న్యూఢిల్లీ: తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం కోసం ప్రజలు వీధుల్లోకి రావడం బాగుందని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె అన్నారు. దేశం గురించి.. దేశ భవిష్యత్తు గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించడం మంచి విషయమని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ తారలు ప్రజలకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వారికి సంఘీభావం తెలుపుతున్నారు. అదే విధంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులపై ముసుగు దుండగుల దాడిని బీ-టౌన్ తీవ్రంగా ఖండించింది.(జేఎన్‌యూలో దీపిక)
ఈ నేపథ్యంలో దీపిక ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ప్రతీ ఒక్కొరు భావాలను నిర్భయంగా పంచుకోవడం పట్ల గర్వంగా ఉందన్నారు. తాము నమ్మిన సిద్ధాంతానికి నేటి యువత కట్టుబడి ఉండటం ముచ్చట గొలుపుతుందన్నారు. తమ గళం వినిపించడం కోసం ప్రజలు బయటికి రావడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. ఇక దీపిక పదుకొనే మంగళవారం సాయంత్రం జేఎన్‌యూని సందర్శించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నలుపు రంగు దుస్తులు ధరించిన దీపిక.. దాదాపు 10 నిమిషాల పాటు క్యాంపస్‌లో ఉన్నారు. దాదాపు 7.40 గంటలకు క్యాంపస్‌లోకి వచ్చిన ఆమె.. అక్కడ జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే, విద్యార్థులనుద్దేశించి దీపిక ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. కాగా దీపిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఛపాక్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక.. ‘ఛపాక్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ.. దీపిక విద్యార్థుల కోసం తన సమయాన్ని కేటాయించడం విశేషం.(ఆ చూపులు మారాలి: హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment