chandamama lo amrutham
-
వినోదాన్ని పంచే అమృతం ఇది
‘‘కుటుంబ బంధాలతో సీరియల్స్ చేయడం ఈజీ. వినోదాన్ని మేళవిస్తూ సీరియల్స్ చేయడం కష్టం. అప్పుడప్పుడు ‘అమృతం’ సీరియల్ని యూట్యూబ్లో చూస్తుంటాను. 313 ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి. గంగరాజుగారే చేసిన ఈ ‘చందమామలో అమృతం’, ‘అమృతం’ సీరియల్ కంటే వినోదాన్ని పంచుతుందని నా నమ్మకం’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చందమామలో అమృతం’. అవసరాల శ్రీనివాస్, హరీశ్, శివన్నారాయణ ఇందులో ముఖ్య పాత్రధారులు. ఊర్మిళ గుణ్ణం నిర్మాత. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఆడియో సీడీని కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించి, తొలి ప్రతిని నాగార్జునకు అందించారు. గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ -‘‘నేను ‘అమృతం’ సీరియల్ ప్రారంభించినప్పుడు కె.రాఘవేంద్రరావుగారిని పిలిచాను. ‘నీకేమైనా మతిపోయిందా... ఈ రోజు అమావాస్య. ఇప్పుడు ప్రారంభం ఏంటి?’ అన్నారాయన. అయినా.. అమావాస్య రోజే ఆ సీరియల్ని ప్రారంభించాను. ఎందుకు ప్రారంభించానో ఈ ‘చందమామలో అమృతం’ సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి, సాయి కొర్రపాటి, రమా రాజమౌళి, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సహ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
అంతరిక్షంలో వినోదం!
అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అయితే, అంతరిక్షయానం చేసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేలా జస్ట్ ఎల్లో మీడియా సంస్థ ‘చందమామలో అమృతం’ చిత్రాన్ని నిర్మించింది. చందమామ ఏంటి? అమృతం ఏంటి? అనుకుంటున్నారా? ఈ సినిమాలో ఇంకా బోల్డన్ని వింతలు చూపించబోతున్నారు. స్వీయదర్శకత్వంలో గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ -‘‘అంతరిక్షం నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది. భారతదేశ చలన చిత్ర చరిత్రలో పూర్తిగా అంతరిక్ష నేపథ్యంలో సాగే చిత్రం ఇదే అవుతుంది. కథానుసారం సాగే 65 నిమిషాల నిడివి ఉన్న గ్రాఫిక్స్ ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేస్తాయి. పిల్లలను, పెద్దలను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రం ఇది’’ అని చెప్పారు. అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీష్, వాసు ఇంటూరి, ధన్య, సుచిత్ర, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కెమెరా: రసూల్ ఎల్లోర్, పాటలు: అనంత శ్రీరామ్, ఎడిటింగ్: ధర్మేంద్ర.