వందల కోట్ల రాణి... దీపికా!
వందల కోట్ల రాణి... దీపికా!
Published Wed, Oct 29 2014 4:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
హిట్ల మీద హిట్లిస్తూ బాలీవుడ్ లో దీపిక పదుకొనే హవా కొనసాగిస్తోంది. గత రెండు సంవత్సరాలు అత్యధిక హిట్ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ తారగా దీపికా పదుకొనే పేరు మారుమోగుతోంది.. బాలీవుడ్ బాక్సాఫీస్ కు చిరునామాగా మారిన వంద కోట్ల క్లబ్ వైపు దీపికా నటించిన చిత్రాలన్ని చకచకా పరుగు పెడుతున్నాయి. ఓం శాంతి ఓంతో ప్రారంభమైన దీపిక విజయ పరంపర తాజా హ్యాపీ న్యూ ఇయర్ వరకు కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ అత్యధిక చిత్రాలను చేర్చిన తారగా దీపిక పదుకొనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
'కాక్ టెయిల్' చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్ తో దీపికా పదుకొనే పండించిన కెమిస్ట్రీ అభిమానులను మెప్పించడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో తొలిసారి చేరేలా చేసింది. ఆతర్వాత మళ్లీ సైఫ్ తో జతకట్టి దీపికా నటించిన రేస్ 2 చిత్రం కేవలం 14 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. అప్పట్లో ఇది బాలీవుడ్ లో ఓ రికార్డుగా చెప్పుకుంటారు.
ఇక 2013 లో బాలీవుడ్ లో దీపికా జోరు ఊపందుకుంది. రణబీర్ కపూర్ తో నటించిన యే జవానీ హై దీవానీ, షారుక్ తో చెన్నై ఎక్స్ ప్రెస్, రణ్ వీర్ తో గోలియోంకి రాస్ లీలా.. రామ్ లీలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా తక్కువ కాలంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరాయి. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా చిత్రాల ఎంపికలోనూ దీపిక తీరు విమర్శకుల్ని సైతం ఆశ్చర్య పడేలా చేసింది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా చిత్రాల్లో అభినయంతోనూ అభిమానులను, ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించింది.
తాజాగా షారుక్, అభిషేక్, సోనుసూద్ బృందంతో కలిసి నటించిన 'హ్యపీ న్యూ ఇయర్' రికార్డులను తిరగరాస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే హ్యాపీ న్యూ ఇయర్ వంద కోట్ల క్లబ్ మార్కును అధిగమించింది. లెటెస్ట్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. హిట్ చిత్రాలతో బాలీవుడ్ హీరోలకు 'లక్కీ మస్కట్' గా మారిన దీపిక పదుకొనే మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిద్దాం!
Advertisement
Advertisement