
తమిళ సినిమా : బహుభాషా నటి పూర్ణ నటించిన తెలుగు చిత్రం రాక్షసి ఇప్పుడు తమిళంలోకి అనువాదం అవుతోంది. హర్రర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని కుంతీ పేరుతో ఎస్‌ఎఫ్‌ఎఫ్ టీవీ సమర్పణలో అన్నై తిరైక్కణం పతాకంపై ఎంకే.ఉలగేశ్‌కుమార్ అనువదిస్తున్నారు. దీనికి మేటూర్ పీ.విజయరాఘవన్, ఎస్‌పీ.కార్తీరామ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పూర్ణతో పాటు ఆడుగాళం కిషోర్, ధీరన్ అధికారం ఒండ్రు చిత్ర విలన్ అభిమన్యుసింగ్, బేబీ తన్య, కృతిక ముఖ్య పాత్రలను పోషించారు.
పన్నా రాయల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్‌కే.రాజరాజా అనువాద రచన బాధ్యతలను నిర్వహించారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ తెలుగులో రాక్షసి పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ కుంతీ చిత్రంలో నటి పూర్ణ ప్రధాన పాత్రను పోషించారన్నారు. భర్త ఇద్దరు పిల్లలతో ఆనందంగా సంసారం సాగిస్తున్న పూర్ణ జీవితంలో భయబ్రాంతులకు గురయ్యే సంఘటన చోటు చేసుకుంటుందన్నారు.
తన సంతానాన్ని చంపుతానని భయపెట్టే దెయ్యం నుంచి వారిని ఎలా కాపాడుకుందన్నదే కుంతీ చిత్ర ఇతివృత్తం అని ఆయన అన్నారు. అరుంధతీ, చంద్రముఖి, కాంచన చిత్రాల తరహాలో ఉత్కంఠభరిత హర్రర్ సన్నివేశాలతో కూడిన చిత్రంగా కుంతీ ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా నటి పూర్ణ నటన అందరిని ఆకట్టకుంటుందన్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏఆర్‌కే.రాజరాజా తెలిపారు.