స్వాతికి తాళి కడుతుంటే... చేతులు వణికాయి!
‘‘హారర్ సినిమా అనగానే రాత్రి పన్నెండు కాగానే దెయ్యం రావడం, అందరూ భయపడటం జరుగుతుంటుంది. వాటికి భిన్నంగా ‘త్రిపుర’ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ సరికొత్తగా ఉంటాయి’’ అని నవీన్‌చంద్ర తెలిపారు. స్వాతి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో రాజకిరణ్ దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ‘త్రిపుర’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హీరో నవీన్‌చంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘ ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడి ద్వారా ‘త్రిపుర’ సినిమాలో అవకాశం వచ్చింది.
ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా నవీన్‌చంద్ర. ఈ సినిమాలో పెళ్లి సీన్ ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అని భయం వేసింది. స్వాతి మెడలో తాళి కట్టే టైమ్‌లో నా చేతులు వణికాయి కూడా. స్వాతి కూడా కొంచెం టెన్షన్ ఫీలైంది. అయినా సింగిల్ టేక్‌లో ఈ సీన్‌ను ఓకే చేశాం. త్రిపుర పాత్రలో స్వాతి బాగా నటించింది.
స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు.