
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే తాజాగా నటించిన ‘ఛపాక్’ చిత్రం వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ సినిమా కథ తన దగ్గర నుంచి కాపీ కొట్టారని, తనకు న్యాయం చేయాలంటూ రాకేశ్ భర్తీ అనే రచయిత కోర్టును ఆశ్రయించాడు. చపాక్ చిత్ర రచయితల్లో తనను ఒకరిగా గుర్తించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. యాసిడ్ బాధితురాలి కథను మొదట తాను రాసానని చెప్పుకొచ్చాడు. దీనికోసం నటీనటులను సంప్రదించగా పలువురు అందులో నటించడానికి ఆసక్తి కనబర్చారని పేర్కొన్నాడు.
‘బ్లాక్ డే’ పేరుతో సినిమాను కూడా రిజిస్టర్ చేసుకున్నానని తెలిపాడు. అయితే పలు కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఇంకా మొదలుపెట్టలేదన్నాడు. అయితే తాను రాసుకున్న కథను యథాతథంగా ఛపాక్‌లో చూపించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఛపాక్ చిత్ర రచయితగా తనకు గుర్తింపు ఇచ్చేవరకు సినిమాను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరాడు. ఈ విషయం గురించి మొదట చిత్ర నిర్మాతలను సంప్రదించినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రానందునే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని రాకేశ్ పేర్కొన్నాడు. ఇక ఈ వివాదంపై ఛపాక్ యూనిట్ ఇంతవరకూ స్పందిచలేదు. కాగా యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.