సాక్షి, చెన్నై : సినీ దర్శకుడు సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో అన్నీ ప్రైవేట్ సంస్థల అధీనంలోకి వెళ్లిపోతున్నాయి. అన్నింటికీ పన్ను కడుతున్నాం. విద్యను, వైద్యాన్ని కొనుక్కుంటున్నాం. ఇక ప్రభుత్వం చేసే పనేంటని' ఆయన ప్రశ్నించారు. మన దేశ విద్యావిధానాన్ని మార్చాలన్న కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ పాఠం. రోలాన్ మూవీస్ పతాకంపై పి.ఎస్.జుపిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇ.రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తీక్, మోనా హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మనో ఛాయాగ్రహణాన్ని, గణేశ్ రాఘవేంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు సీమాన్ మాట్లాడుతూ.. ముందుగా పాఘం పేరుతో మన విద్యా విధానాన్ని ప్రశ్నించే చక్కని చిత్రాన్ని నిర్మిస్తున్న జుపిన్‌ను అభినందించారు. ఈ చిత్రం కచ్చితంగా పలు అవార్డులను గెలుచుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక విద్యను నేర్చుకోవడం విద్యార్ధుల హక్కు అని, దాన్ని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అలాంటిది ఇప్పుడు విద్యే కాదు, వైద్యం, ఇతర అన్నీ వ్యాపారం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్వహించాల్సినవన్నీ ప్రైవేట్‌పరం అవుతున్నాయనీ, అన్నిటికీ మనం పన్నులు చెల్లిస్తున్నా ఏదీ అందుబాటులోకి రావడం లేదని.. ప్రభుత్వం చేసే పనేంటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వంటివారే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారంటే పాలకులకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై నమ్మకం లేదని నిరూపితమైందన్నారు. ఇక్కడ డబ్బున్నోళ్లే ప్రాణాలను కాపాడుకుంటారని, డబ్బు లేనోళ్లు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు దర్శకుడు సీమాన్.