బంజారాహిల్స్: కిరాయి చెల్లించకుండా ఇంట్లో ఉండటమేగాక ఇంటిని ఖాళీ చేయాలని చెప్పిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు, విశ్రాంత ప్రొఫెసర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడిన ఘటనలో తండ్రీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 7లోని ఉమెన్ కో అపరేటివ్ సొసైటీ ప్లాట్ నెంబర్ 88లో విశ్రాంత ప్రొఫెసర్, ప్రముఖ పీడియాట్రిక్ నిపుణురాలు డా.గంటా కుసుమకు ఇల్లు ఉంది. పదేళ్ల క్రితం ఈ ఇంట్లో మొయ్యా రాఘవేంద్రనాథ్, ఆయన తండ్రి మొయ్యా రవీంద్రనాథ్ కిరాయికి దిగారు. కాగా నాలుగేళ్ల క్రితం తన భర్తతో కలిసి సొంతింట్లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటిని ఖాళీ చేయాలని రాఘవేంద్రనాథ్‌ను కోరారు.
అయితే ఇంటిని ఖాళీ చేయ కుండా రోజుకో సాకును చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇంటిని ఖాళీ చేయకపోగా గత కొన్నినెలలుగా అద్దె కూడా చెల్లించడం లేదు. ఇల్లు ఖాళీ చేయాలని డా. కుసుమతో పాటు ఆమె కుటుంబ సభ్యులు రాఘవేంద్రనాథ్‌ను ఈనెల 8న కోరారు. దీంతో తీవ్ర పదజాలంతో వారిని దూషించడంతో పాటు అసభ్యకరమైన రీతిలో ప్రవర్తించడంతోపాటు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేశారు.
నాలుగేళ్ల వరకు ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని, కిరాయి కూడా ఇచ్చేది లేదంటూ దబాయించారు. దీంతో బాధితురాలు డా.కుసుమ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఈ మేరకు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.
గతంలో పార్కు స్థలం కబ్జా కేసులో..
ఇదిలా ఉండగా వృద్ధురాలైన వైద్యురాలి ఇంట్లో కిరాయికి దిగి ఖాళీ చేయకుండా వేధిస్తుండడంతో పాటు బెదిరింపులకు దిగిన నిందితులు మొయ్యా రవీంద్రనాథ్, మొయ్యా రాఘవేంద్రనాథ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.9లోని సత్వా ఎన్‌క్లేవ్ కాలనీలో పార్కుస్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది.
ఈ కేసులో నిందితులిద్దరూ అరెస్టయినట్లు విచారణలో తేలింది. ఫోర్జరీ పత్రాలతో సుమారు రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు ఏకంగా జీహెచ్‌ఎంసీని బురిడీ కొట్టించి నిర్మాణ అనుమతులు తీసుకున్న వ్యవహారంపై కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అధికారులను బెదిరించడం, భూములను కబ్జా చేసినట్లు తేలింది.
(చదవండి: కోమటిరెడ్డి సోదరులు.. కోవర్టు బ్రదర్స్)
Comments
Please login to add a commentAdd a comment