
'అతడి చేతిలో ఆ హీరోలిద్దరు కీలుబొమ్మలు'
తిరువనంతపురం: ప్రముఖ మళయాల నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన దిలీప్ పెద్ద అవినీతిపరుడని మలయాళ ప్రముఖ దర్శకుడు వినయన్ అన్నారు. అందుకే అతడి అరెస్టు జరిగిందని చెప్పారు.'నాకున్న వ్యక్తిగత అనుభవం మేరకు, దిలీప్ పెద్ద అవినీతి పరుడు. మమ్మూటి, మోహన్‌లాల్ అతడి చేతిలో కీలుబొమ్మలు. మలయాళ చిత్రసీమలో అతడు ఎవరూ ఊహించని విధంగా పాతుకుపోయాడు. మలయాళ చిత్ర సీమను శాసిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఇతడే' అని వినయన్ చెప్పారు.
చిత్ర పరిశ్రమ నుంచి తనను బహిష్కరించడంలో దిలీప్ కుట్రే ఉందని చెప్పారు. తాను మలయాళ చిత్ర సీమ బాగుకోసం కొంతమందితో కలిసి ఎంఏసీటీఏ అనే సంస్థను స్థాపించానని, ఒక చిత్రంలో నటించకుండానే అడ్వాన్స్ తీసుకున్న వివాదంలో తాము ఒకసారి అతడిని బెదిరించామని తెలిపారు. ఆ సమయంలో తనను ఎట్టి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమలో ఉండనివ్వబోనంటూ హెచ్చరించాడని తెలిపారు. దిలీప్ అరెస్టు తర్వాత చిత్ర పరిశ్రమ మొత్తం కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.