
మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను!
బ్రతుకు మీద ప్రతి ఒక్కరికీ తీపి ఉంటుంది. అందుకే చావు గురించి అస్సలు ఆలోచించరు. ఆలోచించం కదా అని అమరజీవులం కాలేం కదా. అయితే, ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి, బ్రతుకు మీద మమకారం పెంచుకుంటాం. అయితే, ఒక్కోసారి స్వయంగా మరణం అంచుల వరకు వెళ్లే సంఘటనలు జరుగుతుంటాయి. చార్మీకి అలానే జరిగింది. వైజాగ్ వెళ్లడం కోసం ఫ్లయిట్ ఎక్కారామె. ఇంకాసేపటిలో క్షేమంగా ల్యాండ్ అవుతామని అనుకుంటుండగా... హఠాత్తుగా ఓ పేద్ద కుదుపు. చార్మీతో పాటు విమానంలో ఉన్న ప్రయాణీకులందరూ కంగారుపడ్డారు.
ఈ సంఘటన గురించి చార్మీ చెబుతూ -‘‘ఓ వంద అడుగులు అమాంతంగా ఫ్లయిట్ కిందకు వెళ్లినట్లనిపించింది. నా చేతిలో ఉన్న కప్‌లోంచి టీ పైకి ఎగరడం మాత్రమే కాదు.. మా ప్రమేయం లేకుండా మేమంతా ఓ ఎగురు ఎగిరి మా సీట్లలో కూలబడ్డాం. ఇక ఇదే చివరి రోజు అనుకున్నా. మరోసారి ఇంకా బలమైన కుదుపు. దాంతో ఇదే మనకు తుది శ్వాస అని ఫిక్స్ అయ్యాను. మరణం అంచుల వరకూ వెళ్లొచ్చాను. చివరకు నింగి నుంచి సురక్షితంగా నేలకు రాగలిగాను. ఇంకా నమ్మలేకపోతున్నా. ఏదేమైనా ఇది చాలా భయంకరమైన అనుభవం. ఈ సందర్భంగా నేను చెప్పేదేంటంటే... జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి.. పూర్తిగా ఆస్వాదిద్దాం’’ అన్నారు.