
హాలీవుడ్ కథలో... దీపికా పదుకొనే!
హీరో, హీరోయిన్‌లకు క్యాన్సర్ ఉంటుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. క్లయిమాక్స్‌లో హీరో చనిపోతే...హీరోయిన్ అతని జ్ఞాపకాలతో జీవితం కొనసాగిస్తుంది. హాలీవుడ్‌లో గత ఏడాది విడుదలై మంచి పేరు తెచ్చుకున్న ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే సినిమా కథ ఇది. ప్రపంచ ప్రఖ్యాత రచయిత జాన్ గ్రీన్ రాసిన నవల ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా జోష్ బూన్ దర్శకత్వంలో అదే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో కథానాయికగా దీపికా పదుకొనే నటించనున్నారని సమాచారం. దీపికతో ‘కాక్‌టైల్’, ‘ఫైండింగ్ ఫానీ’ చిత్రాలు రూపొందించిన హోమీ అదజానియా దీన్నీ తెరకెక్కించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విషాదభరితమైన ప్రేమకథ కావడంతో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులూ చేర్పులూ చేస్తున్నార ట.