పూరి దర్శకత్వంలోనే... చిరంజీవి సినిమా
త్వరలో... పవన్‌కల్యాణ్ ప్రొడక్షన్‌లో రామ్‌చరణ్!
చిరంజీవి 150వ చిత్రానికి దర్శకుడెవరు? ఈ విషయంపై ఇటీవల రకరకాల వార్తలు వినిపించాయి. ముందుగా ప్రకటించినట్టు పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు కాదనీ, రచయిత చిన్ని కృష్ణ కథతో వినాయక్ దర్శకత్వంలో ప్లానింగ్ జరుగుతోందనీ వెబ్‌సైట్స్‌లో చాలా వార్తలు వచ్చాయి. దాంతో, చిరంజీవి అభిమానులు ఈ విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌కు అవుతున్నారు. ఈ కన్‌ఫ్యూజన్‌కు రామ్‌చరణ్ తెర దించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చేశారు.
‘‘మా నాన్నగారు నటించే 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. ప్రస్తుతం సెకండాఫ్ ఎలా ఉండాలన్న అంశం మీద కసరత్తులు జరుగుతున్నాయి’’ అని చరణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాతో పూరీ బిజీగా ఉన్నారని, సెకండాఫ్ కథ సిద్ధమయ్యాకే ఇతర విశేషాలు చెప్పగలుగుతామని రామ్‌చరణ్ తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఓ స్వీట్ న్యూస్ కూడా అనౌన్స్ చేశారు. ‘‘మా బాబాయ్ పవన్‌కల్యాణ్ సంస్థలో నేను హీరోగా ఓ సినిమా చేయనున్నా. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తా’’ అని చెప్పారు చరణ్.