విక్రమన్ టీంకే పట్టం
తమిళసినిమా: ఆదివారం జరిగిన తమిళ దర్శకుల సంఘం ఎన్నికల్లో దర్శకుడు విక్రమన్ జట్టుకే పట్టం కట్టారు. స్థానిక వడపళనిలోని సంగీత కళా కారుల కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో పుదువసంతం, పుదియఅలైగళ్ వర్గాల మధ్య పోటీ జరిగినా, పుదువసంతం నుంచి అధ్యక్షపదవి బరిలో ఉన్న విక్రమన్, కార్యదర్శి పదవి పోటీల్లో ఉన్న ఆర్‌కే సెల్వమణిలతో పుదియ అలైగళ్ వర్గం పోటీ పెట్టలేదు.
మిగిలిని పదవులు ఉపాధ్యక్షుడు, ఉప కార్యదర్శి, కార్యవర్గ సభ్యుల పదవులకు పోటీ జరిగింది. అయితే ఈ సారి కూడా విక్రమన్ వర్గమే విజయకేతం ఎగురవేసింది. కాగా దర్శకుడు విక్రమన్ తమిళ దర్శకుల సంఘం అధ్యక్షపదవికి మూడోసారి ఎంపికయ్యారన్నది గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఈ సంఘానికి కార్యదర్శిగా ఎంపికైన ఆర్‌కే సెల్వమణి ఫెఫ్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఫెఫ్సీకీ తమిళ నిర్మాతల మండలికి మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం కనిపించడం లేదు. సభ్యుల వేతనాల విషయంలో నిబంధనలు పాటించాలని ఫెఫ్సీ, మీకు మీరుగా విధించుక్ను నిబంధనలను తాము పాటించేది లేదని తమిళ నిర్మాతల మండలి పట్టుపడుతుండడంతో సమస్య జఠిలంగా మారింది.
దీంతో మంగళవారం నుంచి ఫెఫ్సీ సమ్మెబాట పట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా తాము షూటింగ్‌లు నిర్వహిస్తామని నిర్మాతల మండలి ప్రకటన చేయడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన తమిళ చిత్ర పరిశ్రమలో నెలకొంది. ఈ విషయంలో ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌కే.సెల్వమణి తమిళ దర్శకుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న నేపధ్యంలో దర్శకుల సంఘం ఈ వివాదంలో ఏ పక్షాన నిలుస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.