ఆ మాటలు నన్ను కదిలించాయి!
స్వేచ్ఛ, సమానత్వం... ఇలా మహిళా హక్కుల గురించి దేశ వ్యాప్తంగా చాలా చర్చ జరుగుతోంది. దీపికా పదుకొనే అయితే ‘మై చాయిస్’ అనే వీడియో రూపొందించారు. దీనికి ఆమెకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. నేను సైతం అంటూ తాజాగా ప్రసిద్ధ హిందీ నటి షబానా ఆజ్మీ కూడా మహిళా సాధికారత మీద క్రియేటివ్ సర్వీస్ సపోర్ట్ గ్రూప్ అనే సంస్థ రూపొందించనున్న డాక్యుమెంటరీలో నటించనున్నారు. కొంత మంది మహిళలు ఉత్తరాల ద్వారా చెప్పుకున్న తమ సమస్యలను ఈ డాక్యుమెంటరీ ద్వారా బయటపెట్టనున్నారు.
ఈ సమస్యలను ప్రముఖ తారలతో చెప్పిస్తున్నారు. ఇప్పటికే కథానాయికలు అదితీ రావ్, దియా మిర్జాలతో కొన్ని సమస్యలు చెప్పించారు. అలాగే, ప్రముఖ అమెరికన్ స్త్రీ వాద రచయిత్రి మాయా యాంజిలో రాసిన ‘అండ్ స్టిల్ ఐరెజ్’ కవితలోని కొన్ని లైన్లను షబానా తన గళం ద్వారా వినిపించనున్నారు. దీని గురించి ఆమె చెబుతూ -‘‘మహిళా సాధికారత అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. ఈ సమస్యపై ఎవరైనా స్పందించవచ్చు . మహిళలు అన్ని దశల్లోనూ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచానికి వినిపించే వీడియో ఇది.
మాయా యాంజిలో రాసిన ఆ కొన్ని లైన్లు నా మనసును కదిలించాయి’’ అన్నారు. దీపికా పదుకొనే ‘మై చాయిస్’ గురించి షబానా స్పందిస్తూ -‘‘చాలా కాలంగా మహిళలు తమ హక్కులకు దూరంగా ఉంటున్నారు. ఏదైనా సరే విపరీత ధోరణిలో అడిగితేనే కనీసం మహిళా సమానత్వం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. కొన్నాళ్ల తర్వాతైనా ఈ సామాజిక వ్యవస్థలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు.