రూ.70తో ఇల్లు వదిలి వెళ్లా.. | Special Interview EXCLUSIVE WITH R NARAYANA MURTHY | Sakshi
Sakshi News home page

రూ.70తో ఇల్లు వదిలి వెళ్లా..

Published Sun, Feb 28 2016 11:47 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

రూ.70తో ఇల్లు వదిలి వెళ్లా.. - Sakshi

రూ.70తో ఇల్లు వదిలి వెళ్లా..

 సాక్షితో సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి
  ‘ఒకవైపు చదువు.. మరోవైపు సినిమా పిచ్చి. ఇంకోవైపు సమాజ సేవ.. ఇవన్నీ కలిసి చివరకు సినిమా రంగంలో వైపు తీసుకువెళ్లాయి. అమ్మ ఇచ్చిన కేవలం 70 రూపాయలతో మద్రాసు వెళ్లాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి రాలేదు. అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ నక్సలైట్లు, ఉద్యమాలు వంటి నేపథ్యంలో సినిమాలు తీయడంలో ఓ ట్రెండ్ సెట్ చేశా..’  అని చెప్పారు ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘దండకారణ్యం’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆదివారం బొబ్బిలి వచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నారాయణమూర్తి ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు.           
 
 వ్యవసాయ కుటుంబం నుంచి..
 మాది తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి వద్ద ఉండే మల్లమ్మపేట, వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. తండ్రి చిన్నయ్యనాయుడు, తల్లి చిన్నమ్మి. మేం నలుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కాచెల్లెలు. నేను బీఏ వరకు చదివాను. ప్రాథమిక స్థాయి నుంచి బీఏ చదివినంత వరకు అన్ని రంగాల్లోనూ చురుకైన పాత్ర పోషించాను. ఫైన్ ఆర్ట్స్, సత్రం, సామాజిక సేవ, రిక్షా యూనియన్.. ఇలా అన్ని సంఘాల బాధ్యతలు చేపట్టాను. ఎమర్జీన్సీ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాను. విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నాను.
 
 హీరో అవుదామని మద్రాసు వెళ్లా..
 సినిమా పిచ్చి.. సమాజ సేవ.. ఈ రెండింటిలో సినిమావైపే కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. దీంతో అమ్మ ఇచ్చిన రూ.70 పట్టుకుని మద్రాసు వెళ్లాను. ఏకంగా హీరో అయిపోవాలని కలలు కన్నా. అక్కడ నాలాంటివారు వేలాది మంది ఉండడంతో భవిష్యత్తు అర్థం కాలేదు. ఎన్టీఆర్‌ను తిరుపతి భక్తుల్లో కలిసి మొదటిసారి చూశా. ఆ తర్వాత మా గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో ‘మనుషులంతా ఒక్కటే’, ‘విశ్వరూపం’ సినిమాల్లో నటించే అవకాశం కలిగింది. ‘నీడ’ సినిమా చూసి అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వదించారు. సంగీత సినిమాల్లో హీరో వేషం వేసినా పేరు వచ్చింది. కానీ వేషాలు రాలేదు. బతుకంతా అగమ్యగోచరంగా ఉండే సమయంలో ‘వెలుగునీడలు’ సినిమాలో ‘కలకానిది.. ’ అనే పాట గుర్తుకు వచ్చింది. ఇంటికి వెళ్లకుండా నేనే హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా మారాను. నా స్నేహితులు, సినీ పరిశ్రమల పెద్దలు అండగా నిలవడంతో ‘స్నేహ చిత్ర’ బ్యానర్‌ను ఏర్పాటుచేశాను. ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ అనే సినిమా తీసి 1986 నవంబరులో విడుదల చేశా.
 
 ఇప్పటివరకు 29 సినిమాలు తీశా
 ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ నుంచి ఇప్పటివరకు 29 సినిమాలు చేశాను. అర్ధరాత్రి స్వాతంత్య్రం, అడవి దివిటీలు, ఎర్రసైన్యం, ఊరుమనదిరా.., దళం, గంగమ్మజాతర, లాల్ సలాం, దండోరా, చీమలదండు, వేగుచుక్కలు, చీకటి సూర్యులు, వీర తెలంగాణ, పీపుల్స్‌వార్ సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే సాంస్కృతిక సైనికుడిగా సినిమా తీస్తున్నా. అడవి, సైన్యం, పోరాటం, పరిష్కారం వంటి అంశాల్లో ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించా.
 
 దేశద్రోహుల నేపథ్యమే ‘దండకారణ్యం’
 దేశాన్ని, జాతి సంపదను దోచుకుంటూ బహుళ జాతి, కార్పొరేట్, ప్రయివేటు రంగాలకు కొమ్ముకాస్తున్న దేశద్రోహుల నేపథ్యమే నా ‘దండకారణ్యం’ ఈ సినిమాను మార్చి 18న విడుదల చేస్తున్నాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement