నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా | Chit Chat With Evaru Movie Director Ramji | Sakshi
Sakshi News home page

ఏ కథకైనా ఎమోషన్సే ముఖ్యం

Published Mon, Aug 19 2019 12:50 AM | Last Updated on Mon, Aug 19 2019 8:27 AM

Chit Chat With Evaru Movie Director Ramji - Sakshi

నన్ను, శేష్‌ని ‘మీరు అమెరికాలో చదివి వచ్చిన బ్యాచ్‌. మీకు మాస్‌ సినిమా తీయడం రాదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌ బ్యాచ్‌’ అని పీవీపీగారు తిడుతుంటారు. కానీ ఇవాళ మా ‘ఎవరు’ అన్ని సెంటర్స్‌లో సూపర్‌గా కనెక్ట్‌ అవ్వడం సంతోషంగా ఉంది. 

‘‘ఇతర భాషల్లో హిట్‌ అయిన సినిమాలు ఆ భాషల్లో ఎందుకు హిట్‌ అయ్యాయో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని, ఇక్కడి ప్రేక్షకులకు నచ్చేలా ఎలా తీయాలో ఆలోచించుకోవాలి. అప్పుడు కచ్చితంగా మన వాళ్లకు నచ్చే సినిమా తీయొచ్చు’’ అన్నారు దర్శకుడు వెంకట్‌ రామ్‌జీ. పీవీపీ నిర్మాణంలో రామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’. అడివి శేష్, రెజీనా, నవీన్‌ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. స్పానిష్‌ థ్రిల్లర్‌ ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్‌’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ‘ఎవరు’ గత గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా వెంకట్‌ రామ్‌జీ చెప్పిన విశేషాలు.

  • ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దర్శకుడు గుణ్ణం గంగరాజుగారి దగ్గర ఓ సీరియల్‌కు స్క్రీన్‌ప్లే రచయితగా పని చేశాను. ఆ తర్వాత వరుణ్‌ సందేశ్‌ ‘కుర్రాడు’ సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను. ఆ తర్వాత రాఘవేంద్రరావుగారి అబ్బాయి ప్రకాశ్‌తో కలసి పని చేశాను. ఆతను తీసిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాను. ఆ తర్వాత కొన్ని సినిమాలకు లైన్‌ ప్రొడ్యూసర్‌గా, ఆ తర్వాత పీవీపీ సంస్థలో ‘క్షణం, సైజ్‌ జీరో, ఊపిరి, బ్రహ్మోత్సవం’ సినిమాలకు మార్కెటింగ్‌ విభాగంలో పని చేశాను. 
  • పీవీపీగారికి ఒక కథ చెబుదాం అనుకున్నప్పుడు ఆయనే నాకో పాయింట్‌ చెప్పి ఎలా ఉంది? అని అడిగారు. ఆ స్పానిష్‌ సినిమా ఇంతకుముందే చూశాను. కానీ దాన్ని వీళ్లు చూసిన కోణం నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచి ఆ కథ మీద వర్క్‌ చేయడం మొదలుపెట్టాం. ఏ కథలో అయినా అందులో ఎమోషన్స్‌ను ప్రేక్షకుడు ఫీల్‌ అవ్వాలి. అందుకే ఆ కథకు ఎమోషన్స్‌ యాడ్‌ చేశాను. ఏ కథకైనా ఎమోషనే ముఖ్యం అని నమ్ముతాను. 
  • గత పదేళ్లలో చిన్న సినిమా పెద్ద విజయం అనే ట్రెండ్‌ను ‘క్షణం’ క్రియేట్‌ చేసింది. పీవీపీగారు రాజకీయాల్లో బిజీ అయిపోయి ‘క్షణం’ లాంటి చిన్న సినిమా చేయాలనుకున్నారు. ‘క్షణం’ చిత్రబృందంలోని చాలామంది ‘ఎవరు’కి పని చేశారు. 
  • ‘క్షణం, గూఢచారి’ సినిమాలకు అన్ని బాధ్యతలను శేష్‌ భుజాన వేసుకున్నాడు. ఈ సినిమాకి వచ్చేసరికి చాలా అలసిపోయాడు. ఈ సినిమాలో రైటింగ్‌ పరంగా ఏం చేయకపోయినా రైటర్స్‌కి మంచి గైడెన్స్‌ ఇచ్చాడు. ఆల్రెడీ రెండు థ్రిల్లర్స్‌ చేశాడు. ఎక్కడ థ్రిల్‌ చేయాలో తనకు ఐడియా ఉంటుంది. అలాగే అబ్బూరి రవిగారు కూడా డైలాగ్స్‌ అద్భుతంగా రాశారు. 
  • సమీరా పాత్రకు రెజీనా బాగా సూట్‌ అయ్యారు. ‘అ!’ నుంచి విభిన్నమైన సినిమాలు చేస్తున్నారామె. తన కళ్లతోనే అన్ని భావాలను చూపించగలరు. నవీన్‌ చంద్ర కూడా బాగా చేశాడు. సినిమాలో సర్‌ప్రైజ్‌ చేసింది నిహాల్‌ చేసిన ఆదర్శ్‌ పాత్ర. 
  • ఈ సినిమా 70 శాతం పూర్తయినప్పుడే విజయం మీద నమ్మకం వచ్చేసింది. రఫ్‌ కట్‌ నుంచి ఫైనల్‌ వెర్షన్‌కు పెద్దగా ఎడిటింగ్‌ ఏమీ లేదు. కేవలం నిమిషం మాత్రమే కట్‌ చేశాం. నా స్క్రిప్ట్‌ 118 పేజీలు ఉంటే మా సినిమా నిడివి కూడా కేవలం 118 నిమిషాలే ఉంది. 
  • ‘ఎవరు’ చూసి ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారు. అడ్వాన్స్‌ ఇస్తామని నిర్మాతలు ఎవ్వరూ ఫోన్‌ చేయలేదు. బహుశా నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా (నవ్వుతూ). నా నెక్ట్స్‌ సినిమా కూడా థ్రిల్లర్‌ జానర్‌లోనే ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement