ఆయనకు అరవై... ఆమెకు ఇరవై అయిదు... కెమిస్ట్రీ అదుర్స్! | Celeb gossip wrap: The highlights and lowlights of the 2016 Cannes Film Festival | Sakshi
Sakshi News home page

ఆయనకు అరవై... ఆమెకు ఇరవై అయిదు... కెమిస్ట్రీ అదుర్స్!

Published Mon, May 23 2016 11:27 PM | Last Updated on Thu, Oct 4 2018 8:24 PM

ఆయనకు అరవై... ఆమెకు ఇరవై అయిదు...  కెమిస్ట్రీ అదుర్స్! - Sakshi

ఆయనకు అరవై... ఆమెకు ఇరవై అయిదు... కెమిస్ట్రీ అదుర్స్!

ముగిసిన కాన్స్ చలన చిత్రోత్సవాలు
ఉత్తమ చిత్రం: ‘ఐ, డేనియల్ బ్లేక్
ఉత్తమ దర్శకుడు: ఒలీవియర్ అసయస్
ఉత్తమ నటుడు : షాహెబ్ హొస్సేని
ఉత్తమ నటి: జాక్లెన్ జోస్
 
ఫ్రాన్స్ నగరంలోని ఫ్రెంచ్ రివెరియా తీరంలో ఈ నెల 11న ఆరంభమైన కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. విదేశీ తారలతో పాటు మన దేశీ తారలు కూడా పాల్గొన్న ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌ని ఆకట్టుకున్నాయి. అవార్డు విజేతల వదనాల్లో ఆనందం వెల్లివిరిసింది. రెడ్  కార్పెట్ పై తారలు చేసిన సందడికి కొదవ లేకుండా పోయింది. మొత్తం మీద ముగింపు ఉత్సవాలు కనువిందుగా జరిగాయి. కొన్ని మెరుపులూ, విరుపులూ ఈ విధంగా...
     
ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘పామ్ డ ఓర్’ (గోల్డెన్ పామ్) అవార్డు ‘ఐ, డేనియల్ బ్లేక్’ చిత్రాన్ని వరించింది. కెన్ లోచ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. పదేళ్ల క్రితం ఇదే దర్శకుడు తీసిన ‘ద విండ్ దట్ షేక్స్ ద బార్లీ’ చిత్రానికి ఇదే అవార్డు వచ్చింది. రెండు సార్లు ఈ అవార్డు దక్కించుకున్న తొమ్మిదో ఫిలిం మేకర్‌గా కెన్ రికార్డు సాధించారు. చిత్రోత్సవాల ముగింపు చిత్రంగా కూడా ‘ఐ, డేనియల్ బ్లేక్’ ప్రదర్శితమైంది.
     
చివరి రోజు ఉత్సవాల్లో ప్రధానంగా ఓ జంట అందర్నీ ఆకట్టుకుంది. నలుపు రంగు సూటూ బూటూ ధరించి, 60 ఏళ్ల నటుడు-దర్శకుడు మెల్ గిబ్సన్ తన 25 ఏళ్ల గాళ్‌ఫ్రెండ్, నటి రోసలిండ్ రోజ్‌తో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని రెడ్ కార్పెట్‌పై వాక్ చేశారు. అది మాత్రమే కాకుండా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను బహిరంగంగా బయటపెట్టారు. ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకునే సీన్‌ని కెమెరా కళ్లు క్లిక్‌మనిపించాయి.
మాజీ ప్రేమికులైన నటుడు సీన్ పెన్, నటి చార్లెస్ థెరాన్ ఈ వేడుకల్లో అందరూ ఊహించినట్లుగా ఎడమొహం పెడ మొహంగా వ్యవహరించారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘ద లాస్ట్ ఫేస్’ చిత్రాన్ని విడిపోయాక జాయింట్‌గా ప్రమోట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇబ్బందిపడ్డారు. ఇద్దరూ ‘హలో’ చెప్పుకున్న విధానం నలుగురూ మాట్లాడుకునేంత అసహ్యంగా అనిపించిందట. తమ చిత్రం ప్రదర్శితమయ్యాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయేటప్పుడు చిన్న హగ్ ఇచ్చుకుని, టాటా చెప్పేసుకున్నారు.
     
ఇక.. ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవారిలో ఎరిన్ మొరియార్టి, కిరిస్టన్ డన్ట్స్, ఎలెజాండ్రా ఆంబ్రోసియో, ఐసబెలి ఫోంటేనా, క్యాట్రినెల్ మార్లన్, ఇరీనా షేక్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement