది. ప్రతి రోజూ గంటసేపు చేస్తాను. వంద సూర్య నమస్కారాలు చేస్తాను. అన్ని చేయగలరా అనుకోవద్దు. మొదట్లో అన్నేసి అంటే కష్టమే. ప్రాక్టీస్ చేయగా చేయగా చేయగలుగుతాం.
* సెక్లింగ్ కంపల్సరీ. కార్డియో ఎక్సర్‌సైజ్ తప్పకుండా చేస్తాను. మన శరీర తత్వానికి ఏ ఎక్సర్‌సైజ్ అయితే బాగుంటుందో తెలుసుకుని చేయడం మంచిది.
* ఒకప్పుడు నేను బాగా మాంసాహారం తీసుకునేదాన్ని. ఆ తర్వాత శాకాహారిగా మారిపోయాను. అప్పట్నుంచీ నా ఆరోగ్యం ఇంకా బాగుంటోంది.
* నా డైలీ డైట్ గురించి చెప్పాలంటే... నూనె లేకుండా తయారు చేసిన ఉప్మా లేక పరోటాలు తింటాను. లేకపోతే ఇడ్లీలు తీసుకుంటాను. లంచ్‌కి బ్రౌన్ రైస్, రోటీ, పప్పు, కూరగాయలు తింటాను. రాత్రి సూప్, ఉడకబెట్టిన కూరగాయలు తింటాను. రోజు మొత్తంలో అప్పుడప్పుడు ఫ్రూట్స్ తింటాను.
* మేం రకరకాల వాతావరణాల్లో షూటింగ్స్ చేస్తాం కాబట్టి జుత్తు త్వరగా పాడైపోతుంది. అందుకే నెలకోసారి తలకు ఆయిల్ మసాజ్ చేయించుకుంటాను. ఆలివ్, కాస్టర్, కోకోనట్, ఆల్మండ్ ఆయిల్స్‌తో చేసే ఈ మసాజ్ కారణంగా జుత్తు కుదుళ్లు బలపడతాయి. సినిమాల్లో క్యారెక్టర్స్‌కి అనుగుణంగా హెయిర్ స్టయిల్ చేసుకుంటాను. విడిగా మాత్రం ప్రయోగాలు చేయను. జస్ట్ పోనీటెయిల్ వేసుకుంటాను.
* నాది డ్రై స్కిన్. అందుకని మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడతాను. నెలకోసారి న్యాచురల్ ఆయిల్స్‌తో బాడీ మసాజ్ చేయించుకుంటాను. మసాజ్ అంటే అదేదో కాని పనిలా కొంతమంది భావిస్తారు. అది చేయించుకోవడంవల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది.
* గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి నేను మినిమమ్ ఆరు గ్లాసుల హాట్ వాటర్ తాగుతాను. దీనివల్ల డెజైషన్ బాగుంటుంది. జీర్ణ క్రియ బాగా పని చేస్తే దాదాపు ఆరోగ్యంగా ఉన్నట్లే.
* వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. వాటిని పోగొట్టుకోవడానికి ‘బొటాక్స్ ఇంజక్షన్’ చేయించుకుంటుంటారు. నేను దానికి వ్యతిరేకిని. అలాగే, జుత్తు క్రమం క్రమంగా గ్రేగా మారిపోతుంది. అయినా ఫర్వాలేదని సరిపెట్టుకుంటాను. బయటికి మనం ఎంత అందంగా ఉన్నామన్నది కాదు.. ‘ఇన్నర్ పీస్’ ముఖ్యం. మన మనసు ఎంత ఆనందంగా ఉంటే శారీరకంగా మనం అంత అందంగా ఉన్నట్లు లెక్క.
సినిమా పరిశ్రమలో కరీనాకు ఉన్న అత్యంత ఆప్తమిత్రుల్లో అమృతా అరోరా ఒకరు. ఈ ఇద్దరూ వీలు కుదిరినప్పుడల్లా యోగా క్లాసెస్‌లో కలుస్తుంటారు. కలిసి యోగా చేయడంతో పాటు జిమ్ కూడా చేస్తుంటారు.