
మళయాళ స్టార్ నటి భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో మరో మలుపు. కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్టార్ హీరో దిలీప్.. ప్రధాన నిందితుడు పల్సర్ సునీలు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తమను ట్రాప్ చేసి ఇరికించారని వాళ్లు చెబుతున్నారు. ‘నా మాజీ భార్య మంజు వారియర్‌కు నాకు మధ్య విభేదాలు ఉన్నాయి. అలాగే లాల్(ప్రముఖ నటుడు-దర్శకుడు)కి నేనంటే పడదు. అందుకే వారిద్దరు కుట్ర పన్ని నన్ను ఇరికించారు’ అని దిలీప్ చెబుతున్నారు.
ఇక పల్సర్ సునీ.. కిడ్నాప్ వ్యవహారంతో తనకేమాత్రం సంబంధం లేదని.. తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని అంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో భావన లైంగిక వేధింపులకు గురైంది. ఘటన జరిగిన కొద్ది రోజులకే పల్సర్ సునీ.. అతనికి సహకరించిన మిగతా వాళ్లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఆపై దిలీప్ పేరు తెరపైకి వచ్చి... విచారణకు కూడా హాజరయ్యాడు దిలీప్. తర్వాత అతడిని రిమాండుకు తరలించగా.. కొన్ని నెలల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురై.. చివరకు బెయిల్ లభించటంతో బయటకు వచ్చాడు. ఈ కేసులో ఇప్పుడు వీరిద్దరు ఎదురు దాడికి దిగుతుండటంతో కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.