పోర్‌గళత్తిల్ ఒరు పూ చిత్రానికి హైకోర్టు షాక్
పోర్‌గళత్తిల్ ఒరు పూ చిత్రానికి చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ చిత్ర విడుదలపై నిషేధం విధిస్తూ తీర్పును వెల్లడి ంచింది. శ్రీలంక సైన్యానికి, ఎల్‌టీటీఈకి జరిగిన తుది పోరులో అనేక మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ యుద్ధంలో ఇసైప్రియ అనే ఒక పత్రికా విలేకరిని సైనికులు అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు. ఆ సంఘటన ప్రధాన ఇతివృత్తంగా తమిళంలో పోర్‌గళత్తిల్ ఒరు పూ పేరుతో చిత్రం తెరకెక్కింది. కె.గణేశ్ దర్శకత్వంలో ఏసీ.గురునాథ్ సెల్లసామి నిర్మించిన ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్టు సభ్యులు నిరాకరించారు.
దీంతో చిత్ర దర్శక నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్లారు. అక్కడా చిత్రంపై పెద్ద చర్చే జరిగింది. అయితే రివైజింగ్ కమిటీ పోర్ గళత్తిల్ ఒరు పూ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. అయినా పట్టు విడవకుండా చిత్ర దర్శక నిర్మాతలు చెన్నై హైకోర్టుకు వెళ్లారు. మరో పక్క ఇసైప్రియ తల్లి టి.వేదరంజని, అక్క ధర్మిణి వాహజన్ పోర్ గళత్తిల్ ఒరు పూ చిత్రం విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి శివజ్ఞానం సమక్షంలో విచారణకు వచ్చింది.
వాదనలు విన్న న్యాయమూర్తి చిత్రంలో క్రూరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయనీ, ఈ చిత్రాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లడానికి అనుమతించలేమని తెలుపుతూ చిత్ర విడుదలపై నిషేధం విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు, వారి తరఫు న్యాయవాది పేర్కొనడం గమనార్హం.