horror film
-
దుమ్ము రేపుతున్న చిన్న మూవీ.. అప్పుడే సెంచరీ క్లబ్‌లోకి..
చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. బాలీవుడ్ బడా సినిమాల పోటీని తట్టుకుని నిలబడింది. హారర్ సినిమా ముంజా తాజాగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఆదిత్య సపోట్‌దర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోనా సింగ్, అభయ్ వర్మ, శార్వరి వాగ్ ప్రధాన పాత్రలు పోషించారు.జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఈ మూవీకి ఓటేస్తున్నారు. అలా ఈ చిత్రం 17 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ వసూళ్ల దూకుడికి గురువారం (జూన్ 27) అడ్డుకట్ట పడే అవకాశముంది. ఆ రోజు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా రిలీజవుతుండటంతో ముంజా రేసులో వెనకబడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ముంజా.. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందు ఛాంపియన్ వంటి భారీ చిత్రాలను వెనక్కు నెట్టి సెంచరీ సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి! Munjya laughs and scares its way to 100 Cr! Thank you for the historic third weekend. We couldn’t have done it without you! ❤️Book your tickets now.🎟️ - https://t.co/z6yE2V5CHC#Munjya, a must-watch entertainer for families and kids, running successfully in cinemas now!… pic.twitter.com/1EJo4Beg8W— Maddockfilms (@MaddockFilms) June 24, 2024 -
భయపెట్టేందుకు వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
సినీ ఇండస్ట్రీలో ఇటీవల హారర్ చిత్రాలే ఎక్కువగా వస్తున్నాయి. గతంలో కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడు పన్నారాయల్ మరోసారి భయపెట్టేందుకు వస్తున్నారు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన తాజా చిత్రం 'ఇంటి నెం.13'. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ చూడగానే విభిన్నమైన మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ సందర్భంగా పన్నారాయల్ మాట్లాడుతూ..'ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ ఎన్నో హారర్ సినిమాలు చూశారు. కానీ పూర్తి భిన్నంగా ఉండే సినిమా ఇది. ఇందులోని మిస్టరీ, సస్పెన్స్ ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయి. సినిమాలో ప్రతి పది నిమిషాలకు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తుంది. మేం అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిస్తుంది' అని అన్నారు. నిర్మాత హేసన్ పాషా మాట్లాడుతూ.. ' ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ చూడని ఒక కొత్త తరహా చిత్రమిది. పన్నా గత చిత్రాలను మించేస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 1న ఈ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమాను తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు వినోద్ యాజమాన్య సంగీతమందించారు. -
'హి' చిత్రం విజయం సాధించాలి: మంత్రి హరీశ్ రావు
బిగ్‌బాస్ ఫేమ్ సంజన అన్నే ప్రధాన పాత్రలో నటించిన నటించిన తాజా చిత్రం ‘ హి (హంట్స్ ఎవ్రివన్)’. అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హి' చిత్రం అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘హి’లో హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం’అని చిత్రబృందం పేర్కొంది. -
నా కల నెరవేరింది
‘‘నేను హారర్ సినిమాలను భయపడుతూ చూస్తాను. ‘రాజుగారి గది 3’ హారర్ కామెడీ. కానీ ‘1920’ సినిమా సీరియస్ హారర్ ఫిల్మ్. ఇలాంటి సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి.. చాలా కొత్త అనుభూతి ఇది. ఈ సినిమా తర్వాత మరిన్ని హారర్ కథల కోసం దర్శక–నిర్మాతలు నన్ను సంప్రదిస్తారని భావిస్తున్నాను’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. ప్రముఖ దర్శక–నిర్మాత మహేష్ భట్ రచన, సమర్పణలో రూపొందిన చిత్రం ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’. కృష్ణ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవికా గోర్ లీడ్ రోల్లో నటించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్‌పై రాకేష్ జునేజా, శ్వేతాంబరీ భట్, డా.రాజ్‌కిషోర్ ఖవ్రే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘మహేష్ భట్, విక్రమ్ భట్‌లాంటి లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో పని చేయడం నా కల. ‘1920’ చిత్రంతో అది ఇంత త్వరగా నెరవేరడం నా అదృష్టం. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. మహేష్ భట్, విక్రమ్ భట్ గార్లతో మాట్లాడుతునప్పుడు సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. నాగార్జునగారిలో కూడా ఆ క్వాలిటీ చూశాను. ‘1920’ కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటాయి. ఇందులో కేవలం హారర్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కూడా ఉంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ నాకు కొత్త అనుభవం ఇచ్చింది. కొత్త టెక్నాలజీ (అన్ రియల్ ఇంజిన్ ఎల్ఈడీ స్క్రీన్) వాడాం.. దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను నటించిన ‘ఇందు’అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. ఆది సాయికుమార్‌కి జోడీగా నటించనున్న ‘అమరన్’ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు. -
నయన్ హారర్ థ్రిల్లర్ కనెక్ట్, ఈ సినిమాకు ఇంటర్వేల్ లేదు: డైరెక్టర్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో లేటెస్ట్ హార్రర్ చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ అశ్విన్ శరవణన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మూవీ విశేషాలను పంచుకున్నాడు. ♦ లాక్డౌన్లో కుటుంబాలు కలిసి లేవు. ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లో ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా కథ. గూస్ బంప్స్ తెప్పించే హార్రర్ థ్రిల్లర్ ఇది. ♦ ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు ఆ తల్లి.. ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుంది. ఈ పాత్రలో అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి. ఆ సహజత్వాన్ని అనుపమ్ ఖేర్ తన నటనతో చూపించారు. ♦హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు. ఇటీవల హిట్ అయిన చాలా సినిమాల నిడివి మూడు గంటలు ఉంది. వాటికి ఇంటర్వెల్ గంటన్నరు ఇచ్చారు. కాబట్టి మా సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది. ♦ నయనతారతో గతంలో మాయా (తెలుగులో మయూరి) అనే చిత్రాన్ని రూపొందించాను. ఆమె పట్ల నాకు గౌరవం ఉంది. దర్శకుడిగా నేనంటే ఆమెకు నమ్మకం. అందుకే మళ్లీ ఈ సినిమాను నయనతారతోనే చేశాను. ఈ కథ విన్నాక ఆమెకు బాగా నచ్చింది. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలన్నది నయనతార కోరిక. అందుకే విఘ్నేష్ తో కలిసి ఆమె ప్రొడ్యూస్ చేసింది. మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ సమకూర్చింది. ♦ నటిగా నయనతారను అడ్మైర్ చేస్తాను. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆద్యంతం తన పర్మార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక డిఫరెంట్ కథను చూపిస్తున్నప్పుడు నటీనటుల ఎంత ప్రామిసింగ్ గా కనిపిస్తే అంత సినిమాకు అడ్వాంటేజ్. ఆ విషయంలో నయనతార టాప్ యాక్ట్రెస్. ♦ ఈ సినిమాకు పృథ్వీ సంగీతాన్ని అందించారు. సౌండ్ డిజైనింగ్ కోసమే మూడు నెలల సమయం తీసుకున్నాం. అందుకే క్వాలిటీ చాలా బాగా వచ్చింది. ♦ ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసే ఇలాంటి తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ఇష్టపడతాను. ఇలాంటి చిత్రాలకు మన దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులో మసూద మంచి విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళ పరిశ్రమలు ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నాయి. ఇదొక ఆరోగ్యకరమైన వాతావరణం. ♦ టాలీవుడ్ నాని సినిమాలంటే ఇష్టం. ఆయనకు గతంలో మయూరి కథ చెప్పాను. తనే సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఆయనతో ఒక సినిమా రూపొందించాలని ఉంది. -
ఉత్కంఠభరితంగా నయనతార కనెక్ట్ మూవీ.. అర్థరాత్రి ట్రైలర్ రిలీజ్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మరో హారర్ చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయన్ స్వయంగా నిర్మించింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కరోనా లాక్డౌన్ సమంలో అందరూ ఇంటికే పరిమితం కావడం, ఇదే సమయంలో నయన్ ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొననగా వారికి దెయ్యం ఉన్నట్లు కొన్ని శబ్దాలు వినిపించడం వంటివి క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 2.22 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 99 నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా ఇంటర్వెల్ బ్రేక్ లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండటం మరో విశేషం. పూర్తిగా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు తగ్గట్లే సినిమాలోనూ సస్పెన్స్ క్రియేట్ చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
హారర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో యువకుల హల్చల్
-
అర్థరాత్రి దెయ్యాలు.. పట్టుకున్న పోలీసులు..!!
సాక్షి, విజయవాడ : నగరంలో అర్థరాత్రి దెయ్యం వేషాలతో యువకులు ప్రజలను బెంబేలెత్తించారు. హారర్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో దెయ్యాల వేషాలు వేసుకుని ఏలూరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు హడలిపోయారు. వీరి దెబ్బకు దాదాపు రెండు గంటల పాటు ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న మాచవరం పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసమే వేషాలు వేసినట్లు యువకులు చెప్పారు. సోషల్‌మీడియాలో వదంతులతో అసలే బిక్కుబిక్కుమంటున్న నగరవాసులు దెయ్యం వేషం వేసుకున్న వారిని చూసి మరింత బెదిరిపోయారు. కేవలం షార్ట్‌ఫిల్మ్ కోసమేనా? లేక మరేదైనా కోణం ఈ ఘటనలో ఉందా? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కోలీవుడ్‌కు రాక్షసి
తమిళ సినిమా : బహుభాషా నటి పూర్ణ నటించిన తెలుగు చిత్రం రాక్షసి ఇప్పుడు తమిళంలోకి అనువాదం అవుతోంది. హర్రర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని కుంతీ పేరుతో ఎస్ఎఫ్ఎఫ్ టీవీ సమర్పణలో అన్నై తిరైక్కణం పతాకంపై ఎంకే.ఉలగేశ్కుమార్ అనువదిస్తున్నారు. దీనికి మేటూర్ పీ.విజయరాఘవన్, ఎస్పీ.కార్తీరామ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పూర్ణతో పాటు ఆడుగాళం కిషోర్, ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విలన్ అభిమన్యుసింగ్, బేబీ తన్య, కృతిక ముఖ్య పాత్రలను పోషించారు. పన్నా రాయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్కే.రాజరాజా అనువాద రచన బాధ్యతలను నిర్వహించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ తెలుగులో రాక్షసి పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ కుంతీ చిత్రంలో నటి పూర్ణ ప్రధాన పాత్రను పోషించారన్నారు. భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా సంసారం సాగిస్తున్న పూర్ణ జీవితంలో భయబ్రాంతులకు గురయ్యే సంఘటన చోటు చేసుకుంటుందన్నారు. తన సంతానాన్ని చంపుతానని భయపెట్టే దెయ్యం నుంచి వారిని ఎలా కాపాడుకుందన్నదే కుంతీ చిత్ర ఇతివృత్తం అని ఆయన అన్నారు. అరుంధతీ, చంద్రముఖి, కాంచన చిత్రాల తరహాలో ఉత్కంఠభరిత హర్రర్ సన్నివేశాలతో కూడిన చిత్రంగా కుంతీ ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా నటి పూర్ణ నటన అందరిని ఆకట్టకుంటుందన్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏఆర్కే.రాజరాజా తెలిపారు. -
హర్రర్ బాటలో ఐశ్వర్య ధనుష్
తమిళసినిమా: సక్సెస్‌ల వెంట పరుగులు తీయడం సర్వసాధారణం. అందుకు ట్రెండ్‌ను సెట్ చేయడానికి కృషి చేసేవారు కొందరైతే, సక్సెస్ ట్రెండ్‌ను అనుసరించే వారు మరికొందరు. మహిళా దర్శకురాలు ఐశ్వర్యధనుష్ ఇప్పుడు ట్రెండ్‌ను ఫాలో అవ్వడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, నటుడు ధనుష్ సతీమణి అయిన ఈమె తొలి ప్రయత్నంలోనే తన భర్త ధనుష్‌నే డైరెక్ట్ చేసిన క్రెడిట్‌ను సొంతం చేసుకున్నారు. 3 పేరుతో రూపొందిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, అందులోని వై దిస్ కొలవరి డి పాట ప్రపంచ స్థాయిలో దుమ్మురేపింది. ఆ చిత్ర సంగీతదర్శకుడు అనిరుద్‌ను సూపర్ రేంజ్‌కి తీసుకెళ్లింది. మలి ప్రయత్నంగా ఐశ్వర్యధనుష్ ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కించారు. అది కమర్శియల్‌గా ఓకే అనిపించుకుంది. అదే విధంగా స్టంట్ కళాకారుల జీవన విధానాన్ని ‘సినిమా వీరన్’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించారు. ఇకపోతే పారా ఒలింపిక్ క్రీడా పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తమిళనాడుకు చెందిన మారియప్పన్ జీవిత చరిత్రను చిత్రంగా తెరపై ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక హర్రర్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి ఐశ్వర్య ధనుష్ రెడీ అవుతున్నారని సమాచారం. దెయ్యం ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని తన భర్త ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి వేల్రాజ్ ఛాయాగ్రహణం అందించనున్నారు. వనమగన్ జయశ్రీ కళాదర్శకత్వం వహించనున్నారు. సాంకేతిక వర్గం కూడా పూర్తి అయిన తరువాత చిత్ర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. -
పిడుగుల్లాంటి పిల్లలతో ‘సంగుచక్రం’
తమిళ సినిమా: మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో సంగుచక్రం చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు మారశన్ పేర్కొన్నారు. ఇంతకుముందు నడువుల కొంచెం పక్కత్తు కానోమ్, ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియోవిజన్ వీఎస్.రాజ్‌కుమార్, సినిమావాలా పిక్చర్స్ కే.సతీష్ కలిసి నిర్మించిన తాజా చిత్రం సంగుచక్రం. ఈ సినిమాలో దిలీప్ సుబ్బరాయన్, గీతా, జర్నిరోస్తో పాటు పలువురు బాల తారలు ప్రధాన పాత్రలు పోషించారు. ఫబీర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయనిట్ చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలుపుతూ.. ఇది పిల్లల ఇతి వృత్తంతో కూడిన వినోదాన్ని మేళవించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో పది మందికి పైగా బాల తారలు ముఖ్య పాత్రల్లో నటించారని చెప్పారు. 30 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న మైడియర్ కుట్టి సాతాన్ చిత్రం తరహాలో దెయ్యం ఇతి వృత్తంతో సాగే కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్రంలో పిల్లలే దెయాన్ని భయపెడతారని చెప్పారు. ఇందులో కథానాయకిగా నటించిన గీత షూటింగ్ 20 రోజుల్లో భూమి మీద ఉన్న దాని కంటే తాడుతో కట్టబడి పైన వేలాడిన రోజులే అధికం అని చెప్పారు. అయినా పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో గీత నొప్పిని భరించి నటించారని తెలిపారు. చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు మారీశన్ తెలిపారు. ఈయన అసలు పేరు రంజిత్. మరణించిన తన తండ్రి మారి జ్ఞాపకార్థం తన పేరును మారీశన్‌గా మార్చుకున్నారు. -
తెలుగు ‘పొట్టు’కు రూ.కోటి
తమిళసినిమా: సినిమా వ్యాపారం, వసూళ్ల గురించి ఇవాళ భిన్న ప్రచారాలు చూస్తున్నాం. స్టార్స్ చిత్రాల వసూళ్లు వంద, రెండొందల కోట్ల క్లబ్లో అంటూ భారీ ప్రచారాలతో ఒక పక్క ఊదరగొడుతుంటే, మరో పక్క చిన్న చిత్రాలకు వ్యాపారం లేదు, డెఫిసిట్ అనే మాట వింటున్నాం. ఏటేటా చిత్రపరిశ్రమ స్లంప్‌ను ఎదుర్కొంటుందనే మాటే అధికంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిత్రం పూర్తిగా వ్యాపారం జరుపుకోవడం అంటే అది వరమే అవుతుంది. పొట్టు చిత్రం ఈ కోవకే చెందుతుందని ఆ చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు. షాలోం స్డూడియోస్ పతాకంపై జాన్‌మ్యాక్స్, జోన్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం పొట్టు. కాగా చిత్రం వివరాలను నిర్మాతలు తెలుపుతూ మనుషుల సాహసాల కంటే దెయ్యాల సాహసాలకే ప్రేక్షకుల నుంచి ఆదరణ అధికంగా ఉంటుందన్నారు. అలాంటి హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపిందిన చిత్రం పొట్టు అని చెప్పారు. ఈ చిత్ర తెలుగు హక్కులను ఎన్కేఆర్ ఫిలింస్ అధినేతలు రూ.కోటికి కొనుగోలు చేశారని తెలిపారు. అక్కడ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగానే ఏక కాలంలో అన్ని భాషలలోనూ విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. భరత్ హీరోగా నటించిన ఇందులో ఆయనకు జంటగా నమిత, ఇనియ, సృష్టిడాంగే హీరోయిన్లుగా నటించారు. తంబి రామయ్య, భరణి, నాన్‌కడవుల్ రాజేంద్రన్, ఊర్వశి, నికేశ్రాం, శాయాజీషిండే, మన్సూర్‌అలీఖాన్, ఆర్యన్, స్వామినాధన్, పావాలక్ష్మణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అమ్రేష్ సంగీతాన్ని, ఇనియన్ హరీష్ ఛాయాగ్రహణను అందించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడివుడైయాన్ నిర్వర్తించారు. -
'నా సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వమన్నా'
ఒక్కప్పుడు లవర్ బాయ్ టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ తరువాత వరుస ఫ్లాప్ లతో తెలుగు సినిమాకు దూరమయ్యాడు. కోలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని సొంత నిర్మాణ సంస్థ లో ఓ హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకే సారి తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే కోలీవుడ్, బాలీవుడ్ లలో రిలీజ్ అయిన సిద్దార్థ్ హర్రర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను శుక్రవారం టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. గృహం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు సిద్ధూ. తన సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా తానే సెన్సార్ బోర్డ్ ను కోరాడాట. అన్ని సినిమాలు కుటుంబ సమేతంగా చూడాల్సిన అవసరం లేదన్న సిద్ధూ. ఈ సినిమాకు 18 ఏళ్ల పై బడినవారే రావాలని కోరాడు. అంతేకాదు గుండె జబ్బులు ఉన్నవారు కూడా తన సినిమా చూడవద్దని తెలిపాడు. -
హారర్ చిత్రంగా చాకోబార్
తమిళ సహాయ దర్శకులకు, వర్ధమాన దర్శకులకు చాకోబార్ ఒక పాఠం అవుతుందని ఆ చిత్ర నిర్మాత మధురాజ్ అన్నారు. ప్రముఖ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన చిత్రం ఐస్‌క్రీమ్‌ను ఈయన త మిళంలోకి చాకోబార్ పేరుతో అనువదించారు. నవదీప్,తేజస్వి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళంలోకి అనువదించిన నిర్మాత మధురాజ్ చిత్రం గురించి తెలుపుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిత్రాన్ని కేవలం రెండుంపావు లక్షల్లో నిర్మించడం సాధ్యమా? అసాధ్యం అంటూ ఏమీ లేదని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసి చూపించారని అన్నారు. రెండుంపావు లక్షలు ఈ రోజుల్లో కథా చర్చల ఖర్చుకే సరిపోవడం లేదన్నారు. ఒక చిత్ర నిర్మాణ కార్యాలయం అడ్వాన్స్‌కే రెండు, మూడు లక్షలు అడుగుతున్నార న్నారు. అలాంటిది ఆ మొత్తంతో రామ్‌గోపాల్ వర్మ ఒక చిత్రాన్ని పూర్తి చేశారని, ఇది తమిళ సహాయ దర్శకులకు, వర్ధమాన దర్శకులకు ఒక పాఠం అవుతుందని అన్నారు. చాకోబార్ చిత్రం నిర్మాణం భారతీయ సినీ చరిత్రలోనే ఒక రికార్డుగా పేర్కొనవచ్చునన్నారు. హారర్, గ్లామర్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆరుగురు నటీనటులే నటించారని, చిత్రాన్ని ఆరు రోజుల్లోనే పూర్తి చేశారని తెలిపారు. ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ కోటిన్నర పారితోషికం తీసుకున్నారని తెలిపారు.హైదరాబాద్ వెళ్లిన తాను ఈ చిత్రాన్ని చూసి తమిళంలోకి అనువధించాలని నిర్ణయించుకున్నానన్నారు. అయితే తన చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు చూడరు. అందువల్ల అనువాద హక్కులు ఇవ్వనని రామ్‌గోపాల్‌వర్మ అన్నారని తెలిపారు. అయితే తాను పట్టుబట్టి మరీ హక్కులు తీసుకున్నానని చెప్పారు. చాకోబార్ చిత్రం హారర్ సన్నివేశాలతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుందన్నారు. -
మరోసారి హారర్‌తో జీవీ
హారర్ చిత్రాల ట్రెండ్ కోలీవుడ్‌లో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ తరహా చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టుకోవడమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. జయం రవి మిరుదన్ చిత్రంతో తాజాగా హిట్ కొట్టారు. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా జంటగా హారర్ చిత్రంలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఇక నటుడు కార్తీ నయనతారతో కలిసి కాష్మోరా అంటూ భయపెట్టడానికి రానున్నారు. అదే విధంగా యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ తొలి సారిగా డార్లింగ్ అంటూ హారర్ చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత పెన్సిల్, త్రిషా ఇల్లన్నా నయనతార, ఎనక్కు ఇన్నోర్ పేరు ఇరుక్కు చిత్రాలు విడుదలై సక్సెస్ అయినా, డార్లింగ్ చిత్రానిదే పెద్ద విజయం అని చెప్పక తప్పదు. తాజాగా మరోసారి జీవీ.ప్రకాశ్‌కుమార్ హారర్‌ను నమ్ముకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కడవుల్ ఇరుక్కాన్ కమారు చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇంతకు ముందు శివ మనసుల శక్తి, భాస్ ఎందిర భాస్కరన్ తదితర విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రాజేశ్.ఎం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జీవీకి జంటగా డార్లింగ్‌లో జత కట్టిన నిక్కీగల్రాణియే నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముగప్పేర్‌లో జరుపుకుంటుంటోంది. ఇప్పటికి 95 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డార్లింగ్ విజయాన్ని రిపీట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాయట యూనిట్ వర్గాలు. వినోదాన్ని పండించడంలో అందె వేసిన దర్శకుడు రాజేశ్ ఈ చిత్రాన్ని హారర్‌తో కూడిన కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. -
బొద్దుగుమ్మకు భలే చాన్స్..!
ముంబై: ఫిల్మ్ మేకర్ విక్రమ్ భట్ తీయనున్న హర్రర్ మూవీ '1921'. అయితే ఈ మూవీలో హీరోయిన్ చాన్స్ ఎవరికి వస్తుందనే దానిపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్ అవకాశం బాలీవుడ్ బొద్దుగుమ్మ జరీన్ ఖాన్ ను వరించింది. విక్రమ్ భట్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 2010లో 'వీర్' సినిమాతో జరీన్ ఖాన్ ను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ అనే విషయం తెలిసిందే. నటనకు అవకాశం ఉన్న మూవీ జరీన్ కు దక్కిందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హర్రర్ మూవీ ప్రాజెక్టుకు జరీన్ ఒప్పుకుని అగ్రిమెంట్ పై సంతకం చేసిందని విక్రమ్ భట్ వెల్లడించారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొనే పరిణామాలపై మూవీ కథాంశం ఉంటుంది. ఈ మూవీలో జరీన్ కీలకపాత్ర పోషించనుందని, వియన్నా, యార్క్ షైర్, ఇటలీ, స్కాట్లాండ్ దేశాలలో షూటింగ్ స్పాట్స్ కన్ఫామ్ చేసుకున్నామని చెప్పారు. ఫెవరెట్ డైరెక్టర్ లలో ఒకరైన విక్రమ్ భట్ తో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని జరీన్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని, ఈ నవంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పింది. రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్ ఈ మూవీలో భాగస్వామిగా ఉందని, ఇది తనకు ఐదవ మూవీ అని డైరెక్టర్ విక్రమ్ భట్ చెప్పుకొచ్చాడు. -
మరో హారర్ చిత్రంగా పాండియోడ గలాటా తాంగలా
కోలీవుడ్‌లో దెయ్యం కథా చిత్రాల హవా అప్రహతంగా సాగుతోంది. తాజాగా ఆ కోవలో రూపొందుతున్న చిత్రం పాండియోడ గలాటా తాంగలా. నితిన్ సత్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రక్షరాజ్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింగమ్పులి, మయిల్సామి, ఇమాన్ అన్నాచ్చి నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్టీ.గుణశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. మణికంఠన్ నిర్మాత.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ముగ్గురు స్నేహితులు ఒక మ్యాన్షన్‌లోని పైభాగంలో చిన్న గదిలో అద్దెకు ఉంటారన్నారు. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ఆ ముగ్గురు అద్దె చెల్లించలేక పోతారు. వారి నుంచి ఎలాగైనా అద్దె వసూలు చేయాలని పలు రకాల ప్రయత్నాలు చేసి విఫలమైన మ్యాన్షన్ యజమాని చివరికి ఆ బాధ్యతను పోలీసుకు అప్పగిస్తాడన్నారు. అయితే ఆ పోలీసును మచ్చిక చేసుకోవడానికి ముగ్గురు స్నేహితులు మందు పార్టీ ఇస్తారన్నారు.అయితే మద్యంమత్తులో పోలీస్ పైనుంచి కిందికి పడి మరణిస్తాడన్నారు. ఆ తరువాత దెయ్యంగా వచ్చి తను చనిపోవడానికి కారణం అయిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. ఆ తరువాత ఏంజరిగిందన్నదే చిత్ర క్లైమాక్స్ అని దర్శకుడు అన్నారు. -
విధిని మోసం చెయ్యగలరా?
హాలీవుడ్ సినిమా / ఫైనల్ డెస్టినేషన్ హారర్ సినిమాలు చూస్తే చాలామందికి నిద్ర పట్టకపోవచ్చు. పద్నాలుగేళ్ల జెఫ్రీ రెడిక్కి ‘ఎ నైట్మేర్ ఆన్ ఈలమ్ స్ట్రీట్’ సినిమా చూశాక నిద్రపట్టలేదు. వెంటనే ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా పది పేజీల్లో కథ రాసి న్యూ లైన్ సినిమా నిర్మాణ సంస్థకి పంపించాడు. పసిపిల్లాడి సినిమా కథ స్టూడియో వాళ్లకి నచ్చలేదు కాని ఆ కుర్రాడి ఉత్సాహం, ఆసక్తి నచ్చింది. జెఫ్రీ రెడిక్కి - స్టూడియో అధినేత రాబర్ట్ షాయ్‌కి స్నేహం ప్రారంభమైంది. ఉత్తరాల్లో, ఫోనుల్లో కథల గురించి చర్చలు, విశ్లేషణలు కొనసాగాయి. జెఫ్రీ ఒకసారి విమానంలో ప్రయాణిస్తుండగా ఓ కథ చదివాడు. ఫ్లైట్‌లో ప్రయాణించబోతున్న తన కూతురికి ఓ తల్లి ఫోన్ చేసి, ‘ఆ విమానం ఎక్కొద్దు. అది కూలిపోతుందని నాకేదో పీడకల వచ్చింది’ అని చెబుతుంది. కూతురు ఆ ఫ్లైట్ బదులు వేరే ఫ్లైట్ ఎక్కుతుంది. ఆ వేరే ఫ్లైట్ కూలిపోతుంది. ‘చావుని వాయిదా వేయగలరు - కాని తప్పించుకోలేరు’ అనే ఆలోచన జెఫ్రీకి మెరుపులా మెరిసింది. అదే ‘ఫైనల్ డెస్టినేషన్’. అప్పట్లో ‘ఎక్స్-ఫైల్స్’ అనేది ఓ పాపులర్ టీవీ సీరియల్. దానికోసం ఈ కథని రాశాడు జెఫ్రీ. ఆ సీరియల్‌కి దర్శక రచయిత జేమ్స్‌వాంగ్. తన మిత్రుడు గ్లెన్ మోర్గాన్‌తో కలిసి ‘ఎక్స్-ఫైల్స్’ని మరింత పాపులర్ చేశాడు. న్యూ లైన్ సినిమా ‘ఫైనల్ డెస్టినేషన్’ స్క్రిప్ట్‌ని జేమ్స్‌వాంగ్ దృష్టికి తీసుకెళ్లింది. ‘మృత్యువను మించిన భయంకరమైన శత్రువు మరొకరు లేరు. ఎవరూ జయించలేరు’ అనే ఆలోచన జేమ్స్వాంగ్ని ఉర్రూతలూగించింది. జెఫ్రీ కథని - జేమ్స్‌వాంగ్ తన సహ రచయిత గ్లెన్ మోర్గాన్‌తో కలిసి తిరగ రాశాడు. ‘ఫైనల్ డెస్టినేషన్’ ప్రభంజనం ప్రారంభమైంది. హైస్కూల్లో చదువుకుంటున్న అలెక్స్ బ్రౌనింగ్ తన క్లాస్‌మేట్స్‌తో కలిసి, ప్యారిస్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఫ్లైట్ నంబర్ 180. టేకాఫ్ తీసుకునే సమయంలో అలెక్స్‌కి జరగబోయే దారుణం ఓ కలగా స్ఫురించింది. లెక్స్ భయపడినట్లుగానే ఫ్లైట్ నంబర్ 180 మధ్యలోనే కూలిపోయింది. మొత్తం ప్రయాణికుల్లో నుంచి బయటపడింది అలెక్స్, అతడి ఫ్రెండ్సే. అలెక్స్‌కి జరగబోయే ప్రమాదం ముందే ఎలా తెలుసు? విమాన ప్రమాదానికి, అతనికి సంబంధం ఉందా అని ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభమైంది. ఈ ప్రమాదం జరిగిన 39 రోజుల తర్వాత మృతులకి నివాళి ఘటిస్తూ, ఈ కుర్రాళ్లందరూ కలుసుకున్నారు. అదే రోజు రాత్రి అలెక్స్ ఫ్రెండ్ టాడ్ బాత్‌టబ్‌లో ఊపిరాడక చనిపోయాడు. అందరూ ఆత్మహత్య అనుకున్నారు. టాడ్ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు కలిసిన విలియమ్ అనే వ్యక్తి వాళ్లందరూ తప్పు చేశారని, మరణ శాసనాన్ని ఎదిరించే ప్రయత్నం చేశారని, మృత్యువు ఆగ్రహానికి వాళ్లందరూ గురయ్యారని చెప్పాడు. ఎవరు ఎలా చావాలో, ఆ వరుస ప్రకారమే చనిపోతారని విలియమ్ చెప్పాడు. అలెక్స్ టెన్షన్ ప్రారంభమైంది. గతంలో లాగే తనకి ప్రమాదం జరిగే ముందు సూచనలు కనబడతాయని, వాటి ఆధారంగా తప్పించుకోవచ్చని చెప్పాడు. అలెక్స్ మాటలు నమ్మని కార్టర్, అతని గాళ్ ఫ్రెండ్ టెర్రీ అలెక్స్‌తో తీవ్రంగా వాదించారు. అనుకోకుండా ఓ బస్సు వచ్చి గుద్దేయడంతో టెర్రీ చనిపోయింది. ఆ తర్వాతి వంతు తమ టీచర్ ల్యూటన్ అని తెలుసుకున్న అలెక్స్, ఆమెని హెచ్చరించడానికి ఇంటికెళ్లాడు. అలెక్స్ మాటలు నమ్మని ల్యూటన్ అతడ్ని ఎఫ్‌బీఐ ఏజెంట్లకి అప్పగించింది. అయితే పొరబాటున ఓ కత్తి దిగబడటంతో ల్యూటన్ చనిపోయింది. ఆమె ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఇప్పుడు అలెక్స్ చెబుతుంది నిజమని కార్టర్ కూడా నమ్మాడు. టీచర్ తర్వాత చనిపోబోతుంది తనేనని కార్టర్ తెలుసుకున్నాడు. ఆ భయం, ఆ ఒత్తిడి భరించలేని కార్టర్ తనంతట తానే చనిపోవాలనుకుని, రైలు పట్టాల మీద తన కారు పార్క్ చేశాడు. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. బయటపడదామని చూస్తే సీటు బెల్టు బిగుసుకుంది. అలెక్స్ అతి కష్టం మీద కార్టర్‌ని కాపాడాడు. కాని ట్రైన్ కార్టర్ కారుని తుక్కుతుక్కు చేసింది. ఆ కారులోని ఓ భాగం వచ్చి బిల్లీకి తగలడంతో చావు బిల్లీని వరించింది. ఆ తర్వాత అలెక్స్, క్లియర్ కొద్దిలో చావు నుంచి తప్పించుకుంటారు. ఆరు నెలల తర్వాత అలెక్స్, క్లియర్, కార్టర్ ప్యారిస్ బయల్దేరారు. చావు భయం తప్పినట్లే అని అందరూ సంతోషపడుతుంటే - తను మాత్రం ఇంకా లిస్ట్‌లోనే ఉన్నానని అలెక్స్ అన్నాడు. అతనికి రకరకాల సూచనలు కనబడుతున్నాయి. ఓ బస్సు వచ్చి, నియాన్ సైన్‌ని కొట్టింది. ఆ సైన్ అలెక్స్ వైపు తిరిగింది. అలెక్స్‌కి చావు తప్పదు అనే క్షణంలో అలెక్స్‌ని కార్టర్ కాపాడాడు. ఇక చావు నుంచి తప్పించుకున్నట్లే అని అలెక్స్ సంతోషపడుతుంటే - ఆ సైన్ కార్టర్ వైపు తిరగడంతో ‘ఫైనల్ డెస్టినేషన్’ మొదటి భాగం పూర్తవుతుంది. ఓ టీనేజ్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన (2000) ఈ సినిమాకి 4 సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ సూపర్‌హిట్ కావడం విశేషం. 23 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 112 మిలియన్ల పైగా వసూలు చేసింది. - తోట ప్రసాద్ -
మరో హారర్ మూవీలో!
అనామిక, మయూరి వంటి ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి, సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోయగలనని నిరూపించుకున్నారు నయనతార. ‘మయూరి’ తర్వాత ఆమె తాజాగా మరో హారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ హీరోయిన్ ఓరి యంటెడ్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మానస్ రుషి ఎంటర్‌ప్రెజైస్ పతాకంపై మురుగదాస్ రామస్వామి దర్శకత్వంలో కె. రోహిత్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ‘‘ఈ సినిమాలో నేను భయపెట్టేటట్లు ఈ మధ్యకాలంలో మరే చిత్రం ప్రేక్షకుల్ని భయపెట్టి ఉండదేమో. ఈ చిత్రం తర్వాత మరో హారర్ సినిమా నేను వెంటనే చేయకపోవచ్చేమో. నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచే చిత్రమిది. తప్పకుండా అందరినీ అలరించేలా ఉంటుంది’’ అని నయనతార చెప్పారు. తంబిరామయ్య, హరీష్ ఉత్తమన్, మన్సూర్ ఆలీఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్లిన్, కెమేరా: దినేష్ కృష్ణన్, సహ నిర్మాతలు: సజ్జూభాయ్-రాంప్రసాద్. -
స్వాతికి తాళి కడుతుంటే... చేతులు వణికాయి!
‘‘హారర్ సినిమా అనగానే రాత్రి పన్నెండు కాగానే దెయ్యం రావడం, అందరూ భయపడటం జరుగుతుంటుంది. వాటికి భిన్నంగా ‘త్రిపుర’ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ సరికొత్తగా ఉంటాయి’’ అని నవీన్‌చంద్ర తెలిపారు. స్వాతి, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో రాజకిరణ్ దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన ‘త్రిపుర’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సంద ర్భంగా హీరో నవీన్‌చంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘ ‘అందాల రాక్షసి’ దర్శకుడు హను రాఘవపూడి ద్వారా ‘త్రిపుర’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర పేరు కూడా నవీన్‌చంద్ర. ఈ సినిమాలో పెళ్లి సీన్ ఉంటుంది. నిజంగా పెళ్లి జరుగుతుందేమో అని భయం వేసింది. స్వాతి మెడలో తాళి కట్టే టైమ్‌లో నా చేతులు వణికాయి కూడా. స్వాతి కూడా కొంచెం టెన్షన్ ఫీలైంది. అయినా సింగిల్ టేక్‌లో ఈ సీన్‌ను ఓకే చేశాం. త్రిపుర పాత్రలో స్వాతి బాగా నటించింది. స్వాతి నా కంటే సీనియర్ కావడంతో తనతో ఎలా యాక్ట్ చేయాలా అనుకున్నా. ఆమె కూడా ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో నాకు ఆ భయం పోయింది. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ప్రస్తుతం హీరోగా నటించిన ‘లచ్చిందేవికో లెక్కుంది’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నీ కుదిరితే త్వరలో నా నుంచి పెళ్లి కబురు అందుతుంది’’ అని చెప్పారు. -
‘వన్ నైట్ షో’ కాదు!
‘బిల్లా’ అనే తమిళ చిత్రంలో బికినీ ధరించి నటించిన నయనతార... అందుకు పూర్తి భిన్నంగా ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో మహాపతివ్రత సీతగా నిండైన చీరకట్టులో కనిపించి, ఆకట్టుకున్నారు. దీన్నిబట్టి నయనతార ఏ తరహా పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలుగుతారని అర్థమవుతుంది. ఇప్పుడామె నటిస్తున్న చిత్రాల్లో ‘మాయ’ అనే తమిళ చిత్రం ఒకటి. ఇది హారర్ మూవీ. ఇప్పటివరకూ ఏ చిత్రంలోనూ కనిపించనంత భిన్నంగా నయనతార ఇందులో కనిపిస్తారట. కొన్ని సన్నివేశాల్లో దెయ్యంలా కనిపించి, భయపెడతారని తమిళ పరిశ్రమలో ఓ వార్త ప్రచారమవుతోంది. ఆ వార్తలకు ఊతం ఇస్తూ, ఓ ఫొటో కూడా బయటికొచ్చింది. ఎరుపు రంగు చీర, అదే రంగు జాకెట్టు, గాజులు, నుదుట రూపాయి కాసంత బొట్టు, కళ్లు పెద్దవి చేసి, కాళికా మాతలా నాలుక బయటపెట్టిన గెటప్ అది. ఆ ఫొటో చూసినవాళ్లు.. నయనతార ఓ రేంజ్లో భయపెట్టడం ఖాయం అంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో నయనతార ఒక బిడ్డకు తల్లిగా నటిస్తున్నారు. అలాగే, నూతన దర్శకుడు అశ్విన్ దర్శకత్వంలో ఆమె ఈ చిత్రం చేయడం ఓ విశేషం అయితే, ఇందులో ఆరి అనే వర్థమాన నటునితో నటించడం మరో విశేషం. వాస్తవానికి ఈ చిత్రానికి ‘వన్ నైట్ షో’ అనే టైటిల్‌ని అనుకున్నారు. కానీ, ఇది అభ్యంతరకరమైన చిత్రం అయ్యుంటుందనే ఫీల్‌ని ఆ టైటిల్ కలగజేసే విధంగా ఉందని ‘మాయ’ అని మార్చారు. ఈ మార్పు వెనకాల నయనతార హస్తం ఉందని సమాచారం. -
రామ్ గోపాల్ వర్మ 'పట్ట పగలు' ట్రైలర్
-
మట్టి ముంతలో ప్రేతాత్మ
ఓ మందు కనుక్కొనే పనిమీద... ఆయుర్వేద కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు అడవిలోకి ప్రవేశించారు. ఓ ఔషధ మొక్క వేళ్ల కోసం వారు నేలను తవ్వుతుండగా... ఓ మట్టిముంత బయటపడింది. దాని మూతను తెరవబోతున్న క్రమంలో... పొరపాటున అది పగిలి ముక్కలైంది. అంతే... అందులోని ఓ ప్రేతాత్మ హాహాకారాలు చేస్తూ బయటకొచ్చింది. ఆ తర్వాత ఏమైంది? ఇక ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న హారర్ చిత్రం ‘జాబాలి’. ఎం.అరుణ్, శర్మిష్ట, అనన్యత్యాగి ప్రధాన పాత్రధారులు. హేమరాజ్ దర్శకుడు. టి.జయచంద్ర నిర్మాత. 80 నిమిషాల గ్రాఫిక్స్ హైలైట్ అని నిర్మాత చెప్పారు. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ‘జాబాలి’ ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
నాకు నచ్చిన హారర్ సినిమా ఇది - సిరివెన్నెల
‘‘ఇప్పటివరకూ నేను చూసిన హారర్ చిత్రాల్లో ఓ హాలీవుడ్ సినిమా మాత్రమే నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత నాకు నచ్చిన హారర్ చిత్రం ఇదే. ఈ చిత్ర నిర్మాత అంకమ్మచౌదరి చాలా విలువలున్న వ్యక్తి’’ అని ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అన్నారు. తారకరత్న, అనూప్‌తేజ్, పంచిబోర, లాస్య ముఖ్య తారలుగా వెంకటరమణ సాళ్వ దర్శకత్వంలో ముప్పా తిరుమలరావు చౌదరి సమర్పణలో అంకమ్మ చౌదరి నిర్మించిన ‘యామిని చంద్రశేఖర్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. యోగీశ్వరశర్మ స్వరపరిచిన ఈ సినిమా పాటల సీడీని సీతారామశాస్త్రి ఆవిష్కరించగా, చాట్ల శ్రీరాములు స్వీకరించారు. ప్రేమ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ చిత్రం ఇదని దర్శకుడు పేర్కొన్నారు. చేసే పనిలో నిబద్ధత ఉండాలనే సూత్రంతో ఈ చిత్రానికి పనిచేశామని నిర్మాత చెప్పారు. భీమనేని, టి.ప్రసన్నకుమార్, చంద్రసిద్దార్థ్, రాజా, సాయికిరణ్, అడివి శేష్ పంచిబోర తదితరులు కూడా మాట్లాడారు.