ఆ సలహా ఇళయరాజా గారిదే : రమేశ్ వర్మ
‘‘ ‘వీర’ తర్వాత ఓ లవ్‌స్టోరీ చేద్దామనిపించి కథ రాసుకున్నా. ఆ కథతో నాగశౌర్యను హీరోగా పరిచయం చేద్దామనుకున్నా. కానీ అప్పట్లో కొత్త హీరో నాగ శౌర్యతో అంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. కానీ నేను ఎప్పటికైనా నాగశౌర్యతోనే చేయాలనుకున్నా. ఇన్నాళ్లకు కుదిరింది’’ అని దర్శకుడు రమేశ్‌వర్మ చెప్పారు. నాగశౌర్య, పల్లక్ లల్వానీ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘అబ్బాయితో అమ్మాయి ’ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా రమేశ్ వర్మ చెప్పిన విశేషాలు...
♦ నిజానికి నేను అప్పట్లో నాగశౌర్య కోసం రాసుకున్న కథకు, ‘గుండెజారి గల్లంతయ్యిందే’కు పోలికలున్నాయి. అందుకే ఆ కథను పక్కనపడేసి, కొత్తగా ‘అబ్బాయితో అమ్మాయి’ కథ రెడీ చేసుకున్నా. మంచి నిర్మాతలు అండగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది.
♦ సోషల్ మీడియా అంతా మంచి కోసమే అని నా ఫీలింగ్. కానీ చాలామంది ఊహకూ, వాస్తవానికీ తేడా గమనించడం లేదు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల సాయంతో ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో పడే ఇద్దరు స్నేహితుల కథ ఇది. ప్రేమ అనేది లవర్స్‌కే కాకుండా వారి కుటుంబ సభ్యులతో కూడా ముడిపడి ఉంటుందని ఈ చిత్రం ద్వారా చెబుతున్నా.
♦ సంగీత దర్శకులు ఇళయరాజా గారితో నాకు మంచి అనుబంధం ఉంది. అసలు ఆయనకు నేను మొదట ‘వస్తా నీ వెనుక’ కథ వినిపించాను. ఆ తర్వాత ‘అబ్బాయితో అమ్మాయి’ కథ కూడా నేరేట్ చేశాను. ముందు ఈ సినిమా చేయమని ఆయన సలహా ఇచ్చారు. అలా ఈ సినిమా ప్రారంభించి, పూర్తి చేయడానికి ప్రధాన కారకులు ఇళయరాజా గారే. ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేయ మని ఆయన సూచించారు. దాంతో అక్కడా రిలీజ్ చేస్తున్నాం.
♦ త్వరలో ఓ ప్రముఖ హీరోతో ఓ లవ్‌స్టోరీ ప్లాన్ చేస్తున్నా. ‘ఇదేదో బాగుందే చెలి’ అనే టైటిల్ అనుకుంటున్నా. 2016 మార్చి నుంచి ఆ సినిమా స్టార్ట్ అవుతుంది.