
సినిమా రివ్యూ: గురి తప్పిన 'బుల్లెట్' రాజా!
సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్, పాన్ సింగ్ తోమార్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ రిటర్న్ చిత్రాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తిగ్ మాన్షు దులియా గుర్తింపు తెచ్చుకున్నారు. యూపీ రాజకీయాలు, మాఫియా నేపథ్యంతో చోటా నవాబ్ సైఫ్ ఆలీ ఖాన్, సోనాక్షి సిన్హా లతో తాజాగా బుల్లెట్ రాజా చిత్రాన్ని రూపొందించారు. క్రేజి కాంబినేషన్ తో నవంబర్ 29 శుక్రవారం విడుదలైన బుల్లెట్ రాజా చిత్రం ఏ రకమైన టాక్ సంపాదించుకుందో ఓసారి పరిశీలిద్దాం.
ఓ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాజా మిశ్రా సాదాసీదా యువకుడు. ఉద్యోగం కోసం చూస్తున్న రాజా మిశ్రా అనుకోని పరిస్థితుల్లో తనను చేరదీసిన మిత్రుడు రుద్ర (జిమ్మి శ్రేగిల్) కోసం గ్యాంగ్ స్టర్ గా మారుతాడు. రాజా, రుద్ర కలిసి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న రాజకీయ నేతల, పారిశ్రామికవేత్తల, పోలీసును ఎదుర్కొనేందుకు ఓ శక్తివంతమైన ఫ్యాక్షన్ గ్రూప్ గా ఎదుగుతారు. ఈ క్రమంలో వ్యతిరేక వర్గం చేసిన దాడిలో రుద్ర చనిపోతాడు. తన స్నేహితుడి మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనే కథనే 'బుల్లెట్ రాజా'
గతంలో లవర్ బాయ్ పాత్రలకే పరిమితమైన సైఫ్ ఓ విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో బుల్లెట్ రాజాగా కనిపించాడు. యాంగ్రీ మ్యాన్ లుక్ తో సైఫ్ ఆకట్టుకున్నాడు. అయితే ప్రేక్షకులపై ప్రభావం చూపే రేంజ్ లో బుల్లెట్ రాజా పాత్రను మలచకపోవడం నిరాశ కలిగించే విషయం. గతంలో గ్యాంగ్ స్టర్ పాత్రలో బాలీవుడ్ లో బుల్లెట్ రాజా ను మించిన పాత్రను మిగతా హీరోలు ఆకట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించే రేసులో బుల్లెట్ రాజాగా సైఫ్ వెనకబడిపోయాడు. దబాంగ్, లుటేరా, రౌడీ రాథోడ్, దబాంగ్-2 లాంటి గత చిత్రాల్లో పోల్చుకుంటే సోనాక్షి సిన్హాకు గొప్పపాత్రమే కాదు. డ్యాన్సులకు మాత్రమే పరిమితమయ్యే పాత్రలో సోనాక్షి గ్లామర్ తో ఆకట్టుకుంది.
ఇక చాలా రోజుల తర్వాత రుద్ర పాత్రలో జిమ్మి షెర్గిల్ కు మంచి పాత్ర లభించింది. బుల్లెట్ రాజా చిత్రంలో ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలో నటించాడు. తన పాత్రకు జిమ్మి వంద శాతం న్యాయం చేకూర్చాడు. గ్యాంగ్ రాజ్ బబ్బర్, రవి కిషన్, గుల్షన్ గ్రోవర్ లు విలనిజాన్ని తమదైన శైలిలో పండించారు. అతిధి పాత్రలో కనిపించిన విద్యుత్ జమ్ వాల్ చివర్లో మెరుపులు మెరిపించాడు. ఫైట్స్, యాక్షన్ సీన్లలో మెచ్యురిటీ కనిపించింది.
గతంలో సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్, పాన్ సింగ్ తోమార్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ రిటర్న్ చిత్రాలతో ఆకట్టుకున్న మరో గ్యాంగ్ స్టర్ కథను నడిపించడంలో దర్శకుడు తిగ్ మాన్షు దులియా తడబాటకు గురయ్యాడు. గ్యాంగ్ స్టర్ కథ అంటేనే పగ ప్రతీకారం తప్ప మిగితా అంశాలకు పెద్దగా చోటుండదు. జాగ్రత్తగా డీల్ చేయాల్సిన గ్యాంగ్ స్టర్ కథను ప్రేక్షకుడ్ని మెప్పించే విధంగా తెరకెక్కించడంలో దులియా ఆకట్టుకోలేకపోయాడు. ఈచిత్రంలో బుల్లెట్ లా మాటాలు పేల్చాడు కానీ.. కథను వేగంగా పరిగెత్తించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించే విధంగా 'బుల్లెట్ రాజా'ను పేల్చడంలో దులియా గురి తప్పాడు.