ఈ అదృష్టం అందరికీ రాదు | Comedian Raghu interview with sakshi | Sakshi
Sakshi News home page

ఈ అదృష్టం అందరికీ రాదు

Published Tue, Dec 8 2015 9:41 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఈ అదృష్టం అందరికీ రాదు - Sakshi

ఈ అదృష్టం అందరికీ రాదు

కమెడియన్ రఘు
 
 
విశాఖపట్నం ( పెదగంట్యాడ) : నటనకు అందం, శిక్షణ, ఇవేమీ లేకుండా కూడా కేవలం నటించాలనే తాపత్రయంతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘు. మామూలుగా రఘు అంటే ఎవరూ గుర్తు పట్టరు. అదుర్స్ సినిమాలో ఒక సీన్‌లో  ‘కొవ్వు ఎక్కువయ్యి నీకు తెలీట్లేదు గానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపయ్యింది...ఎంత సెలైంట్‌గా ఎసేశావన్నా...’ ఈ డైలాగ్స్ వింటే ఆ కమెడియన్ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. యారాడ బీచ్‌లో సునీల్ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రఘుని సాక్షి పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
 
ఇదీ నేపథ్యం...
మా నాన్న ఆర్మీలో జాబ్ చేసేవారు. చిన్నప్పుడు కొన్ని రోజులు విశాఖలో ఉన్నాను. అమ్మ హౌస్‌వైఫ్. నాకొక తమ్ముడు ఉన్నాడు. తను ఇంజినీర్, తనకొక సొంత కంపెనీ ఉంది. నేను మాత్రమే సినీ ఫీల్డ్‌లో కంటిన్యూ అవుతున్నాను.
 
సాఫ్ట్‌వేర్ వదిలి సినిమాల్లోకి...
నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసేవాడిని. చేతుల్లో సంపాదన, వసతులు అన్ని సక్రమంగా జరిగేవి. మా ఇంటి దగ్గర్లో వి.వి. వినాయక్, సురేందర్‌రెడ్డి ఉండేవాళ్లు అప్పటికి వారు దర్శకులు కాలేదు. అసిస్టెంట్ డైరక్టర్లుగా పని చేసేవారు. మామూలుగా పరిచయం, ఫ్రెండ్‌షిప్ వల్ల  నా బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాసలో మాటతీరు సినిమాల్లో చాలా బావుంటుందని ఒక వేళ డైరక్టర్‌గా చాన్స్ వస్తే ఫస్ట్ సినిమాలో అవకాశం ఇస్తామని ఇద్దరూ అనేవారు. నేను కూడా అంత సీరియస్‌గా తీసుకోలేదు.
 
2001లో వినాయక్ నాకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్లాను. ఆఫీస్‌కు వెళ్లాక సినిమాలో నీకు చాన్స్ ఇస్తాను చేస్తావా అని అడిగారు. ‘నాకు ఎవరు చాన్స్ ఇస్తారన్నా.. యాక్టింగ్ కూడా నాకు రాదు’ అని అన్నాను. అయినా వినకుండా సెట్‌కు తీసుకెళ్లారు, కానీ సెట్‌కు వెళ్లేసరికి వినాయక్ డెరైక్టర్‌గా ఉన్నాడు. నేను అప్పటికే షాక్‌లో ఉన్నాను. అదే నా ఫస్ట్ సినిమా ‘ఆది’. అందులో సింహాద్రి క్యారెక్టర్. అప్పుడే వినాయక్ చెప్పారు నాలుగేళ్ల క్రితం నీకు సినిమాలో క్యారెక్టర్ ఇస్తానని చెప్పాను కదా అదే ఇది అన్నారు.
 
తెలియకుండానే నటించా...
స్టిల్ కెమెరాలో ఫొటోలు తీసుకోవడం తప్ప వీడియో కెమెరాలో రీల్ ఉంటుందని, అది రోల్ అవుతుందని, నేను చేసేది దానిలో రికార్డ్ అవుతుందని కూడా తెలీకుండా యాక్టర్‌ను అయ్యాను. డెరైక్టర్ చెప్పింది ఫాలో అవ్వడం తప్ప నాకు మరో ఛాన్స్ లేదు. అలాగే చేశాను...అందరికీ నచ్చి చప్పట్లు కొట్టేవారు. ఆశ్చర్యంగా చూడడం నావంతయ్యేది. ఇప్పుడు కెమెరా గురించి తెలుసు యాక్టింగ్ గురించి తెలుసు...అయినా బ్లాంక్‌గా సెట్‌కు వెళ్తాను.. డెరైక్టర్ చెప్పింది చేస్తాను. నచ్చకుంటే మళ్లీ మళ్లీ చేస్తాను...అంత కంటే ఎక్కువ ఆలోచించను.
 
‘అదుర్స్’ ఇంటిపేరైంది...
నేను ఇప్పటి వరకూ 150 సినిమాలు చేశాను. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడి పని చేస్తాను. అదుర్స్ సినిమా వరకూ నేను 40 సినిమాల్లో యాక్ట్ చేశాను. అదుర్స్ సినిమా 2010లో వచ్చింది. దాని తర్వాత నేను 110 సినిమాలు చేశాను. ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్‌లో అదుర్స్ రఘుని ఆహ్వానిస్తున్నాం.. అని పిలవగానే వినాయక్ గారి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో క్యారెక్టర్ చేసి ఇంత పేరు వచ్చింది. దానినే ఇంటి పేరులా మార్చుకోవడం ఆయనకు నచ్చింది. అదుర్స్ తర్వాత వెంటనే ఆఫర్స్ వెల్లువలా వస్తాయని అనుకున్నాను. కానీ ఏడాదిన్నర కాలం ఖాళీగానే ఉన్నాను. తర్వాత తర్వాత ప్రతి సినిమాలో నా కోసం క్యారెక్టర్ రాయడం ప్రారంభించారు.
 
ఇలా నవ్వించడమే లక్ష్యం
సాఫ్ట్‌వేర్ రఘు అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ యాక్టర్ రఘు అంటే అందరికీ తెలుస్తుంది. కష్టాలెన్ని ఉన్నప్పటికీ సినిమాల్లో డబ్బు, గుర్తింపు ఉంటుంది. ఈ అదృష్టం అందరికీ రాదు. వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వితే చాలు అనుకుంటా.. అదే నాకు ఆక్సిజన్‌లాగా పని చేస్తుంది. ప్రేక్షకుల అభిమానం వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. అందుకే వాళ్లను నవ్వించడం నాకు ధ్యేయం... ఆనందం.. లక్ష్యం.. అన్నీను.
 
 
వైజాగ్ ఎప్పుడూ స్పెషలే...
నేను వైజాగ్‌లో చిన్నప్పుడు కొన్నాళ్లు ఉన్నాను. అక్కయ్యపాలెం దగ్గర్లో ఉండేవాళ్లం...దొండపర్తి రోడ్‌లో విజ్ఞాన నికేతన్ స్కూల్ ఉండేది అక్కడే చదువుకునేవాడిని. ఎప్పుడు వైజాగ్ వచ్చినా రైల్వే గ్రౌండ్స్ గుర్తుకు వస్తాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడడానికి వెళ్లేవాడిని, ఆర్కే బీచ్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా వైజాగ్ నాకు ఎప్పుడూ స్పెషలే.

1994లో వైజాగ్‌లో కొన్నాళ్లు ఉన్నాను. కోస్టల్ బీజియంను చూసుకునేవాడిని, గీతం యూనివర్సిటీ, ఐటీ కంపెనీలు, ఎన్‌ఎస్‌టీఎల్, షిప్‌యార్డ్, జింక్ వీళ్లందరికీ సిస్టమ్ ఇన్‌స్టాల్ చెయ్యడానికి వస్తూండేవాడిని. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్లాలనిపిస్తే వైజాగ్ వచ్చేస్తాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement