సినిమా నాన్నలు | Cinematic father | Sakshi
Sakshi News home page

సినిమా నాన్నలు

Published Sat, Jun 18 2016 4:36 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

సినిమా నాన్నలు

సినిమా నాన్నలు

‘ఎవ్వరి కోసం ఎవరొస్తారు పొండిరా పొండి... నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి’... బహుశా తెలుగు సినిమాల్లో పిల్లల మీద విరుచుకుపడిన తొలితండ్రి ‘ధర్మదాత’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రూపంలో కనపడతాడు. పిల్లల చేతిలో దెబ్బ తిన్న తండ్రికి అలాంటి ఉక్రోషం రావడం సహజం. దానితో పాటు ప్రేక్షకులు ఐడెంటిఫై అవడం కూడా సహజం. అయితే దాసరి తీసిన ‘తాత మనవడు’ సినిమాలో సత్యనారాయణ తండ్రి అయిన ఎస్.వి.రంగారావు నానా కష్టాలు పడి చివరకు మనవడైన రాజబాబును ఊతకర్రగా చేసుకుంటే తప్ప తన ఆత్మగౌరవం తాను కాపాడుకోలేకపోతాడు. ‘జగదేకవీరుని కథ’లో తన వారసునిగా సింహాసనం అధిష్టించమని మహారాజు పాత్రధారియైన ముక్కామల కొడుకు ఎన్.టి.రామారావుతో అంటే ‘నాకు నలుగురు దేవకన్యలతో వివాహమాడాకే రాజ్యం ఏలాలని ఉంది నాన్నగారూ’ అని జవాబిస్తాడు. దాంతో ఆ కొడుకును రాజ్యబహిష్కారం చేసి ఇతర కొడుకుల చేతిలో కష్టాలు పడతాడా తండ్రి. గమనించవలసిన సంగతి ఏమిటంటే తెలుగు సినిమాల్లో తండ్రులు మంచి పాత్రలు పోషించే నటులే అయ్యారు.


నాగయ్య, గుమ్మడి, ఎస్.వి.రంగారావు, మిక్కిలినేని ఎక్కువగా వీరే ఆ పాత్రలు పోషించారు. కొంతకాలానికి నెమ్మదిగా తెలుగు సినిమాల్లో ఒక ఫార్ములా స్థిరపడింది. అదేమిటంటే హీరోయిన్ తప్పనిసరిగా విలన్ కూతురు కావడం. ఈ విలన్ తండ్రుల పాత్రలు వేయడానికి కూడా కొందరు నటులు సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, నాగభూషణం, రాజనాల, ధూళిపాళ, ప్రభాకరరెడ్డి... కలర్ కాలం వచ్చేనాటికి రావు గోపాలరావు వీరంతా ఈ తరహా తండ్రులుగా స్థిరపడ్డారు. ఇక కమెడియన్ తండ్రులు కొందరు ఉండేవారు. రాజబాబు, పద్మనాభం, గిరిజ, గీతాంజలి ఇలాంటి హాస్యనటులకు తండ్రులుగా రమణారెడ్డి, రేలంగి, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు... వీరంతా ప్రేక్షకులకు నచ్చారు. అయితే ఎనభైలలో మధ్యతరగతి సినిమాల కాలంలో ఇద్దరు తండ్రులు నిశ్శబ్దంగా ఎక్కువ పాత్రలు పోషించి మార్కులు కొట్టేశారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు కావడం ఒక విశేషం. ఒకరు జె.వి.సోమయాజులు, రెండోవారు జె.వి.రమణమూర్తి. వీళ్లిద్దరూ ‘సప్తపది’లో తండ్రి కొడుకులుగా కాన్‌ఫ్లిక్ట్ ఎదుర్కొంటారు. జె.వి.రమణమూర్తి ‘ఆకలి రాజ్యం’ సినిమాలోనూ ‘గోరింటాకు’ సినిమాలోనూ కొడుకు ద్వేషానికి లోనవుతాడు. తనను కాదనుకుని వచ్చేసిన కొడుకును ఢిల్లీలో వెతుకుతూ తండ్రిగా జె.వి.రమణమూర్తి ‘ఆకలి రాజ్యం’లో పాడే ‘కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని’ పాట ఎలాంటి తండ్రైనా తండ్రేనని తండ్రికి బిడ్డంటే ప్రేమేనని నిరూపిస్తుంది. ఇక అదే సినిమాలో కూమార్తె శ్రీదేవి డబ్బును, జబ్బు పడి ఉన్న తల్లి కడియాన్ని దొంగిలించుకుపోయే దగుల్బాజీ తండ్రిగా ఒరు విరల్ కృష్ణారావు కనపడతాడు.

 
ఈ సమయంలోనే మురళీమోహన్ నటించిన ‘ఓ తండ్రి తీర్పు’ పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. తనను వంచించిన కొడుకులకు బుద్ధి చెప్తూ తనలాగే అనాథలైన తండ్రులందరినీ చేరదీసి వృద్ధాశ్రమం నడిపే తండ్రి కథ ఇది. ఆ తర్వాత వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’లో తండ్రి అయిన గొల్లపూడి మారుతీరావు ఖర్చులు భరించడానికి వెనుకాడే కొడుకు శరత్‌బాబును ఛీకొట్టి ఇంటి నడి మధ్యలో గీత గీస్తాడు. నీ బతుకు నీది నా బతుకు నాది అంటాడు. కలిసి ఉండి కొట్టుకోవడం కన్నా విడిపోయి ప్రేమగా ఉండటం మేలు అని ప్రతిపాదిస్తుంది ఈ సినిమా.  ఈ దశలోనే ఎన్.టి.రామారావు, అక్కినేని తండ్రులుగా పాత్రలు పోషించడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ సినిమాలలో అక్కినేని ‘బహుదూరపు బాటసారి’, ‘జస్టిస్ చక్రవర్తి’ సినిమాలలో శక్తిమంతమైన తండ్రి పాత్రలు పోషించారు. ఆ తర్వాత కొంతకాలం ఒక చీకటి యుగం నడిచింది. హీరోలు కాని హీరోయిన్లు కాని ఎక్కడి నుంచి ఊడిపడ్డారో తెలియనట్టుగా వాళ్లు మాత్రమే కనిపిస్తూ తల్లిదండ్రుల్ని స్క్రీన్ మీదకు తేకుండా కథను నడిపించారు. అయితే ఆ సమయంలోనే కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బును కొడుకు దొంగిలిస్తే గుండె ఆగి చచ్చిన తండ్రిగా ‘మగమహారాజు’ సినిమాలో ఉదయకుమార్, ఇంటి పరువు కాపాడటానికి కిడ్నీని అమ్మడానికి సిద్ధపడిన తండ్రిగా ‘విజేత’ సినిమాలో జె.వి.సోమయాజులు గుర్తుంటారు. హుందాగా ఉంటూనే కుమార్తెకు స్నేహితుడిగా ధైర్యం చెప్పే తండ్రిగా నటుడు విజయకుమార్ మణిరత్నం ‘గీతాంజలి’లో ఆకట్టుకుంటారు.

 
ఇక తొంభైలు వచ్చాక సినిమా తండ్రులు పిల్లలకు దాదాపుగా శృతి మించిన స్నేహితులుగా మారిపోయారు. పిల్లల చేత తిట్లు తినడం, పిల్లలతో మందు తాగడం, పిల్లలు పంచ్‌లు వేస్తే పడటం... ఇలాంటి పరిణామం సంభవించింది. చంద్రమోహన్,  కోట శ్రీనివాసరావు, గిరిబాబు, ధర్మవరపు, తనికెళ్ల భరణి, చలపతిరావు, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇలాంటి పాత్రలు వేయాల్సి వచ్చింది. ‘ఆనందం’, ‘గులాబి’, ‘చిత్రం’, ‘అల్లరి’, ‘ఇడియట్’... తదితర సినిమాలు ఇలాంటి పాత్రలను చూపించాయి. తండ్రులు, లెక్చరర్లు పూర్తిగా అభాసుపాలైన కాలం ఇది. ఈ కాలంలోనే తమిళ నంచి తెలుగుకు రీమేక్ చేసిన ‘7/జి బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలలో చంద్రమోహన్, కోట శ్రీనివాస్‌రావు కొంచెం భిన్నమైన, స్వభావాన్ని ప్రదర్శించగలిగిన తండ్రులుగా కనిపిస్తారు.

 
ఆపై ‘బొమ్మరిల్లు’ సినిమా తెలుగు తండ్రికి ఉన్న మార్కెట్ వాల్యూని నిరూపించింది. ఆ సినిమాలో తండ్రిగా నటించిన ప్రకాష్‌రాజ్ ఈనాటి చాలామంది తండ్రులు ప్రదర్శిస్తున్న పొజెసివ్‌నెస్‌ని చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు తండ్రి స్థానాన్ని తిరిగి తండ్రికి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పవచ్చు.

 హీరో లేని కథ లేనట్టే హీరో తండ్రి పాత్ర లేని కథ కూడా దాదాపు ఉండదు. లోకంలో తండ్రి ఉన్నంత కాలం సినిమా తండ్రి కూడా ఉంటాడు. కథను రసమయం చేస్తూనే ఉంటాడయ. నాన్నకు ప్రేమతో... నాన్నకు ఒక రీలుతో.

 

జె.వి.రమణమూర్తి ‘ఆకలి రాజ్యం’ సినిమాలోనూ ‘గోరింటాకు’ సినిమాలోనూ కొడుకు ద్వేషానికి లోనవుతాడు. తనను కాదనుకుని వచ్చేసిన కొడుకును ఢిల్లీలో వెతుకుతూ తండ్రిగా జె.వి.రమణమూర్తి పాడే ‘కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని’ పాట ఎలాంటి తండ్రైనా తండ్రేనని తండ్రికి బిడ్డంటే ప్రేమేనని నిరూపిస్తుంది.

 

- సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement