‘‘దాసరిగారి గురించి ఇలాంటి పుస్తకాలు ఎన్ని రాసినా, ఇంకా మిగిలి ఉండే ఘనమైన చరిత్ర ఆయనది. ఆయన తెలుగువారికి దిగ్దర్శకులుగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం. తెలుగు పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన్ను మర్చిపోలేము’’ అన్నారు నటుడు చిరంజీవి. దర్శకరత్న దాసరి నారాయణరావుగారు జీవితంపై సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు రచించిన ‘తెరవెనుక దాసరి’పుస్తకాన్ని
చిరంజీవి ఆవిష్కరించి, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డికి అందించారు. రెండో ప్రతిని దర్శకుడు రాఘవేంద్రరావుకి అందించారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సభలో ముఖ్యంగా ఇద్దరి గురించి ప్రస్తావించుకోవాలి. ఒకరు మట్టిలో మాణిక్యం. ఒకరు మనుషుల్లో మాణిక్యం. మనుషుల్లో మాణిక్యం అన్నా... సినీ పరిశ్రమలో తలమానికం అన్నా.. సినీకార్మికులకు గుండె ధైర్యం ఇచ్చే భరోసా అన్నా... అది మరెవరో కాదు లేట్ ది గ్రేట్ దాసరిగారు. ఒక దాతగా, దర్శకునిగా, దార్శనికుడిగా ఆయన ఆర్జించిన కీర్తి విశేషం. అలాంటి చరిత్రకారుడు మన మధ్య లేకపోవడం తీరని లోటు. కానీ ఆయన చాలా మంది హృదయాల్లో జీవించి ఉండటం చాలామందికి స్ఫూర్తిదాయకం. అలాంటి దాసరిగారి గురించి ‘తెరవెనుక దాసరి’ పుస్తకాన్ని తీసుకువచ్చిన మట్టిలో మాణిక్యం పసుపులేటి రామారావుగారు. దాసరిగారి స్టేటస్‌కి తగ్గట్లుగా ఈ పుస్తకావిష్కరణను మెగా లెవల్లోనే చేద్దామనుకున్నాం. వెంటనే టి.సుబ్బిరామిరెడ్డిగారిని, ఈ వేడుకకు మీరెంతవరకు సహాయం చేస్తారని అడిగితే, ఓకే అన్నారు. నేను అన్ని స్థాయిల్లో నుంచి వచ్చాను. అవకాశాలు వస్తాయా? రావా? ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనా లేదా? అనే ఆశ నిరాశల మధ్య ఊగిసలాడాను.
కాన్ఫిడెన్స్‌ను, కష్టాన్ని నమ్ముకున్నాను. ఇప్పుడు నాలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ పుస్తకం సోర్స్ ఆఫ్ ఇన్‌స్పిరేషన్. దాసరిగారు అంటూ ఉండేవారు ‘ఏ అడ్రస్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగాడు అని’. నేను కాదు.. నాకు స్ఫూర్తి దాసరిగారు. దాసరి గారి తరువాత.. దాసరి ముందు అని చెప్పే బ్రిడ్జ్‌లా ఉన్నారాయన. ఎలాంటివారికైనా మంత్రంలాంటిది ఈ పుస్తకం’’ అన్నారు. ‘‘కథారచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎంతోమంది నటులను తీర్చిదిద్దిన దాసరి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హుడు. అయనకు ఆ అవార్డ్ రావటానికి కృషి చేస్తాను’’ అని టీఎస్సార్ అన్నారు. ‘‘గురువుగారి జీవితంపై పుస్తకం రాయాలనుకున్నప్పుడు బీఏ రాజు నైతిక బలం అందించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ప్రోత్సహించారు. నేను రాసిన అన్ని పుస్తకాలకు అరవింద్ గారి సహకారం ఉంది. ఈ పుస్తకాన్ని చిరంజీవిగారు ఆవిష్కరిస్తే బాగుంటుందని అరవింద్‌గారికి చెప్పా. ఆ తర్వాత సురేశ్ కొండేటి కూడా సహాయం చేశారు. స్వయంగా చిరంజీవిగారు ఫోన్ చేస్తే, నేను గొంతు గుర్తుపట్టలేదు. ‘రామారావు గారూ.. మనది 40 ఏళ్ల అనుబంధం. గుర్తుపట్టలేకపోతే ఎలా’ అన్నారు. అప్పుడు బుక్ ఆవిష్కరణ గురించి చెప్పా. గ్రాండ్‌గా చేద్దామన్నారు. సహకరించిన, విచ్చేసినవారికి ధన్యవాదాలు’’ అన్నారు పసుపులేటి రామారావు. కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, కోడి రామకృష్ణ, మురళీ మోహన్, సి. కల్యాణ్, యస్వీ కృష్ణారెడ్డి, రాజా వన్నెంరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు దాసరి గురించి మాట్లాడారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్, కుమార్తె హేమాలయకుమారి, అల్లుడు రంగనా£Š పాల్గొన్నారు.
దాసరిగారు మనుషుల్లో మాణిక్యం– చిరంజీవి
Published Wed, Dec 13 2017 12:17 AM | Last Updated on Wed, Dec 13 2017 12:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment