నేను రాజకీయాల్లోకి రాకూడదా? | namitha interview with sakshi | Sakshi
Sakshi News home page

నేను రాజకీయాల్లోకి రాకూడదా?

Published Wed, Oct 28 2015 3:15 AM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

నేను రాజకీయాల్లోకి రాకూడదా? - Sakshi

నేను రాజకీయాల్లోకి రాకూడదా?

కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించే గుజరాతీ భామ నమిత. అభిమానులను మచ్చాన్స్(బావలు) అంటూ ముద్దుగా పిలుస్తూ కవ్వించే ఆమె ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ సందడి చేస్తుంది. ఈ సుందరి కొంతకాలంగా తమిళసినిమాలకు దూరం కావడంతో అభిమానులు కలత చెందారు. అందుకు కారణం ఆమె స్థూలకాయమే. చాలా ఒత్తిడికి గురైన నమిత ఇప్పుడు మళ్లీ చిక్కి చక్కగా తయారైంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. సినీ, వ్యక్తిగత విషయాల గురించి నమితతో ‘సాక్షి’ భేటీ..          - తమిళ సినిమా
 
 
ప్ర : రీఎంట్రీ మలయాళంలో అయినట్లున్నారే?

జ : నేనెక్కడికి వెళ్లినా, ఏ సినిమాతో రీఎంట్రీ అయినా తమిళనాడు బావల మనసుల్లో పదిలంగా ఉండిపోతాను. శరీరం లావెక్కడంతో నటించడానికి ఎవరూ పిలవలేదు. కొంచెం పరిచయం ఉన్నవాళ్లు కూడా ఎక్కడ అవకాశాలు అడుగుతానో అని తప్పించుకుతిరుగుతున్నారు. అప్పుడే ఇక విషయం అర్థమైంది. నేను చాలా చాలా బరువెక్కాను. నాలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుందిగా అని ఆలోచించాను. ఎక్సర్‌సైజ్ ద్వారా 94 కిలోల బరువున్న నేను 76కు తగ్గాను. స్లిమ్‌గా తయారవడంతో మలయాళంలో పులిమురుగన్ అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
 
ప్ర : భోజనం ఫుల్‌గా లాగించేవాళ్లా?
జ : అవును. తమిళంలో నేను నటించిన చివరి చిత్రం ఇళంజన్. అది విడుదలై సుమారు ఐదున్నరేళ్లు అవుతోంది. ఈ మధ్యలో అవకాశాలు లేకుండా ఖాళీగా కూర్చోలేదు. తెలుగు, కన్నడ భాషలలో నటిస్తూనే ఉన్నాను. నాకు నచ్చిన తమిళంలో సక్సెస్ కాలేకపోయాననే చింత వెంటాడుతూనే ఉండేది. అలా ఒత్తిడికి లోనై ఆహార నియమాలను పక్కన పెట్టి బిరియాని, పిజ్జా, ఐస్‌క్రీమ్, అన్నం అంటూ ఏదిపడితే అది లాగించేశాను. ఆ తర్వాత చూసుకుంటే బరువు సరాసరిగా పెరిగిపోయింది. చాలా భయపడిపోయాను. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయత్నంతోనే ఇదిగో ఇలా స్లిమ్‌గా తయారయ్యాను.
 
ప్ర : నిర్మాతగా మారనున్నారట?
జ : ఇది నిజంగా జోకే. ఎవరు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి వదంతులను. నాకు చిత్ర నిర్మాణ ఆలోచనే లేదు. సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా చెయ్యాలో తెలియదు. నాకు తెలిసిందల్లా నటన ఒక్కటే. అది సరిగా చేస్తే చాలని భావిస్తాను.
 
ప్ర : బాక్సింగ్ నేర్చుకున్నారట?
జ : ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటాను. అలా స్టంట్ క్లాస్‌కు వెళ్లి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాతే నాకు తెలియకుండానే నాలో ధైర్యం పెరిగింది. అంతేకాదు యాక్షన్ కథా చిత్రాల్లో నటించాలనే కోరిక పెరిగింది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.
 
ప్ర : తమిళనాడు నచ్చిందా?
జ : చాలా బాగా నచ్చేసింది. అందుకేగా గుజరాత్ నుంచి వచ్చేసి చెన్నైలో సెటిల్ అయిపోయాను. ఇకపై ఇదే నా పుట్టినిల్లు. ఇప్పుడు గుజరాత్‌లో ఏయే పండుగలు చేసుకుంటున్నారన్నది కూడా మరచిపోయాను. తమిళనాడులో జరుపుకునే పండుగలన్నీ నాకు తెలుసు. నాకు బాగా నచ్చిన పండుగ పొంగల్. ఈ పొంగల్‌ను ఏదైనా పల్లెటూరుకెళ్లి జరుపుకోవాలనుకుంటున్నాను.
 
ప్ర : రాజకీయరంగ ప్రవేశం ఆలోచనలో ఉన్నారట?

జ: ఏం నేను రాజకీయాల్లోకి రాకూడదా? భారత దేశంలో ఇప్పుడున్న రెండు పెద్ద రాజకీయ పార్టీల వారు నన్ను తమ పార్టీలో చేరమని రాయబారం పంపుతున్నారు. వారికి నేనింకా ఏమీ చెప్పలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తా. ఏ పార్టీలో చేరతానన్నది మీకు అప్పుడే తెలుస్తుంది.
 
ప్ర : సరే పెళ్లి సంగతేమిటి?

జ : దాంతో ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటివరకూ నేనెవరినీ ప్రేమించలేదు. ఇకపై ఏమి జరుగుతుందో తెలియదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement