అలాంటి వాడినే పెళ్లాడతా
తనను గౌరవించి, ప్రేమించే వాడినే పెళ్లి చేసుకుంటానంటున్నారు సంచలన తార నయనతార. ఈ క్రేజీ భామ సినిమా జీవితమే కాదు, వ్యక్తిగత జీవితమూ తెరిచిన పుస్తకమే. ఒకటికి మించి ప్రేమ వైఫల్యాలు, పలు ఆటంకాలు, అవరోధాలు, వ్యతిరేకతలు, అపజయాలను అధిగమించి, కెరీర్‌లో దూసుకుపోతున్న తార నయనతార. నటుడు శింబు, ప్రభుదేవలతో ప్రేమ పరాజయ గాయాలు ఆరినట్టున్నాయి. మళ్లీ ప్రేమ, పెళ్లి ఊసులు మదిలో మొదలైన నయనతారతో చిట్‌చాట్.
మీకు నచ్చిన హీరో?
మలయాళంలో మోహన్‌లాల్, తమిళంలో రజనీ కాంత్, తెలుగులో వెంకటేష్.
నటి కాకుంటే ఏమయ్యి ఉండేవారు?
నేను నటినికాకుంటే నృత్యకళాకారిణిగాను, చార్డెడ్ అకౌం టెంట్‌గాను అయి ఉండేదాన్ని.
మీ పెట్‌నేమ్?
ఒకటికాదు కొందరు మణి అంటారు. మరికొందరు నయన అని పిలుస్తారు. ఇంకొందరు డయనా అని కూడా అంటారు.
ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?
పాటలు వింటాను. కారులో సుదూర ప్రయాణం చేయడం ఇష్టం. ఆంగ్ల చిత్రాలు చూస్తుంటాను.
నచ్చిన వంటకం?
ఉత్తరాది వంటకం ఇష్టంగా లాగిస్తాను. చైనీస్ వంటకాలు ఇష్టమే. ఇంక ఇంట్లో అమ్మ చేసిన ఏ వంటకం అయినా బాగుంటుంది.
నచ్చిన రంగు?
నలుపు, తెలుపు, ఆకు పచ్చ
నచ్చిన ఫ్యాషన్?
సింపుల్‌గా ఉండే ఫ్యాషన్ డిజైన్ ధరించడం ఇష్టం. అయితే పది మందిలో ఉన్నా, వంద మందిలో ఉన్నా నేను ప్రత్యేకంగా కనిపించా లి. అలాంటి ఫ్యాషన్స్ ధరించాలనుకుంటాను.
నచ్చిన నగలు?
ప్లాటినంతో చేసిన నగలు
మీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాలు?
ఆరంభంలో నన్ను గ్లామర్ హీరోయిన్‌గానే చూసేవారు. రజనీ కాంత్‌తో చంద్రముఖి చిత్రంలో నటించిన తర్వాత నా ఇమేజ్ మారిం ది. నా నట ప్రతిభను చూపించుకున్నా. ఇక తెలుగులో లక్ష్మీ, శ్రీరామరాజ్యం చిత్రాలు నా కేరీర్‌ను పెద్ద మలుపు తిప్పాయి. నయనతార ఎలాంటి పాత్ర కైన న్యాయం చెయ్యగలరని శ్రీరామరాజ్యంలోని సీత పాత్ర నిరూపించింది.
ఇష్టమైన ప్రదేశం?
బెంగళూరు, కెనడా, ఐరోపా దేశాల్లోని అన్ని ప్రాంతాలు నచ్చుతాయి.
ఇతరుల్లో నచ్చని గుణాలు?
అబద్దాలాడడం, యథార్థంగా ఉండకపోవడం, అనాగరికంగా ప్రవర్తించే వాళ్లంటే నచ్చరు.
మీకు కాబోయే భర్త ఎలాంటివాడై ఉండాలనుకుంటారు?
సత్‌ప్రవర్తన గలవాడై ఉండాలి. నా కుటుంబానికి ప్రాముఖ్యత నివ్వాలి. నాపై గౌరవంతోపాటు ప్రేమగా చూసుకునేవాడై ఉండాలి.
మీ జీవితంలో మీరు నేర్చుకున్న పాఠం?
ఎన్ని కష్టాలెదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అపజయూలకు అధైర్య పడరాదు. తెలియని విషయాల గురించి నోరు మెదపకూడదు.