Dandakaranya
-
ఆయన ఇలాగే ముందుకు సాగాలి
- గద్దర్ ‘‘సామాజిక ప్రయోజనం కోసం తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే మా కృషి ఫలించినట్లు భావిస్తాం. ఆర్. నారాయణమూర్తి ఇప్పటి వరకూ సామాజిక సమస్యలపై తీసిన సినిమాలకంటే ఇదొక రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఆయన ఇలాగే ముందుకు సాగాలి. అందుకు మేమెప్పుడూ అండగా ఉంటాం’’ అని ప్రజా కవి గద్దర్ తెలిపారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’ 18న విడుదలవు తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను నిర్వహించారు. పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ ప్లాటినమ్ డిస్క్‌లను చిత్ర బృందానికి అందించారు. ‘‘నారాయణ మూర్తి కాలం వంటివారు. అందుకే ఎవరికీ లొంగ కుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు’’ అని అశోక్‌తేజ అన్నారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ - ‘‘ఆదివాసీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించి ప్రభుత్వం గనులు, బాక్సైట్ గనుల తవ్వకాలను చేపడుతోంది. దాంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో పాటు పర్యావరణం నాశనం అయిపోతోంది. ప్రభుత్వం వారి హక్కులను కాపాడి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం’’ అని చెప్పారు. సంగీత దర్శకులు ‘వందేమాతరం’ శ్రీనివాస్, ప్రజా కవులు గోరటి వెంకన్న, యశ్పాల్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిగుండం దండకారణ్యం
‘‘భారతదేశంలో 12 రాష్ట్రాల్లో దండకారణ్యం విస్తరించి ఉంది. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరేలా ప్రభుత్వాలు చేపడుతున్న బాక్సైట్, గనుల తవ్వకాల వల్ల అడవులు సర్వనాశనమైపోతున్నాయి. దీనిద్వారా అడవి బిడ్డలైన ఆదివాసీయుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. మందుపాతరలు, ఎన్కౌంటర్లతో దండకారణ్యం అగ్నిగుండంగా మారుతోంది. అక్కడ ఎలాంటి మారణహోమం జరగకుండా, ఆది వాసీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాపాడాలన్నదే ‘దండకారణ్యం’ కథ’’ అని దర్శక-నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘దండకారణ్యం’ ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడారు. ‘‘బాక్సైట్ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీలో ఆదివాసీయులు ఉద్యమం చేస్తున్నారు. పోలీసులు, మిలటరీ దళాలు అక్కడ కాల్పులు జరుపుతుండడంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సంఘటనపై పార్లమెంట్లో ప్రస్తావించిన ప్రజా ప్రతినిధులు ఆదివాసీయుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరిపి దండకారణ్యంలో మారణహోమం జరగకుండా శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలి. ప్రజాకవులు గద్దర్, గోరటి వెంకన్న, యశ్పాల్, పి.తిరుపతి, కాశీపతి ఈ చిత్రానికి మంచి పాటలు రాశారు. ‘వందేమాతరం’ శ్రీనివాస్, గద్దర్ పాటలు ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. నా గత చిత్రాలను ఆదరించినట్లే ఈ చిత్రాన్నీ ప్రేక్షకులు ఆదరించి, మరిన్ని చిత్రాలు తీసే ప్రోత్సాహం ఇవ్వాలి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం గద్దర్ స్వయంగా 3 పాటలు రాసి, పాడి, నటించడం విశేషం. సమకాలీన దండకారణ్య చరిత్రకు దర్పణమైన ఈ చిత్రానికి సెన్సార్ దాదాపు 80 ఆడియో కట్స్ విధించడం సంచలనమైంది. -
అటవీ సంపద అడవి బిడ్డలదే..
పాలకులకు కనువిప్పు కలిగించే ‘దండకారణ్యం’ విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి పెద్దాపురం(సామర్లకోట) : అటవీ సంపదను విదేశీయులకు, బహుళజాతి సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంద ని, దానిపై పోరాటంగానే ‘దండకారణ్యం’ చిత్రాన్ని నిర్మించినట్టు ప్రముఖ దర్శక, నిర్మాత, విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. మంగళవా రం పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడా రు. స్నేహచిత్ర బ్యానర్‌పై దండకారణ్యం చిత్రాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో గద్దర్ మూడు పాటలు పాడారని తెలిపారు. అడవితల్లి పురాణాల ప్రకారం, సీతారాములకు, పాండవులకు నీడను ఇచ్చిందని, అటువంటి దండకారణ్య సంపదను విదేశీయులకు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్రం కోసం విదేశీ యులను తరిమికొట్టేందుకు పోరాటాలు చేస్తే, నేటి పాలకులు విదేశీయులను వెల్కం ఇండియా అంటూ స్వాగతం పలుకుతున్నారని దుయ్యబట్టారు. అడవిలో ఉండి దోచుకోవడానికి కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. దండకారణ్యంలో ఆదివాసీల పాదాల కింద ఉన్న సహజ సంపదను వెలికితీస్తూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల అనుమతి లేకుండా ఎటువంటి ఖనిజ సంపదను వెలికితీయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలో 14 రాష్ట్రాల్లో ఉన్న దండకారణ్యాల నుంచి సంపదను దోచుకుపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని మండిపడ్డారు. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం ఉద్యమాలు చేసే ఉద్యమాలను అణచివేయడం కోసం మిలటరీ బలగాలను దింపుతున్నారని ఆరోపించారు. దాంతో దండకారణ్యం రణరంగంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్ల పేరుతో పోలీసులు, ఆదివాసులు చనిపోతున్నారని, ఈ మారణహోమాలు ప్రభుత్వాలే సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు బేషరతుగా మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. -
రూ.70తో ఇల్లు వదిలి వెళ్లా..
సాక్షితో సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ‘ఒకవైపు చదువు.. మరోవైపు సినిమా పిచ్చి. ఇంకోవైపు సమాజ సేవ.. ఇవన్నీ కలిసి చివరకు సినిమా రంగంలో వైపు తీసుకువెళ్లాయి. అమ్మ ఇచ్చిన కేవలం 70 రూపాయలతో మద్రాసు వెళ్లాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి రాలేదు. అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ నక్సలైట్లు, ఉద్యమాలు వంటి నేపథ్యంలో సినిమాలు తీయడంలో ఓ ట్రెండ్ సెట్ చేశా..’ అని చెప్పారు ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆదివారం బొబ్బిలి వచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నారాయణమూర్తి ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. మాది తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి వద్ద ఉండే మల్లమ్మపేట, వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. తండ్రి చిన్నయ్యనాయుడు, తల్లి చిన్నమ్మి. మేం నలుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కాచెల్లెలు. నేను బీఏ వరకు చదివాను. ప్రాథమిక స్థాయి నుంచి బీఏ చదివినంత వరకు అన్ని రంగాల్లోనూ చురుకైన పాత్ర పోషించాను. ఫైన్ ఆర్ట్స్, సత్రం, సామాజిక సేవ, రిక్షా యూనియన్.. ఇలా అన్ని సంఘాల బాధ్యతలు చేపట్టాను. ఎమర్జీన్సీ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాను. విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నాను. హీరో అవుదామని మద్రాసు వెళ్లా.. సినిమా పిచ్చి.. సమాజ సేవ.. ఈ రెండింటిలో సినిమావైపే కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. దీంతో అమ్మ ఇచ్చిన రూ.70 పట్టుకుని మద్రాసు వెళ్లాను. ఏకంగా హీరో అయిపోవాలని కలలు కన్నా. అక్కడ నాలాంటివారు వేలాది మంది ఉండడంతో భవిష్యత్తు అర్థం కాలేదు. ఎన్టీఆర్‌ను తిరుపతి భక్తుల్లో కలిసి మొదటిసారి చూశా. ఆ తర్వాత మా గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో ‘మనుషులంతా ఒక్కటే’, ‘విశ్వరూపం’ సినిమాల్లో నటించే అవకాశం కలిగింది. ‘నీడ’ సినిమా చూసి అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వదించారు. సంగీత సినిమాల్లో హీరో వేషం వేసినా పేరు వచ్చింది. కానీ వేషాలు రాలేదు. బతుకంతా అగమ్యగోచరంగా ఉండే సమయంలో ‘వెలుగునీడలు’ సినిమాలో ‘కలకానిది.. ’ అనే పాట గుర్తుకు వచ్చింది. ఇంటికి వెళ్లకుండా నేనే హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మారాను. నా స్నేహితులు, సినీ పరిశ్రమల పెద్దలు అండగా నిలవడంతో ‘స్నేహ చిత్ర’ బ్యానర్‌ను ఏర్పాటుచేశాను. ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ అనే సినిమా తీసి 1986 నవంబరులో విడుదల చేశా. ఇప్పటివరకు 29 సినిమాలు తీశా ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ నుంచి ఇప్పటివరకు 29 సినిమాలు చేశాను. అర్ధరాత్రి స్వాతంత్య్రం, అడవి దివిటీలు, ఎర్రసైన్యం, ఊరుమనదిరా.., దళం, గంగమ్మజాతర, లాల్ సలాం, దండోరా, చీమలదండు, వేగుచుక్కలు, చీకటి సూర్యులు, వీర తెలంగాణ, పీపుల్స్‌వార్ సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే సాంస్కృతిక సైనికుడిగా సినిమా తీస్తున్నా. అడవి, సైన్యం, పోరాటం, పరిష్కారం వంటి అంశాల్లో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించా. దేశద్రోహుల నేపథ్యమే ‘దండకారణ్యం’ దేశాన్ని, జాతి సంపదను దోచుకుంటూ బహుళ జాతి, కార్పొరేట్, ప్రయివేటు రంగాలకు కొమ్ముకాస్తున్న దేశద్రోహుల నేపథ్యమే నా ‘దండకారణ్యం’ ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నాం. -
దద్దరిల్లుతోంది... దండకారణ్యం
‘‘అభివృద్ధి పేరుతో ఆదివాసీలకు రాజ్యాంగం క ల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసి, అక్కడి సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోంది. అందమైన ప్రకృతికి నిలయమైన దండకారణ్యాలు దద్దరిల్లుతున్నాయి. భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితి మారాలన్న కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. స్వీయదర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ‘దండకారణ్యం’ చిత్రం ఈ మార్చి 4న విడుదల కానుంది. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ- ‘‘మావోయిస్టు నాయకుడు కిషన్‌జీ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. అడవి తల్లి కోసం పోరాడుతున్న వారు, ప్రభుత్వం తరపున ఉద్యోగాలు చేస్తున్న పోలీసులు యుద్ధం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఇద్దరూ తమ కన్నతల్లులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇకనైనా కాల్పుల విరమణ పాటించి, అడవిని ప్రశాంతంగా ఉంచాలనే అంశాన్ని మా చిత్రం ద్వారా చెబుతున్నాం. ఈ నెల 20న పాటలను విడుదల చేయనున్నాం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఎడిటింగ్-సంగీతం: ఆర్.నారాయణమూర్తి. -
ఆదివాసీయుల జీవనపోరాటం!
‘‘ఆదివాసీయుల సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాలున్నా వాటి అమలు మాత్రం జరగడం లేదు. మనుగడను కాపాడుకోవడం కోసం వాళ్లు చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం చేశా’’ అని ఆర్.నారాయణమూర్తి చెప్పారు. స్వీయదర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం ‘దండకారణ్యం’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. నారాయణమూర్తి మాట్లాడుతూ- ‘‘అడవుల్లో ప్రభుత్వం చేపట్టే తవ్వకాల కారణంగా పర్యావరణం నాశనమవుతోంది. ప్రభుత్వ విధానాల కారణంగా ఆదివాసీయుల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. వారి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే చిత్రం ఇది. విజయనగరం, శ్రీకాకుళంలతో పాటు ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో చిత్రీకరణ జరిపాం. ప్రజా గాయకుడు గద్దర్ ఇందులో మూడు పాటలు పాడారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
దండకారణ్యంలో కందకాలు
దండకారణ్యంలో మావోయిస్టులు భారీ స్థాయిలో కందకాల తవ్వకం చేపట్టారు. పోలీసులు ఏర్పాటు చేసే బేస్ క్యాంపులను అడ్డుకోవడంలో భాగంగానే వ్యూహాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతంలో మూడు బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో.. మావోయిస్టులు తమ స్ధావరాలను సేఫ్ జోన్ లుగా మార్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు కాకుండా.. ఇప్పటికే ఏర్పాటు చేసిన క్యాంపులకు సరఫరాలు అందకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు డిసెంబర్ నెలలో ఏటా జరిగే పీఎల్ జీఏ వారోత్సవాల నిర్వహణలో భాగంగానే.. ముందు జాగ్రత్త చర్యగా కందకాల ఏర్పాటు జరుగుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలోని అమ్మపేట - పాలచల్మ మధ్యలో శుక్రవారం రాత్రి నుంచి మావోయిస్టులు రోడ్డుమార్గంలో కందకాల తవ్వకాలు మొదలుపెట్టారు. దండకారణ్య నేత సుధాకర్ నేతృత్వంలో వందలాది మంది మిలీషియా సభ్యులు ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రహదారిపై దాదాపు పది నుంచి పదిహేను కందకాలు తవ్వినట్లు తెలుస్తోంది. రెండునెలల క్రితం పైడిగూడెం అటవీ ప్రాంతంలోని రహదారిపై మావోయిస్టులు 20 కిపైగా కందకాలు తవ్వారు. ఆ తర్వాత మావోయిస్టు విలీన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వారోత్సవాల కోసమే కందకాలు తవ్వారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
దండకారణ్యంలో శాంతి కోసం...!
‘‘త్రేతాయుగంలో సీతారాములకు, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన దండకారణ్యం ఇప్పుడు క ష్టాల్లో ఉంది. అక్కడ ఉండే ఆదివాసీలు ఇప్పడు నానా కష్టాలు పడుతున్నారు. అర ణ్యం అనేది తుపాకీ రాజ్యం కాకూడదు. అక్కడ శాంతి కోసం ఎలాంటి పోరాటం జరిగిందన్నదే ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం’’ అని దర్శక, నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అంటున్నారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై నారాయణమూర్తి హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘దండకారణ్యం’. ‘‘మా సంస్థలో వస్తున్న 28వ చిత్రమిది. ఇందులో మొత్తం 9 పాటలు ఉంటాయి. వైజాగ్, విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని ఆర్.నారాయణమూర్తి తెలిపారు.