
‘‘రామ్‌లీలా’ సినిమా అప్పటి నుంచి నాకు, అజయ్ భూపతికి మంచి స్నేహం ఉంది. ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రాన్ని అజయ్ నాతోనే చెయ్యాలనుకున్నారు. కానీ, కుదరలేదు’’ అని ఇంద్రసాయి వెలివెల అన్నారు. శ్రీహర్ష మంద దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామ చక్కని సీత’. ఈ చిత్రంలో ఇంద్రసాయి, సుకృత వాగ్లే జంటగా నటించారు. జి.ఎల్. ఫణికాంత్, విశాలక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఇంద్రసాయి మాట్లాడుతూ– ‘‘బీటెక్ తర్వాత నటనలో శిక్షణ తీసుకుని ఏడేళ్ల క్రితం పరిశ్రమలో అడుగుపెట్టా. ‘రామ్‌లీలా’, ‘వంగవీటి’ చిత్రాల్లో సహాయ నటుడి పాత్రలు చేశాను. నా సన్నిహితుల ద్వారా ‘రామ చక్కని సీత’ ఆడిషన్స్‌కు వెళ్లా. నా నటన నచ్చడంతో శ్రీహర్షగారు హీరోగా అవకాశమిచ్చారు. ‘వంగవీటి’ సమయంలోనే ‘ఆర్‌ఎక్స్ 100’ ప్రాజెక్టు గురించి అజయ్ చెప్పారు. 80 కేజీల బరువు ఉన్న నేను ఆ పాత్ర కోసం దాదాపు 15 కిలోలు తగ్గా. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కార్తికేయగారికి దక్కింది. అయినా ఇప్పటికీ నాకు–అజయ్‌కు మంచి స్నేహం ఉంది. ‘రామ చక్కని సీత’లో దుందుడుకు స్వభావం కలిగిన బాలు పాత్రలో కనిపిస్తా. మంచి కథలు దొరికితే కమల్‌హాసన్‌లా విభిన్న పాత్రలు పోషించాలని ఉంది. త్వరలోనే అగస్త్య మంజు దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు.
పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నా
సుకృత వాగ్లే మాట్లాడుతూ –‘‘మాది కర్ణాటక. కన్నడలో 7 చిత్రాలు చేశా. కన్నడ ‘బిగ్‌బాస్’ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో నాకిది ఫస్ట్ మూవీ. నిర్మాత ఫణీంద్రగారు మాకు దూరపు బంధువు. అయినప్పటికీ నేనూ రెండుసార్లు ఆడిషన్‌లో పాల్గొన్నా. తెలుగమ్మాయి అయితే బావుంటుందని శ్రీహర్ష అనడంతో పట్టుబట్టి తెలుగు నేర్చుకున్నా. ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment