'బ్రహ్మోత్సవం' మూవీ రివ్యూ | brahmostavam Movie Review | Sakshi
Sakshi News home page

'బ్రహ్మోత్సవం' మూవీ రివ్యూ

Published Fri, May 20 2016 11:59 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

'బ్రహ్మోత్సవం' మూవీ రివ్యూ - Sakshi

'బ్రహ్మోత్సవం' మూవీ రివ్యూ

టైటిల్: బ్రహ్మోత్సవం
జానర్: ఫ్యామిలీ డ్రామా
తారాగణం: మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, రేవతి, జయసుధ, రావూ రమేష్ ఇంకా చాలా మంది...
సంగీతం: మిక్కీ జే మేయర్
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: పీవీపీ సినిమా, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్

శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో చేసిన సినిమా బ్రహ్మోత్సవం. గతంలో మహేష్ హీరోగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి బ్లాక్బస్టర్ అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన బ్రహ్మోత్సవం, రిలీజ్కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. సమ్మర్ సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న బ్రహ్మోత్సవం వెండితెర మీద పండగ వాతావరణం తీసుకు వచ్చిందా...?

కథ :
రూ. 400తో మొదలు పెట్టి రూ. 400 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీకి ఓనర్ అయిన మంచిమనిషి చంటబ్బాయి (సత్యరాజ్). నా అన్న వాళ్లంతా తన చుట్టే ఉండాలన్న కోరికతో తన నలుగురు బావమరుదులను తన వ్యాపారంతో పాటు కుటుంబంలోనూ భాగస్వాములను చేసుకుంటాడు. తన ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఓ ఉత్సవంలా జరుపుతూ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. చంటబ్బాయి కొడుకు (మహేష్ బాబు) కూడా తండ్రి లాగే అందరూ తనతోనే ఉండాలనుకుంటాడు. చంటబ్బాయికి సమాజంలో, కుటుంబంలో ఉన్న గౌరవం చూసి ఆయన పెద్ద బావమరిది (రావు రమేష్)కి అసూయ కలుగుతోంది. తన కూతురిని చంటబ్బాయి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి, పెత్తనం అంతా తనదవుతుందనుకుంటాడు. కానీ అదే సమయంలో ఆ ఇంటికి చుట్టంగా వచ్చిన అమ్మాయి (కాజల్ అగర్వాల్)తో చంటబ్బాయి కొడుకు చనువుగా ఉండటం చూసి వారి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. అతన్ని వారించాలని ప్రయత్నించిన చంటబ్బాయి, అతనన్న మాటలతో బాధపడతాడు. అదే బాధలో తన కోరికేంటో కొడుక్కి చెబుతూ కొడుకు చేతుల్లోనే చనిపోతాడు. చంటబ్బాయి కోరిక ఏంటి, ఆ కోరిక తీర్చడానికి అతని కొడుకు ఏం చేశాడన్నదే మిగతా కథ.

నటీనటులు:
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి అద్భుతమైన నటనతో సినిమాను నడిపించాడు. హీరోయిన్లకే అసూయ పుట్టించేంత అందంతో ఆడియన్స్ను కట్టిపడేశాడు. మహేష్ బాబు లుక్, పర్ఫామెన్స్ ఒకదానితో ఒకటి పోటి పడ్డట్టుగా కనిపించింది. సినిమాలో కీలక పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నాడు. ఆనందంగా ఉన్న కుటుంబంలో కల్లోలం సృష్టించే పాత్రలో సరిగ్గా సరిపోయాడు. హీరో తండ్రి పాత్రలో సత్యరాజ్ మంచి నటన కనబరిచాడు. హుందాతనంతో పాటు సెంటిమెంట్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. ప్రణీతకు పెద్దగా పర్ఫామ్ చేసే అవకాశం లేకపోయినా స్క్రీన్కు బాగానే  గ్లామర్ యాడ్ చేసింది. తొలి భాగంలో హీరోయిన్గా కనిపించిన కాజల్, సెటిల్డ్ పర్ఫామెన్స్తో మెప్పించింది. స్వతంత్ర భావాలున్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఇక సమంత మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించింది. చిలిపితనం, అల్లరి, అదే స్థాయిలో ఎమోషన్స్ చూపిస్తూ కీలక సన్నివేశాలకు ప్రాణం పోసింది. ఇతర పాత్రలో నరేష్, షియాజీ షిండే, కృష్ణభగవాన్, తనికెళ్ల భరణి, జయసుధ లాంటి లెక్కకు మించిన నటులు కథను నడిపించడంలో తమ వంతు పాత్ర పోషించారు.

సాంకేతిక నిపుణులు :
నలుగురితో కలిసుంటే బాగుంటుంది అన్న చిన్న పాయింట్ను ఇంత భారీ స్థాయిలో ఇంత రిచ్గా తెర మీద ప్రజెంట్ చేయటంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విజయం సాధించాడు. ముఖ్యంగా ఇంతటి భారీ స్టార్ కాస్ట్ను ఒకేసారి తెరమీద చూపించటం సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసానికి రెడీ అయిన శ్రీకాంత్, మరోసారి తన సినిమాకు కథే హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. మహేష్ లాంటి సూపర్ స్టార్ను హీరోగా తీసుకొని కూడా తన స్టైల్ సినిమాతోనే ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అనవసరమైన కామెడీ ట్రాక్లు, యాక్షన్ సీన్స్ ఇరికించకుండా కథానుగుణంగా సినిమా అంతా ఉమ్మడి కుటుంబంలో జరిగే పండుగలా తెరకెక్కించాడు. రత్నవేలు సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ముఖ్యంగా హరిద్వార్, కాశీ లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించిన సన్నివేశాలు చూపు తిప్పుకోనివ్వవు. మిక్కీ జే మేయర్ సంగీతంతో పాటు గోపిసుందర్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు
రావూ రమేష్
సినిమాటోగ్రఫి
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :
స్లో నారేషన్

మొత్తమ్మీద ఈ సినిమా కుటుంబ బాంధవ్యాల విలువలు తెలిపే వెండితెర ఉత్సవం


- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement