
మైకేల్ జాక్సన్ కోసం...
‘‘సంగీత ప్రపంచంలో నాకు మైకేల్ జాక్సన్, ఇళయరాజా ఆదర్శం. పాప్ మ్యూజిక్ అంటే చాలా ఆసక్తి. అందుకే పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌కి నివాళిగా ‘జల్సా యమ్‌జే..’
‘‘సంగీత ప్రపంచంలో నాకు మైకేల్ జాక్సన్, ఇళయరాజా ఆదర్శం. పాప్ మ్యూజిక్ అంటే చాలా ఆసక్తి. అందుకే పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌కి నివాళిగా ‘జల్సా యమ్‌జే..’ అనే పాటను ఈరోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నాను. ఎందుకంటే రేపు మైకేల్ జాక్సన్ పుట్టినరోజు . ఈ సందర్భంగా ఈ పాటను యూ ట్యూబ్‌లో విడుదల చేయనున్నాను’’ అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ఇటీవల యూఎస్‌లోని పలు నగరాల్లో ఏడు రోజులపాటు మ్యూజికల్ షోస్ చేశారు దేవి. అక్కడి ప్రజల స్పందన చూసి, ఆనందం కలిగిందని, తనలో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు కదా మరి, ‘లెజెండ్’ విజయోత్సవంలో ఆయన గురించి ఘాటుగా స్పందించారు కదా? అన్న ప్రశ్నకు -‘‘బోయపాటిగారు మంచి వ్యక్తి. ఆయనతో కలిసి మూడు హిట్ సినిమాలు చేశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. సినిమా అన్నాక ఏదో మాటా మాటా వస్తుంది. అంతమాత్రాన అనుబంధాలు చెడిపోవు’’ అని చెప్పారు. పెళ్లి గురించి అడిగితే... ఇంట్లో ఆ ప్రయత్నాలు చేస్తున్నారని, కుదిరిన తర్వాత అందరికీ చెబుతానని దేవి స్పష్టం చేశారు.