నమితకు కోర్టు అండ
నటి నమితకు కోర్టు అండగా నిలిచింది. గళ్‌చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నమిత. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించిన ఈ గుజరాతీ బ్యూటీకి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే రాజకీయాల్లో రాణించాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు. స్థానిక నుంగంబాక్కంలోని వీరభద్రన్ వీధిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న నమితకు ఇంటి యజమాని కరుప్పయ్య నాగేంద్రన్ కు అద్దె విషయంలో సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. దీంతో నమిత ఇంటి యజమాని చర్యలు తనను బాధిస్తున్నాయని నుంగంబాక్కం పోలీస్‌స్టేన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఇంటి యజమాని తనను ఇల్లు ఖాళీ చేయించడానికి పలు విధాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నారని, రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తనకు ప్రశాంతంగా జీవించే హక్కు ఉందని అందువల్ల తనపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఇంటి యజమానిని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ ను బుధవారం విచారించిన న్యాయమూర్తి నటి నమితపై ఎలాంటి ఒత్తిళ్లు చేయరాదని ఇంటి యజమానిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.