Saheba Subramanyam
-
రంగడే రంగంలోకి దించాడు...
ఒకప్పటి బాలనటుడు నేడు స్టార్ హీరోలను తయారు చేస్తున్నారు. రంగస్థల నటుడిగా ఆరంగేట్రం చేసి సినీ ప్రపంచంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నటుడిగా, దర్శకునిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఊహ తెలియక ముందే నాటకరంగంలో ప్రవేశించారు. అనూహ్యంగా జరిగిన ఓ ఘటన ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. సినీరంగంలో తెరవెనక నా అనే వారు లేకపోయినా, ఉన్నత స్థాయికి ఎదిగి ఎందరో స్టార్ హీరోలను తయారు చేస్తున్న లంక సత్యానంద్ టర్నింగ్ పాయింట్ ఈ వారం.. అది విశాఖపట్నంలోని కోటవీధి. రంగస్థల దర్శకుడు వై.ఎస్.రాజు ఇల్లు నాటకాల రిహార్సల్స్‌తో సందడిగా ఉండేది. 1967 జనవరిలో 'నాలుగిళ్ల చావిడి' అనే నాటకానికి పూజా కార్యక్రమం జరుగుతోంది. బాలనటుడు రంగడు పాత్రధారి దానికి గైర్హాజరయ్యాడు. అంతే.. అందరిలోనూ ఆందోళన. ఏం చేద్దాం.. ఆపేద్దామా? అని ఆలోచించారు. ఇంతలో ఇంట్లోని వారు 'ఆపేయడం ఎందుకు? మన బన్నూ ఉన్నాడుగా.. వాడితోనే రంగడు వేషం వేయించొచ్చుకదా!' అన్నారు. ఏరా బన్నూ...రంగడు కేరక్టర్ వేస్తావట్రా! అన్నాడు మేనమామ వై.ఎస్ రాజు. ఓ ఎస్ మావయ్యా అంటూ ఓకే చెప్పాడు బన్నూ. ఆ బన్నూయే సత్యానంద్! అలా ఆ రంగడు ఆబ్సెంట్ అవడంతో రంగస్థలంలోకి అనూహ్యంగా ప్రవేశించాడు ఏడేళ్ల మన ‘రంగడు’. అదే ఏడాది నవంబర్‌లో 'విధి' నాటకంలో కుర్రాడి పాత్రకు సత్యానంద్‌ను ఎంపిక చేశారు. ఆ నాటకంలో ఉత్తమ ప్రతిభకు మెచ్చి ఎస్వీరంగారావు సత్యానంద్‌కు రూ.116, వెండికప్ ఇచ్చారు. అప్పట్నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు. 40సార్లు ఉత్తమ బాలనటుడి అవార్డులందుకున్నాడు. రంగస్థల దిగ్గజాలు అత్తిలి కృష్ణారావు, చాట్ల శ్రీరాములు, జేవీ రమణమూర్తి, సోమయాజులు వంటి వారి దర్శకత్వాల్లో వచ్చిన నాటకాల్లో 25 సార్లు ఉత్తమ నటునిగా ప్రసంశలందుకున్నారు. నిక్కరు వేసుకునే వయసులోనే ఫుల్ఫ్యాంట్ ఎరువు తెచ్చుకుని యుగసంధ్య అనే నాటకానికి దర్శకత్వం వహించారు. కళాజ్యోత్స్న నాటక సంస్థను స్థాపించి 15 నాటకాలు, 60 నాటికలను ప్రదర్శించి 98 సార్లు ఉత్తమ దర్శకునిగా ఖ్యాతి గడించారు. సినీ ప్రస్థానంలోకి... సత్యానంద్ సినీరంగ ప్రవేశమూ అనూహ్యంగానే జరిగింది. ‘మనిషి నూతిలో పడితే’ నాటకం ఆయనను సినిమాల వైపు మళ్లించింది. దర్శకుడు జంధ్యాల ఈ నాటకంలో సత్యానంద్ (అప్పటికి 20 ఏళ్ల వయసు) దర్శక ప్రతిభను చూసి మల్లెపందిరి (1980) సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేయమని ఆహ్వానించారు. మద్రాస్‌లో ఆంధ్ర క్లబ్ నాటకోత్సవాల్లో వంశీతో పరిచయం ఏర్పడింది. తన మంచుపల్లకి సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత శ్రీమతి కావాలి, చైతన్యం, కళ్లు, కలికాలం ఆడది వంటి సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. 82 మంది స్టార్లకు శిక్షణ.... మంచుపల్లకి సినిమా ద్వారా మెగాస్టార్ చిరంజీవి సత్యానంద్‌కు పరిచయమయ్యారు. 1991లో తన సోదరుడు పవన్ కల్యాణ్‌కు శిక్షణ ఇవ్వాలని చిరు సత్యానంద్‌కు ఫోన్ చేశారు. మెగాస్టార్ తమ్ముడికి నటనలో శిక్షణ ఇవ్వడాన్ని చాలెంజ్‌గా తీసుకుని సక్సెస్ అయ్యారు. 1992లో సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సూచనతో మహేష్‌బాబుకు, ఆ తర్వాత ప్రభాస్, రవితేజ, కల్యాణ్‌రామ్, జయం రవి, బ్రహ్మాజీ తదితరులు ఆయన వద్ద నటనలో శిక్షణ పొందారు. ఇప్పటిదాకా సత్యానంద్ తెలుగు, తమిళ, కన్నడల్లో 82 మంది స్టార్లను తయారు చేశారు. 1994లో ఏయూ థియేటర్ ఆర్ట్స్‌లో సత్యానంద్ ఫ్యాకల్టీగా ఉద్యోగంలో చేరారు. రెండు పడవలపై ప్రయాణం సరికాదని 2002లో జాబ్‌కు రిజైన్ చేశారు. స్నేహితుల ప్రోత్సాహం.... ఉద్యోగం మానేసి యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలనుందని తన ఫ్రెండ్, ఆడిటర్ ఈమని భాస్కరరామ్మూర్తికి చెప్పారు. ఆయన మంచి నిర్ణయమన్నాడు. సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ (సాయి) పేరును ఆయన అప్పటికప్పుడే ఖరారు చేశారు. ఈ సంగతిని బాల్యమిత్రుడు అన్నంరెడ్డి కృష్ణకుమార్‌కు చెప్పారు. ఆయన జగదాంబ జంక్షన్లో ఇనిస్టిట్యూట్ కట్టించి ఇచ్చారు. 100 మంది హీరోలు లక్ష్యం.. ఇప్పటికి 82 మందికి నటనలో శిక్షణ ఇచ్చి హీరోలుగా తీర్చిదిద్దాను. ఆ సంఖ్యను వందకు చేర్చాలన్నది నా సంకల్పం. సినిమాకు దర్శకత్వం వహించాలని కోరిక ఉంది. నటనలో శిక్షణపై సిలబస్‌ను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఎంతమంది సినీ పెద్దలు ప్రెజర్ పెట్టినా హైదరాబాద్ వెళ్లలేక పోతున్నాను. ఇంకోమాట...నాటకాల్లోనే మునిగి తేలుతున్నాడు.. కుటుంబానికి ఉపయోగపడడని కుటుంబ సభ్యులు అనేవారు. అమ్మా, నాన్న చనిపోయాక ఐదుగురు తమ్ముళ్లకు, ఏకైక సోదరికి పెళ్లి చేశాను. వాళ్లకు ఇళ్లు కట్టించి ఇచ్చాను. నాకు ఇప్పటికీ సొంతిల్లు లేదు. కేఆర్ఎం కాలనీలో అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. ఫిల్మ్ ఇని స్టిట్యూట్‌కు ప్రభుత్వం స్థలం ఇవ్వాలని కోరుతున్నాను. మా అబ్బాయి సినిమా విడుదల.. నా కుమారుడు రాఘవేంద్రరాజ్ బీటెక్ గ్రాడ్యుయేట్. నేను ఎందరినో సినీ నటులుగా తీర్చిదిద్దుతున్నా తనకు మాత్రం జాబ్‌పైనే ఆసక్తి. కానీ తనలో టాలెంట్‌ను నేను ఎపుడో గుర్తించాను. సమయం వచ్చినప్పుడు సినిమాల్లో పెట్టాలనుకునే వాడిని. మా కుటుంబానికి హాస్యనటుడు ఎంఎస్ నారాయణతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎంఎస్ కుమార్తె శశికిరణ్ నారాయణ 'సాహెబా సుబ్రహ్మణ్యం' అనే మలయాళ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది. అనూహ్యంగా అందులో రాఘవేంద్రరాజ్కు కామెడీ రోల్ లభించింది. ఆ సినిమా శనివారం రాష్ట్రంలో విడుదలయింది. విశాఖలో తప్ప. ఎందుకంటే రజనీకాంత్ లింగ సినిమా విడుదలవుతున్నందున థియేటర్లు దొరకలేదు. ఇంకా మరో రెండు సినిమాల్లో రాజ్ నటిస్తున్నాడు. -
తొలి ప్రయత్నంగా ఒక విలువైన ప్రేమకథను తీయడం సంతృప్తినిచ్చింది
- డా. నాగేశ్వరరావు కొల్లా వృత్తిరీత్యా ఆయనొక డాక్టరు. కానీ సినిమా అంటే ప్రాణం. ప్రతీ వారం ఓ సినిమా చూడందే నిద్ర పట్టదు. ఆ ప్రేమే నిర్మాతను చేసింది. సినీ ప్రయాణానికి పునాది వేసింది. ‘‘నాకున్న అభిరుచి వల్ల ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రకంగా సినిమా రంగంలో భాగమవుతానని అనుకొన్నా. ఇప్పుడు నిర్మాతగా మారి ఓ మంచి సినిమా తీయడం ఆనందంగా ఉంది. ఇక నుంచి విభిన్నమైన కథలతో క్రమం తప్పకుండా సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నా’’ అంటున్నారు డా. నాగేశ్వరరావు కొల్లా. ఇండో ఇంగ్లీష్ ప్రొడక్షన్స్‌పై డా. నాగేశ్వరరావు కొల్లా నిర్మించిన చిత్రం ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. దిలీప్ కుమార్, ప్రియాల్ గోర్ జంటగా నటించారు. శశికిరణ్ నారాయణ దర్శకత్వం వహించారు. డా. సువర్ణ కొల్లా సమర్పించారు. నేడు (13న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొ స్తోంది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు కొల్లాతో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివి.. - చిత్ర కథానాయకుడు దిలీప్ కుమార్ పరిచయంతో సినిమా గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. తన కోసమే మలయాళ చిత్రం ‘తటాత్తిన్ మరయతు’ రీమేక్ హక్కులు కొన్నాను. ఆ హక్కులు కొన్నాక ఇలాంటి ఓ మంచి చిత్రాన్ని మనమే ఎందుకు నిర్మించకూడదు అనే ఆలోచన వచ్చింది. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని నిర్మాణంలోకి అడుగుపెట్టాం. తొలి ప్రయత్నంగా ఒక విలువైన ప్రేమకథను తీయడం సంతృప్తినిచ్చింది. ఈ సినిమాని కొత్తవాళ్లతో తీయడానికి ఓ ప్రధానమైన కారణం ఉంది. నేను డాక్టరు వృత్తిని చేపట్టిన కొత్తలో పైకి ఎదగాలని, పేరు తెచ్చుకోవాలని ఎంతో కసితో పనిచేశా. ఆ కసి, పట్టుదల నవతరంలో మరింత మెండుగా ఉంటాయని భావించి నాయకానాయికలుగా, దర్శకునిగా కొత్తవాళ్లని ఎంపిక చేసుకొని ఈ సినిమా చేశా. - భావోద్వేగాల సమ్మేళనమే ఈ చిత్రం. ప్రేమలో పడ్డ ఓ యువకుడిలో భావోద్వేగాలు ఎలా మారుతుంటాయనే అంశం ఇందులో కీలకం. తన ప్రేయసి కదలికల అనుగుణంగా అతనిలో ఎలాంటి మార్పులు కనిపిస్తుంటాయో ఇందులో చాలా బాగా చూపించారు దర్శకురాలు. దిలీప్, ప్రియాల్ జంట తెరపై చూడ ముచ్చటగా ఉంటుంది. మలయాళంలో ఈ కథకి మంచి ఆదరణ దక్కింది. భారీ వసూళ్లు దక్కాయి. అదే స్థాయిలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని భావిస్తున్నాం. మేం పరిశ్రమకు కొత్తే అయినా నిర్మాణ పరంగా ఎక్కడా ఇబ్బందులు పడలేదు. పక్కా ప్రణాళికతో సెట్స్‌పైకి వెళితే బడ్జెట్ విషయంలోనూ తేడాలు రావనేది నా అభిప్రాయం. అయితే థియేటర్ల విషయంలోనే కొంచెం ఇబ్బందులు తలెత్తాయి. అన్ని ఇబ్బందుల్నీ అధిగమించి మంచి సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకం మాకుంది. తదుపరి మా సంస్థలో మరిన్ని సినిమాలు తెరకెక్కుతాయి. స్నేహితులతో కలసి మంచి కథల్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచన ఉంది. -
ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ...సాహెబా సుబ్రహ్మణ్యం
అండదండలు లేకపోతే చిత్ర పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టం అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. అయితే అప్పుడప్పుడు కొందరు ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా పట్టుదలతో అవకాశాల్ని అందుకొంటుంటారు. ప్రతిభ ఉంటే చాలు.. ఎవరి అండ లేకపోయినా నెగ్గుకురావచ్చు అని నిరూపిస్తుంటారు. ఆ జాబితాలో మరో కథానాయకుడు చేరాడు. అతని పేరు.. దిలీప్‌కుమార్. చిన్నప్పట్నుంచీ సినిమా కలలు కన్నాడు. ఎప్పటికయినా వెండితెరపై తనను తాను చూసుకోవాలనుకొన్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసి... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం అందుకొన్నాడు. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో ఇండో ఇంగ్లిష్ ప్రొడక్షన్స్ పతాకంపై డా. నాగేశ్వరరావు కొల్లా నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కథానాయకుడు దిలీప్‌కుమార్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ఆ విషయాలివీ... మలయాళం సినిమా రీమేక్ హక్కుల్ని నేనే వెళ్లి కొనుక్కొచ్చా... ‘‘విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో బిఎస్సీ (విజువల్ కమ్యూనికేషన్) చేశాను. సినిమా అంటే ఇష్టం కాబట్టే ఆ కోర్సు ఎంచుకొన్నాను. డిగ్రీలో సినిమాపై అన్నపూర్ణ స్టూడియోలో ఇంటర్న్‌షిప్ చేశాను. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలు నటుడు కావాలన్న కోరికను నాలో మరింతగా పెంచాయి. డిగ్రీ పూర్తయ్యాక అనుకోకుండా నిర్మాత కొల్లా నాగేశ్వరరావు ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఆయనకి కూడా సినిమా అంటే చాలా ప్రేమ. మేమిద్దరం సినిమా గురించి మాట్లాడుకొనేవాళ్లం. ‘డిగ్రీ అయ్యాక ఏం చేయాలనుకొంటున్నావు’ అని ఆయన అడిగితే.. నేను పీజీ చేయాలనుకొంటున్నాను కానీ, డబ్బులు లేవు’ అని చెప్పాను. ఆయన సాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తావు అని అడిగారు. ‘నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి నటన వైపు దృష్టి పెడతా’ అన్నా. అదేదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా అన్నారు. ఆయనకి కూడా సినిమా తీయాలనే ఆసక్తి ఉండటంతో మేమిద్దరం మాట్లాడుకొని మలయాళంలో విజయవంతమైన ‘తట్టాత్తిన్ మరయతు’ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. ఆ సినిమా రీమేక్ హక్కుల్ని కూడా నేనే వెళ్లి కొనుక్కొచ్చా. ఒక కథానాయకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అన్నీ నేనే దగ్గరుండి చూసుకొన్నాను.’’ అందరికీ చేరువవుతాననే నమ్మకం ఉంది ‘‘ఫ్రెష్‌నెస్ ఉన్న ఒక మంచి ప్రేమకథ... ‘సాహెబా సుబ్రహ్మణ్యం’. సంగీతానికి ప్రాధాన్యముంది. సుబ్రహ్మణ్య శాస్త్రి అనే కుర్రాడికీ, ఆయేషా అనే అమ్మాయికీ మధ్య పరిచయం అవడం, ప్రేమ పుట్టడం, ప్రేమించుకొన్న తర్వాత వాళ్లిద్దరి మనసుల్లో కనిపించే భావోద్వేగాలు... ఇవన్నీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నిర్మాణం విషయంలోనూ బాధ్యతలు తీసుకోవాల్సి రావడంతో సినిమా ఆరంభమైన తర్వాత కొన్ని రోజులు నటించేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఆ తర్వాత మాత్రం పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాను. సినిమా గురించి తెలిసినా... నటనలో మాత్రం నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. సుబ్రహ్మణ్యం పాత్రతో అందరికీ చేరువవుతాననే నమ్మకం నాకుంది.’’ ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో! ‘‘నా అభిరుచికి తగ్గట్టుగా, నాకు నప్పుతుందనుకున్న కథని, నేనే ఎంచుకొని చేసిన సినిమా ఇది. ఇలాంటి అవకాశం ఎవ్వరికీ రాదేమో. నాకు నచ్చిన కథ కావడంతో పాత్రలో తొందరగా ఇమిడిపోయాను. రావు రమేష్గారితో పాటు పలువురు సీనియర్ నటీనటులతో కలిసి నటించడం చక్కటి అనుభవం. శశికిరణ్ నారాయణ దర్శకత్వంలో నటించడం మంచి అనుభూతినిచ్చింది. దర్శకత్వం చేయడం ఆమెకీ కొత్తే అయినా... అనుభవం ఉన్న దర్శకురాలిగా చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న వయసులో కథానాయకుడు ఆయ్యాను కాబట్టి మరిన్ని ప్రేమకథలు చేయాలనుకొంటున్నాను. తదుపరి కూడా ఇదే సంస్థలో ఓ ప్రేమకథలో నటిస్తా.’’ -
మా అమ్మాయి బాగా తీసింది!
‘‘మా అమ్మాయికి దర్శకత్వం అంటే మొదట్నుంచీ మక్కువ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా తీసింది. మా అమ్మాయి అని కాదు కానీ, ఈ సినిమా ఎంతో బాగా తీసింది’’ అని హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ చెప్పారు. ఆయన కుమార్తె శశికిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ ఈ నెల 13న విడుదల కానుంది. దిలీప్‌కుమార్, ప్రియాల్గోర్ కాంబినేషన్లో డా. సువర్ణ కొల్ల సమర్పణలో డా. కొల్ల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. శశికిరణ్ మాట్లాడుతూ -‘‘నా కుటుంబం వెన్నుదన్నుతోనే నేనీ స్థాయికి చేరుకున్నా. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు’’ అని అన్నారు. తెలుగుదనం ఉట్టిపడే సినిమా ఇదని నిర్మాత తెలిపారు. -
'ఎమ్.ఎస్.నారాయణ' కుమార్తే దర్శకత్వంలో సాహేబా సుబ్రమణ్యం