యస్...అన్నారండోయ్! | CONFIRMED: Sridevi's daughter Jhanvi Kapoor to debut in Karan Johar film, says dad Boney | Sakshi
Sakshi News home page

యస్...అన్నారండోయ్!

Published Fri, Nov 18 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

యస్...అన్నారండోయ్!

యస్...అన్నారండోయ్!

‘ఇందుమూలంగా యావన్మంది భారతీయ సినీ ప్రేక్షకులకూ తెలియజేయునది ఏమనగా... అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాహ్నవీ కపూర్ త్వరలో కథానాయిగా తెరంగేట్రం చేస్తున్నారహో!’ - అంటూ చాలాసార్లు బీ-టౌన్ మీడియా ఈ టైపు దండోరా వేసింది. ప్రతిసారి బోనీ కపూర్-శ్రీదేవి దంపతుల నుంచి ‘సారీ’ అనే సమాధానమే వినిపించింది. ఈసారి మాత్రం ‘యస్’ అన్నారండోయ్! ‘‘జాహ్నవిను వెండితెరకు పరిచయం చేసే బాధ్యత ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ ఏడాది వందకోట్ల వసూళ్లు సాధించిన మరాఠీ చిత్రం ‘సైరాట్’ రీమేక్ ద్వారా జాహ్నవి తెరంగేట్రం చేస్తున్నారు’’ అని బీ-టౌన్ మీడియా తాజా దండోరా సారాంశం. దీనిపై జాహ్నవి తండ్రి బోనీ కపూర్ స్పందిస్తూ - ‘‘నిజమే.

మా అమ్మాయి త్వరలో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది’’ అని స్పష్టం చేశారు. అయితే.. అమ్మాయి నటించబోయేది ‘సైరాట్’ రీమేకా? కాదా? అనేది చెప్పలేదు. ఆయన మాట్లాడుతూ - ‘‘జాహ్నవి పరిచయ చిత్రం గురించి కరణ్ జోహార్‌తో చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఏ సినిమాతో మా అమ్మాయి పరిచయం అవుతుందనేది చెప్పలేం. ఇటీవల కరణ్ జోహార్ ‘సైరాట్’ హిందీ రీమేక్ రైట్స్ తీసుకోవడంతో అందరూ ఆ సినిమానే జాహ్నవి చేస్తుందని అనుకుంటున్నారు’’ అన్నారు. మొత్తానికి శ్రీదేవి ఓ టెన్షన్ నుంచి గట్టెక్కేశారు. అమ్మాయి వెండితెరపై పరిచయమయ్యే తొలి సినిమా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ముద్దుల కూతురు ఎలా నటిస్తుందనే టెన్షన్ మొదలై ఉంటుంది!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement