తమిళసినిమా: నటీనటులే కాదు, ఏ శాఖకు చెందిన వారికైనా టర్నింగ్ పాయింట్ అనేది ఒకటుంటుంది.అలా నటి సాయిపల్లవి కెరీర్‌కు మలయాళం చిత్రం ప్రేమమ్ పెద్ద టర్నింగ్‌గా మారింది. అప్పటి వరకూ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వైద్య విద్య చదుకుకుంటున్న ఈ అమ్మడికి అనూహ్యంగా వరించిన అవకాశమే ప్రేమమ్. ఆ చిత్ర విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇతర నటీమణుల కంటే సాయిపల్లవి కాస్త భిన్నమనే చెప్పాలి. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది క్రేజీ హీరోయిన్‌గా మారింది.
అయితే ఈ అమ్మడికి కాస్త టెక్కు అనే ప్రచారం బాగా జరుగుతోంది. చాలా షరతులు విధిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. క్రమశిక్షణను పాటించదని షూటింగ్‌లకు చెప్పిన టైమ్‌కు రాదని ఆరోపణలను ఎదుర్కొంటున్న సాయిపల్లవి విధించే మరో నిబంధన గ్లామర్‌గా నటించనన్నది. సహ నటీమణులందరూ గ్లామర్‌కుసై అంటుంటే నువ్వెందుకు మడికట్టుకుని ఉన్నావన్న ప్రశ్నకు ఎందుకంటే తన తల్లిదండ్రులు తన సంతోషం కోసమే నటించడానికి అనుమతించారని, అలాంటి వారి మనసు నొచ్చుకునేలా ఎలాంటి పని తాను చేయనని బదులిచ్చింది.
గ్లామర్‌గా నటించకపోవడానికి కూడా అదే కారణం అని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మలయాళ చిత్రం ప్రేమమ్ తరువాత కోలీవుడ్‌లో మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్నే కాలదన్నుకుందన్నుకున్నా ఈ జాణకు చేతి నిండా చిత్రాలుండడం విశేషమే. తమిళంలో ఇప్పటికి ఒక్క చిత్రం తెరపైకి రాకపోయినా మూడు చిత్రాల్లో నటించేస్తోంది. అందులో విజయ్ దర్శకత్వంలో నటించిన కరు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.
ఇక సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యకు జంటగా ఎన్‌జీకే, ధనుష్ సరసన మరి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు తెలుగులోనూ నటిస్తోంది. దీంతో తాజాగా శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం తలుపు తట్టగా కాల్‌షీట్స్ సమస్య తలెత్తడంతో సారీ అని చేతులెత్తేసింది. ఇప్పుడా అవకాశం నయనతారను వెతుక్కుంటూ వెళ్లింది. ఆ అగ్రనటి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకు ముందు శివకార్తికేయన్, నయనతార నటించిన వేలైక్కారన్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment