ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ...సాహెబా సుబ్రహ్మణ్యం
అండదండలు లేకపోతే చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టం అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. అయితే అప్పుడప్పుడు కొందరు ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా పట్టుదలతో అవకాశాల్ని అందుకొంటుంటారు. ప్రతిభ ఉంటే చాలు.. ఎవరి అండ లేకపోయినా నెగ్గుకురావచ్చు అని నిరూపిస్తుంటారు. ఆ జాబితాలో మరో కథానాయకుడు చేరాడు. అతని పేరు.. దిలీప్‌కుమార్. చిన్నప్పట్నుంచీ సినిమా కలలు కన్నాడు. ఎప్పటికయినా వెండితెరపై తనను తాను చూసుకోవాలనుకొన్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసి... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం అందుకొన్నాడు. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. నాగేశ్వరరావు కొల్లా నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కథానాయకుడు దిలీప్‌కుమార్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివీ...
మలయాళం సినిమా రీమేక్ హక్కుల్ని నేనే వెళ్లి కొనుక్కొచ్చా...
‘‘విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బిఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్) చేశాను. సినిమా అంటే ఇష్టం కాబట్టే ఆ కోర్సు ఎంచుకొన్నాను. డిగ్రీలో సినిమాపై అన్నపూర్ణ స్టూడియోలో ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలు నటుడు కావాలన్న కోరికను నాలో మరింతగా పెంచాయి. డిగ్రీ పూర్తయ్యాక అనుకోకుండా నిర్మాత కొల్లా నాగేశ్వరరావు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. ఆయనకి కూడా సినిమా అంటే చాలా ప్రేమ. మేమిద్దరం సినిమా గురించి మాట్లాడుకొనేవాళ్లం. ‘డిగ్రీ అయ్యాక ఏం చేయాలనుకొంటున్నావు’ అని ఆయన అడిగితే.. నేను పీజీ చేయాలనుకొంటున్నాను కానీ, డబ్బులు లేవు’ అని చెప్పాను. ఆయన సాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. ‘నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి నటన వైపు దృష్టి పెడతా’ అన్నా. అదేదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా అన్నారు. ఆయనకి కూడా సినిమా తీయాలనే ఆసక్తి ఉండటంతో మేమిద్దరం మాట్లాడుకొని మలయాళంలో విజయవంతమైన ‘తట్టాత్తిన్ మరయతు’ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. ఆ సినిమా రీమేక్ హక్కుల్ని కూడా నేనే వెళ్లి కొనుక్కొచ్చా. ఒక కథానాయకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అన్నీ నేనే దగ్గరుండి చూసుకొన్నాను.’’
అందరికీ చేరువవుతాననే నమ్మకం ఉంది
‘‘ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. సంగీతానికి ప్రాధాన్యముంది. సుబ్రహ్మణ్య శాస్త్రి అనే కుర్రాడికీ, ఆయేషా అనే అమ్మాయికీ మధ్య పరిచయం అవడం, ప్రేమ పుట్టడం, ప్రేమించుకొన్న తర్వాత వాళ్లిద్దరి మనసుల్లో కనిపించే భావోద్వేగాలు... ఇవన్నీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణం విషయంలోనూ బాధ్యతలు తీసుకోవాల్సి రావడంతో సినిమా ఆరంభమైన తర్వాత కొన్ని రోజులు నటించేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఆ తర్వాత మాత్రం పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాను. సినిమా గురించి తెలిసినా... నటనలో మాత్రం నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. సుబ్రహ్మణ్యం పాత్రతో అందరికీ చేరువవుతాననే నమ్మకం నాకుంది.’’
ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో!
‘‘నా అభిరుచికి తగ్గట్టుగా, నాకు నప్పుతుందనుకున్న కథని, నేనే ఎంచుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో. నాకు నచ్చిన కథ కావడంతో పాత్రలో తొందరగా ఇమిడిపోయాను. రావు రమేష్‌గారితో పాటు పలువురు సీనియర్ నటీనటులతో కలిసి నటించడం చక్కటి అనుభవం. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో నటించడం మంచి అనుభూతినిచ్చింది. దర్శకత్వం చేయడం ఆమెకీ కొత్తే అయినా... అనుభవం ఉన్న దర్శకురాలిగా చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న వయసులో కథానాయకుడు ఆయ్యాను కాబట్టి మరిన్ని ప్రేమకథలు చేయాలనుకొంటున్నాను. తదుపరి కూడా ఇదే సంస్థలో ఓ ప్రేమకథలో నటిస్తా.’’