అగ్నిగుండం దండకారణ్యం
‘‘భారతదేశంలో 12 రాష్ట్రాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరేలా ప్రభుత్వాలు చేపడుతున్న బాక్సైట్, గనుల తవ్వకాల వల్ల అడవులు సర్వనాశనమైపోతున్నాయి. దీనిద్వారా అడవి బిడ్డలైన ఆదివాసీయుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. మందుపాతరలు, ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం అగ్నిగుండంగా మారుతోంది. అక్కడ ఎలాంటి మారణహోమం జరగకుండా, ఆది వాసీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాపాడాలన్నదే ‘దండకారణ్యం’ కథ’’ అని దర్శక-నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు.
ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘దండకారణ్యం’ ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘‘బాక్సైట్ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీలో ఆదివాసీయులు ఉద్యమం చేస్తున్నారు. పోలీసులు, మిలటరీ దళాలు అక్కడ కాల్పులు జరుపుతుండడంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై పార్లమెంట్‌లో ప్రస్తావించిన ప్రజా ప్రతినిధులు ఆదివాసీయుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి దండకారణ్యంలో మారణహోమం జరగకుండా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రజాకవులు గద్దర్, గోరటి వెంకన్న, యశ్‌పాల్, పి.తిరుపతి, కాశీపతి ఈ చిత్రానికి మంచి పాటలు రాశారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్, గద్దర్ పాటలు ప్రధాన ఆకర్షణ.
ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. నా గత చిత్రాలను ఆదరించినట్లే ఈ చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరించి, మరిన్ని చిత్రాలు తీసే ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం గద్దర్ స్వయంగా 3 పాటలు రాసి, పాడి, నటించడం విశేషం. సమకాలీన దండకారణ్య చరిత్రకు దర్పణమైన ఈ చిత్రానికి సెన్సార్ దాదాపు 80 ఆడియో కట్స్ విధించడం సంచలనమైంది.