కొత్త అవతారమెత్తిన ప్రభుదేవా
చెన్నై: నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న ప్రభుదేవా ప్రస్తుతం పాటల రచయిత అవతారమెత్తారు. ‘దేవి’ చిత్రం తర్వాత ప్రభుదేవా నటిస్తున్న చిత్రం ‘ఎంగ్ మంగ్ సంగ్’. ఎం.ఎస్.అర్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అమ్రీష్ సంగీత దర్శకత్వంలో ‘అయ్యనారా వందుటాంగ ఇంగ పారు’ అనే పాటను ప్రభుదేవా రాయగా శంకర్ మహాదేవన్ పాడారు. కుంభకోణంలో ప్రభుదేవా, 150 మంది నృత్య కళాకారులతో ఈ పాటకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. వాసన్ విజువల్ వెంచర్స్ సంస్థ పతాకంపై కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎస్.శివరామన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రభుదేవా పాట రాయడం గురించి దర్శకుడు మాట్లాడుతూ చిత్రంలో ఓ భారీ ఉత్సవం జరిగే సన్నివేశం ఉందని, ఆ సందర్భంగా ఓ పాట కూడా ఉందని తెలిపారు. అలాంటి పాటను ఓ ప్రసిద్ధ గీత రచయితతో రాయించాలని ముందుగా అనుకున్నామని, ప్రభుదేవాతో చెప్పగా ఆ పాటలో ఏ అంశాలు ఉండాలనే విషయాన్ని వివరించారని పేర్కొన్నారు. ఆయన చెప్పిన అంశాలు బాగుండటంతో ఆ పాటను రాయమని ప్రభుదేవాకు చెప్పానన్నారు. అయితే మొదట సంకోచించినప్పటికీ తర్వాత ఆయన పాటను రాశారని తెలిపారు.