అంతరిక్షంలో వినోదం!
అంతరిక్షంలో వినోదం!
Published Mon, Jan 20 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అయితే, అంతరిక్షయానం చేసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేలా జస్ట్ ఎల్లో మీడియా సంస్థ ‘చందమామలో అమృతం’ చిత్రాన్ని నిర్మించింది. చందమామ ఏంటి? అమృతం ఏంటి? అనుకుంటున్నారా? ఈ సినిమాలో ఇంకా బోల్డన్ని వింతలు చూపించబోతున్నారు. స్వీయదర్శకత్వంలో గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ -‘‘అంతరిక్షం నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది.
భారతదేశ చలన చిత్ర చరిత్రలో పూర్తిగా అంతరిక్ష నేపథ్యంలో సాగే చిత్రం ఇదే అవుతుంది. కథానుసారం సాగే 65 నిమిషాల నిడివి ఉన్న గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేస్తాయి. పిల్లలను, పెద్దలను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రం ఇది’’ అని చెప్పారు. అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీష్, వాసు ఇంటూరి, ధన్య, సుచిత్ర, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కెమెరా: రసూల్ ఎల్లోర్, పాటలు: అనంత శ్రీరామ్, ఎడిటింగ్: ధర్మేంద్ర.
Advertisement