
గౌతమ్‌తో... ధనుష్ గ్యాంగ్‌వార్
సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడైన యువ హీరో ధనుష్‌కు ఇప్పుడు టైమ్ బ్రహ్మాండంగా ఉన్నట్లుంది. ఆయన పట్టిందల్లా బంగారమే! ఆయన ఇటీవలే ఒక హాలీవుడ్ చిత్రంలో నటించనున్నట్లు ప్రకటించారు. ‘కాక్కా ముట్టై’ లాంటి తమిళ చిత్రాల నిర్మాణంతోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన నిర్మించగా, వెట్రిమారన్ దర్శకత్వంలో గత వారం విడుదలైన ‘విసారణై’ కమల్‌హాసన్, రజనీకాంత్ సహా పలువురి ప్రశంసలు పొందింది.
ప్రయోగశీలత ఉన్న ఇలాంటి నటుడితో చేయడానికి ఏ దర్శకుడికి మాత్రం ఉత్సాహం ఉండదు! తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ ఆయనతో తమిళంలో ఒక సినిమా చేయనున్నారు. ‘ఎన్‌మేల్ పాయుమ్ తోట’ అనే ఈ తమిళ చిత్రం మార్చి నుంచి సెట్స్‌పైకి వెళుతుందట! ఇది గ్యాంగ్‌వార్ల నేపథ్యంలో జరిగే యాక్షన్ సినిమా అని భోగట్టా. కేవలం రెండే రెండు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
సినిమాలో తన భాగం పూర్తి చేసి, అటుపైన హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయడానికి వెళ్ళాలని ధనుష్ ఆలోచన. ధనుష్ ఇప్పుడు నటిస్తున్న తమిళ రాజకీయ థ్రిల్లర్ ‘కొడి’ షూటింగ్ కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తవుతుంది. సో, మార్చి నుంచి ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుంది. ఇతర తారాగణం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. విశేషమేమి టంటే, నిజానికి ఈ స్క్రిప్ట్‌ను హీరో సూర్యతో తెరకెక్కించాలని గౌతమ్ అనుకున్నారట! కానీ, ఆ ప్రాజెక్ట్ అర్ధంతరంగా అటకెక్కడంతో, ఇప్పుడు అదే స్క్రిప్ట్‌ను, అదే టైటిల్‌తో ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్నారని కోడంబాకమ్ కబురు.