కేజీఎఫ్‌–2 చైల్డ్ స్టార్.. సేవకు సలాం | Child Artist Bhanu Prakash Food Distribution in Lockdown Time Hyderabad | Sakshi
Sakshi News home page

సినీ సంపాదన సేవకే

May 23 2020 7:56 AM | Updated on May 23 2020 7:56 AM

Child Artist Bhanu Prakash Food Distribution in Lockdown Time Hyderabad - Sakshi

మనం బతకడానికి సమాజం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనకంటూ ఒక స్థాయిని ఇస్తుంది. అలాంటి సమాజం రుణం తీర్చుకునే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే సాధారణ జీవితం.. సార్థకం అవుతుంది. చిన్న వయసులోనే ఆ ఘనత సాధించగలిగాడు సిటీ కుర్రాడు భాను ప్రకాష్‌(7). సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపుతెచ్చుకుంటూ కేజీఎఫ్‌–2 లాంటి పెద్ద సినిమాలోనూకనిపించబోతున్న ఈ చైల్డ్‌స్టార్‌.. టాలెంట్‌ చూపించడంలో మాత్రమే కాదు సమాజానికి తిరిగి ఇవ్వడంలో కూడావయసుకు మించిన పరిణితి చూపిస్తున్నాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్నార్థులకు, అభాగ్యులకుఆసరాగా నిలుస్తున్నాడు. ఈ కుర్రాడికి తోడుగా నిలిచిన సేవాహృదయాలు కలిసి టీమ్‌ ఎఫ్‌ఎమ్‌గా ఏర్పడటంతో సిటీలో విభిన్న రూపాల్లో సేవా స్ఫూర్తిని పంచుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ సమయంలో సిటీలో 53 రోజులుగా నిత్యాన్నదానాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. టీమ్‌ ఎఫ్‌ఎమ్‌ పేరుతో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలకు తండ్రి సురేష్‌ అమాస అండగా నిలుస్తున్నారు.  ‘లాక్‌డౌన్‌తో పాటే మొదలైన దినసరి కూలీలు, నిరుపేదల ఆకలి ఆర్థనాదాలు నన్ను టీమ్‌ని కదిలించాయి.  సాటి మనుషులు ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడటాన్ని జీర్ణించుకోలేకపోయా’ అంటున్న తండ్రి సురేష్‌.. అనూహ్యంగా సక్సెస్‌ అయిన తన చిన్నారి ద్వారా వచ్చిన ప్రతిపైసా సద్వినియోగం చేయడానికి ఇదే సమయం అనుకున్నారు. ఈ విషయం భాను ప్రకాష్‌కి కూడా అర్థమయ్యేలా చెప్పి.. అన్నార్తుల ఆకలి తీర్చే ఒక ఫుడ్‌ మొబైల్‌ వ్యాన్‌ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 53 రోజులుగా సిటీలో ఎక్కడ ఆకలి ఉందని తెలిస్తే అక్కడికెళ్లి భోజనం అందించారు. అలా ప్రతిరోజు దాదాపు 500 మందికి పైగా కడుపునింపారు. వీరికి తోడయ్యారు ఔత్సాహిక సినీనటులు మణికంఠ వారనాసి, ఎస్‌ఎమ్‌ఎస్‌ సురేష్‌లు. 

సేవల్ని విస్తరిస్తూ..
ఈ బృంద సభ్యులు టీమ్‌ ఎఫ్‌ఎమ్‌(ఫ్రీ మీల్స్‌) పేరుతో ఇందిరానగర్‌ పరిసర ప్రాంతాల్లోని సినిమా కార్మికులకు (నాన్‌ కార్డ్‌ హోల్డర్స్‌) ప్రతిరోజూ మీల్స్‌ని అందించారు. సోమాజిగూడ, నందినీహిల్స్, బోరబండ ప్రాంతాల్లో అన్నార్థులకు స్వయంగా వండిన ఆహారాన్ని అందించారు. సోమాజిగూడ పార్క్‌ హయత్‌ దగ్గరలోని బస్తీ వాసులకు ఈ 50 రోజుల్లో నిత్యావసర సరుకులు నింపిన 1500 కిట్స్‌ అందించారు. అంతేగాకుండా మేడ్చల్, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ దగ్గరలోని వలస కూలీలకు ఫుడ్‌ వండి వడ్డించారు. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులకు పండ్లు, మజ్జిగ, భోజనాలను సమకూర్చారు. ప్రతినిత్యం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన తమ స్నేహితులు కొందరు ఆర్థికంగా సహకారం అందించారని బృంద సభ్యులు తెలిపారు.

వలస కూలీలకు బాసటగా..

ఈ విపత్కర పరిస్థితుల్లో సొంత ఊరికి చేరాలనుకున్న ఎంతో మంది వలస కూలీలకు ఆ మార్గంలో ఆకలి అవరోధంగా మారింది. చిన్నపిల్లలతో కలిసి వందల కిలోమీటర్లు నడిచి వివిధ ప్రాంతాల్లోని తమ గ్రామాలకు చేరుకున్న కుటుంబాలు ఎన్నో.. అలాంటి వారికి కూడా సాయం అందించాలనే తపనతో, పోలీసువారి అనుమతితో ఎన్నో కుటుంబాలను వారి ప్రాంతాలకు చేరుకునేందుకు వాహనాలు సమకూర్చారు. ఈ విధంగా నగరం నుంచి కర్నూలు, ఖమ్మం, మహబూబ్‌నగర్, రాజమండ్రిలాంటి తదితర ప్రాంతాలకు ఎంతో మందిని తమ వ్యాన్‌ సహాయంతో చేరవేసి వారధులుగా నిలిచారు. 

వెండితెరపై ప్రకాశిస్తున్న ‘భాను’డు
ఈ మధ్య వచ్చిన సరిలేరునీకెవ్వరు, వెంకీమామ, కథానాయకుడు, మిస్టర్‌ మజ్ను, ఒక్క క్షణంలాంటి 15 సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు భానుప్రకాష్‌. ప్రస్తుతం కేజీఎఫ్‌–2, నాగచైతన్య లవ్‌స్టోరిలో కూడా మెరవనున్నాడు. సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు, సీరియల్స్, నాటకాలు, తదితర రంగాల్లో తన నటనతో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తన తండ్రి సురేష్‌ కూడా సినిమా రంగానికి చెందినవాడే.. సురేష్‌ 30కి పైగా షార్ట్‌ మూవిస్‌ చేశాడు. హార్ట్‌ బీట్‌ అనే ఇండిపెండెంట్‌ సినిమా చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement